Friday, November 28, 2025
E-PAPER
Homeఆటలుదీప్తి శర్మకు జాక్‌పాట్‌

దీప్తి శర్మకు జాక్‌పాట్‌

- Advertisement -

వేలంలో రూ.3.20 కోట్ల ధర
అమేలీ, శిఖా పాండే, శ్రీ చరణిపై కోట్ల వర్షం
డబ్ల్యూపీఎల్‌ ప్లేయర్స్‌ మినీ వేలం

నవతెలంగాణ-న్యూఢిల్లీ
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) ప్లేయర్స్‌ మినీ వేలం క్రికెటర్లపై కోట్ల వర్షం కురిపించింది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన భారత క్రికెటర్లు సహా పలువురు విదేశీ క్రికెటర్ల కోసం డబ్ల్యూపీఎల్‌ ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. బ్యాట్‌తో, బంతితో అద్భుత ప్రదర్శన కనబరిచి వన్డే వరల్డ్‌కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన దీప్తి శర్మను మరోసారి యూపీ వారియర్స్‌ తీసుకుంది. రూ.3.20 కోట్లకు దీప్తి శర్మను యూపీ వారియర్స్‌ రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్‌తో తిరిగి సొంతం చేసుకుంది. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీప్తి శర్మ కోసం ప్రాంఛైజీలు ఆసక్తి చూపించాయి.

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌, స్పిన్నర్‌ అమేలీ కార్‌ రూ. 3 కోట్ల ధరతో జాక్‌పాట్‌ దక్కించుకుంది. కివీస్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కోసం ముంబయి ఇండియన్స్‌ భారీ ధర వెచ్చించింది. రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అమేలీని ముంబయి ఇండియన్స్‌ తీసుకుంది. భారత పేస్‌ ఆల్‌రౌండర్‌ శిఖా పాండే వేలంలో అనూహ్య ధర దక్కించుకుంది. రూ 40 లక్షల కనీస ధరతో వేంలో నిలిచిన శిఖా పాండేను రూ.2.40 కోట్లకు యూపీ వారియర్స్‌ సొంతం చేసుకుంది. సోఫీ డివైన్‌ను రూ. 2 కోట్లకు గుజరాత్‌ జెయింట్స్‌, మెగ్‌ లానింగ్‌ను రూ.1.90 కోట్లకు యూపీ వారియర్స్‌, శ్రీ చరణిని రూ.1.30 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌, హెన్రీని రూ.1.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌, లిచ్‌ఫీల్డ్‌ను రూ. 1.20 కోట్లకు యూపీ వారియర్స్‌, లారా వోల్వోర్ట్‌ను 1.10 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆశా శోభనను రూ. 1.10 కోట్లకు యూపీ వారియర్స్‌, జార్జియాను రూ.1 కోటికి గుజరాత్‌ జెయ్సిం సొంతం చేసుకున్నాయి.

శ్రీ చరణికి రూ. 1.30 కోట్లు
ఇటీవల ప్రపంచకప్‌లో స్పిన్‌ మాయాజాలం చూపించిన శ్రీ చరణి.. వేలంలో భారీ ధర దక్కించుకుంది. శ్రీ చరణి స్పిన్‌ మ్యాజిక్‌ పట్ల ముంబయి ఇండియన్స్‌ కోచ్‌ ప్రశంసలు కురిపించటంతో ఆ ప్రాంఛైజీ సైతం ఆమె కోసం పోటీపడుతుందని అనుకున్నారు. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీ చరణి కోసం తొలుత యూపీ వారియర్స్‌ బిడ్‌ వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ సైతం పోటీపడటంతో బిడ్‌ రూ.75 లక్షలకు చేరుకుంది. మళ్లీ రేసులోకి వచ్చిన యూపీ వారియర్స్‌ రూ. 90 లక్షలకు బిడ్‌ వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 1.30 కోట్లకు విన్నింగ్‌ బిడ్‌తో శ్రీ చరణిని సొంతం చేసుకుంది. గత సీజన్‌లో శ్రీ చరణి క్యాపిటల్స్‌కు ఆడటంతో ఆర్‌టీఎం అవకాశం లేకుండా పోయింది.

తెలంగాణ అమ్మాయి, భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష తొలిసారి మహిళల ప్రీమియర్‌ లీగ్‌లోకి ప్రవేశించింది. తొలి సీజన్లోనే త్రిషపై భారీ అంచనాలు ఉండగా.. టాప్‌ ఆర్డర్‌లో యువ ప్లేయర్‌ను మూడేండ్ల కిందట ఎవరూ తీసుకోలేదు. తాజాగా ఆల్‌రౌండర్‌గా నైపుణ్యాలు మెరుగుపర్చుకున్న త్రిషను యూపీ వారియర్స్‌ తీసుకుంది. రూ. 10 లక్షల కనీస ధరకు గొంగడి త్రిష యూపీ వారియర్స్‌ గూటికి చేరుకుంది. తెలంగాణకు చెందిన మరో క్రికెటర్‌, పేసర్‌ అరుంధతి రెడ్డి వేలంలో రూ. 75 లక్షలు దక్కించుకుంది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అరుంధతి కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌ పోటీపడగా.. రూ. 75 లక్షల బిడ్‌తో ఆర్‌సీబీ దక్కించుకుంది. సీనియర్‌ ప్లేయర్‌ శిఖా పాండే కోసం యూపీ వారియర్స్‌, ఆర్‌సీబీ గట్టిగా పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ రేసులోకి వస్తుందని ఆశించినా… యూపీడబ్ల్యూ, ఆర్‌సీబీ బిడ్‌ను రూ. 2 కోట్లు దాటించారు. రూ. 2.4 కోట్లతో యూపీ వారియర్స్‌ శిఖా పాండేను తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -