మరో మూడు నెలలు గడిస్తే ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ఐదవ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. అమెరికా,దానితో చేతులు కలిపిన ఇతర నాటో దేశాలు అనుసరిస్తున్న వైఖరి వలన ఉక్రేనియన్లు ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లో మరింతగా అక్కడి పరిస్థితి దిగజారటం తప్ప మెరుగయ్యే అవకాశాలు కనిపించటం లేదు. అమెరికా ముందుకు తెస్తున్న శాంతి చర్చల అజెండాను ఎవరూ అంగీకరించటం లేదు. ఎందుకంటే ట్రంప్ ఒక వ్యాపారిగా అమెరికా ప్రయోజనాలను చూస్తున్నాడు తప్ప పరిష్కారానికి పని చేయటం లేదు. ఇదిలా ఉండగా ట్రంప్ దూత స్టీవ్ విట్‌కాఫ్ అక్టోబరు 14వ తేదీన రష్యన్ ప్రతినిధులతో జరిపిన సంభాషణను లీక్ చేశారు. ట్రంప్ ఆగ్రహానికి గురైన బ్లూమ్‌బెర్గ్ దాన్ని ప్రచురించింది. ఈ ఉదంతాన్ని ”విటీ” లీక్స్‌గా వర్ణిస్తున్నారు. ట్రంప్‌ను వ్యతిరేకించే వారి హస్తం దీని వెనుక ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఎవరు అన్నది తేలక ట్రంప్ యంత్రాంగం కాళ్లు తొక్కుకుంటున్నది.
చర్చలను వ్యతిరేకించే వారెవరో ఈ పనిచేశారు. సంభాషణలను ఎవరో వింటున్నారు, ఎవరో బయటపెడుతున్నారు, మేమైతే కాదు అని రష్యా ప్రతినిధులు స్పష్టం చేశారు.సాధారణంగా గూఢచార సంస్థలు ఇలాంటి ఫోన్ కాల్స్‌ను వింటుం టాయి, అవసరాన్నిబట్టి సంభాషణలను లీక్ చేస్తాయి. శాంతి ప్రతిపాదనలపట్ల సుముఖంగా లేని ఉక్రెయిన్ కూడా ఈ పని చేసి ఉండవచ్చని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. గాజా ఒప్పందంగురించి ట్రంప్‌ను పొగడాలని, అలాగే ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ అమెరికాకు శాంతి ప్రతిపాదనతో వచ్చినపుడు తమ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తేట్లుగా పుతిన్‌కు నచ్చ చెప్పాలని విట్‌కాఫ్ కోరినట్లు దానిలో ఉంది. దాన్లో తప్పే ముంది ఎదుటివారిని ఉబ్బించాలంటే అదొక ఉత్తమశ్రేణి ప్రక్రియ అని ట్రంప్ కుమారుడు సమర్ధించాడు. పొగడ్తల కోసం ట్రంప్ ఎంతకైనా దిగజారతాడన్నది ఈ ఉదంతం వెల్లడించింది. బయటకు వచ్చిన సంభాషణ అంశాలపై అధ్యక్ష భవనం మౌనందాల్చింది. ప్రతిపాదనలన్నీ రష్యాకు అనుకూలంగా ఉన్నాయని, విట్‌కాఫ్ నమ్మదగిన వ్యక్తికాదు, చర్చలకు అతగాడు నాయకత్వం వహించటాన్ని అంగీక రించం, రష్యాకు అమ్ముడు పోయిన ఏజెంట్, అతడిని పదవి నుంచి తొలగించా లంటూ రిపబ్లికన్ ఎంపీలు ధ్వజమెత్తారు.
అసలే తమను పక్కన పెడుతున్నాడని ట్రంప్ మీద గుర్రుగా ఉన్న ఐరోపా దేశాల్లో ట్రంప్ ప్రతిపాదనలు, తీరు ఆగ్రహాన్ని కలిగించాయి. అవి రష్యాకు లొంగిపోవటం తప్ప వేరు కాదని మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఐరోపా దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులను స్తంభింప చేశారు.వాటిని అమ్మి ఉక్రెయిన్ పునరుద్ధరణకు ఖర్చు చేయాలన్న ప్రతిపాదన ఉంది. వాటి నుంచి వంద బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే ఐరోపా దేశాలు మరోవంద బిలియన్ డాలర్లు సమకూర్చాలని, ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికా పర్యవేక్షించాలని, వచ్చే లాభంలో సగం అమెరికాకు చెందేట్లు ప్రతిపాదన ఉంది. రష్యా ఆస్తులను అమెరికా కొట్టేయటం, లాభపడటం తప్ప తమకు ఒరిగేదేముందంటూ ఐరోపా ధనిక దేశాలు గట్టిగా వ్యతిరేకించటంతో 28అంశాల నుంచి తొలగించారని చెబుతున్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుషనర్, విట్‌కాఫ్ కలసి రూపొందించిన ఈ అంశాలను 19కి కుదించారు. చర్చల గురించి అమెరికా, ఉక్రెయిన్ ఆశాభావం వెల్లడిస్తున్నప్పటికీ రష్యా వైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన లేదు.
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న డాన్‌బాస్ ఇతర ప్రాంతాలన్నింటినీ ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది. నాటోలో సభ్యత్వం పొందేందుకు అవకాశం లేదు. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా హామీగా ఉంటుంది, అయితే అందుకయ్యే ఖర్చును ఉక్రెయిన్ భరించాలి. ఇరుగుపొరుగు దేశాల మీద రష్యా సైనిక చర్యలకు పూనుకోకూడదు. ఉక్రెయిన్ మిలిటరీపై పరిమితి విధించాలి. లక్షకంటే ఎక్కువ ఉండకూడదని రష్యా చెబుతున్నట్లు, ఆరు లక్షలని అమెరికా, కాదు ఎనిమిది లక్షలని ఉక్రెయిన్, ఐరోపా దేశాలు చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. సంప్రదింపుల నుంచి తమను మినహాయిస్తున్నట్లు భావిస్తున్న ఐరోపా ఈ3 దేశాలుగా పిలుస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
నాటోలో చేరే స్వేచ్ఛఉక్రెయిన్‌కు ఉండాలని చెబుతున్నాయి. ఒప్పందానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది సహజంగానే తలెత్తే ప్రశ్న.మిలిటరీ చర్యను కొనసాగించటం పుతిన్‌కూ ఇబ్బందే కనుక తమకు అనుకూలంగా ఉండే ఒప్పందాన్ని అంగీకరిస్తాడని వేరే చెప్పనవసరం లేదు. రష్యాకు అనుకూల అంశాలను పశ్చిమదేశాలు ఎలాగూ అంగీకరించవు గనుక తానెందుకు ముందుగా బయటపడాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉక్రెయిన్ సంక్షోభంలో పూర్తిగా దిగిన రష్యాకు కొత్తగా వేసే చలేమీ లేదు. గౌరవప్రదంగా ఎలా బయట పడాలన్నదే అమెరికా, ఐరోపా ముందున్న సమస్య. వర్తమానంలో ఇలాంటి విపత్కర పరిస్థితిలో సామ్రాజ్యవాద దేశాలు ఏ అంశంలోనూ ఇరుక్కోలేదంటే అతిశయోక్తి కాదు!
విటీ లీక్స్ – ట్రంప్ దిగజారుడు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



