Friday, November 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుసిగాచీ దర్యాప్తు తీరు ఇలాగేనా?

సిగాచీ దర్యాప్తు తీరు ఇలాగేనా?

- Advertisement -

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
2015 గ్రూప్‌ – 2 ర్యాంకర్లకు ఊరట


హైదరాబాద్‌: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని.. 54 మంది కార్మికులు చనిపోయారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. ”ఈ ప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటి? 237 మంది సాక్షులను విచారించినా దర్యాప్తులో పురోగతి లేదా? పేలుడు ఘటనకు ఇప్పటివరకు బాధ్యులను గుర్తిం చలేదా? పేలుడుపై ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా డీఎస్పీని నియమిస్తారా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనపై దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా సీజే ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీని ఆదేశించారు. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరుకావాలన్నారు. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేశారు.

2015 గ్రూప్‌-2 ర్యాంకర్లకు ఊరట
2015 గ్రూప్‌-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది. ఇటీవల సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన వివాదాస్పద తీర్పును హైకోర్టు సీజే ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ 2015-16లో నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభ్యర్థుల జవాబు పత్రాల్లో వైట్నర్‌, దిద్దుబాట్లు ఉండటం, వాటి మూల్యాంకనంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తీర్పుతో వేలాది మంది ర్యాంకర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే, తాజా పరిణామంలో సీజే ధర్మాసనం సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను నిలిపివేయటం ద్వారా గ్రూప్‌-2 ర్యాంకర్లకు పెద్ద ఊరట లభించింది. తదుపరి విచారణలో తుది నిర్ణయంపై అభ్యర్థులు, ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -