Friday, November 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఆమోదించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లును కేంద్రం ఆమోదించాలి

- Advertisement -

ప్రధాని సమయమిస్తే సీఎం నాయకత్వంలో ఢిల్లీకి వస్తాం
9వ షెడ్యూల్‌లో చేర్చేలా రాజ్యాంగ సవరణ జరగాలి
పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తేవాలి
రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కృషిచేయాలి : ఎంపీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమయమిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. తొమ్మిదో షెడ్యూల్‌ చేర్చేందుకు రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు. తెలంగాణకు చెందిన ఎంపీలు పార్లమెంటు సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చకు తేవాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఎంపీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎంపీల సమావేశం ఏర్పాటు చేశామన్నారు. బీసీల రిజర్వేషన్‌ అంశంపై పార్లమెంటు సమావేశాల్లో నిర్దేశిత ఫార్మాట్‌లో వాయిదా తీర్మానం లేదంటే ప్రశ్నోత్తరాల్లో చర్చకు తేవాలని కోరారు.

ప్రధానమంత్రిని కలిసి అన్ని పార్టీల ఎంపీలూ వినతి పత్రాన్ని ఇవ్వాలని సూచించారు. బీసీల రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్రంలో ఎపిక్‌ సర్వే జరిగిందనీ, ఎంపిరికల్‌ డాటా ఆధారంగా అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు. ఆ బిల్లు గవర్నర్‌ నుంచి కేంద్రానికి వెళ్లి అక్కడ పెండింగ్‌లో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఎంపీలందరూ పార్టీలకతీతంగా ఒక బృందంగా ఏర్పడి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని అన్నారు. ఎంపీలు అడిగిన సమాచారం నిమిషాల్లో లేదా గంటల్లో అందించేందుకు ఢిల్లీలో ప్రణాళిక ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామనీ, దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. నీటిపారుదల శాఖ, విద్యుత్‌ శాఖ, జీఎస్టీ తదితర విషయాలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలకు గురించి గతంలో లేఖలు రాశామని గుర్తు చేశారు. అవి ఢిల్లీలోని ప్రత్యేక విభాగంలో ఎంపీలకు అందుబాటులో ఉంటాయనీ, వాటి ఆధారంగా ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాణానికి విజన్‌ డాక్యుమెంట్‌
వచ్చేనెల తొమ్మిదో తేదీ నాటికి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా సాధించిన విజయాలు, రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించి విజన్‌ డాక్యుమెంట్‌-2047 ఆవిష్కరించబో తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. దేశంలో, ప్రపంచంలో ప్రముఖులను దిగ్గజ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని వివరించారు. 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యసాధనకు అవసరమైన వనరులు, ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కమిటీలు వేస్తున్నామనీ, కేంద్ర మంత్రులు, ఎంపీలందరినీ ఆహ్వానించాలని భావిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇస్తే కమిటీల సభ్యులుగా నమోదు చేస్తామన్నారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలతో ఎంపీలు ఎవరికైనా పరిచయం ఉంటే వివరాలు ఇస్తే వారిని గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానిస్తామని చెప్పారు. కేంద్రానికి సంబంధించిన 12 శాఖల ద్వారా 47 అంశాలను గుర్తించామని అన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించిన అంశం కూడా చర్చించామన్నారు.

ప్రధానిని సమిష్టిగా కలుద్దాం : ఎంపీ రఘునందన్‌రావు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు, రేడియల్‌ రోడ్‌లు, ఇతర సమస్యలపై ప్రధానమంత్రి మోడీ సమయం తీసుకుని సమిష్టిగా కలుద్దామని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు. రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ క్యాడర్‌ కేటాయింపు గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తే సంబంధిత మంత్రిని పార్టీలకతీతంగా కలసి లేఖ ఇద్దామని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన బొగ్గు గనుల విషయంలో అందరం కలిసి ఆ శాఖ మంత్రిని కలుద్దామని ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ చట్టంలో పని దినాలు బాగా తగ్గుతున్నాయని జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ చెప్పారు. దీంతో పేదలకు ఉపాధి లేకుండా పోవడంతోపాటు గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, బీజేపీ ఎంపీ నగేశ్‌, సీఎస్‌ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -