Friday, November 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమొదలైన నామినేషన్ల పర్వం

మొదలైన నామినేషన్ల పర్వం

- Advertisement -

తొలిరోజు మందకొడిగా దాఖలు
సర్పంచ్‌ స్థానాలకు 3,242..వార్డులకు 1,821
అత్యధికంగా నల్లగొండలో 421
అత్యల్పంగా ములుగులో 22
రేపే నామినేషన్లకు చివరి రోజు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామపంచాయతీ సర్పంచ్‌, వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు మందకొడిగా సాగింది. తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆశావహులు అంతగా ఆసక్తి చూపలేదు. ఇంకా రెండు రోజులు గడువుండటంతో పాటు నామినేషన్‌ వేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లను సమకూర్చుకోవడం తదితర అంశాలపైనే అభ్యర్థులు దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడుతలో 4,236 సర్పంచ్‌ స్థానాలకు 3,242, 37,440 వార్డులకు కేవలం 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. 318 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నల్లగొండలో అత్యధికంగా 421 నామినేషన్లు వచ్చాయి. 48 స్థానాలున్న ములుగు జిల్లాలో అత్యల్పంగా 22 నామినేషన్లు వచ్చాయి. 1,246 వార్డుమెంబర్లకు గాను సంగారెడ్డిలో అత్యధికంగా 149, మెదక్‌, కొమురం భీం ఆసీఫాబాద్‌ జిల్లాల్లో 4 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున ఆశావహులు క్యూ కడతారని భావిస్తున్నారు.

బలవంతంగా ఏకగ్రీవం చేస్తే ఎన్నిక నిలిపివేత సర్క్యులర్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగితే ఆ ఎన్నికను నిలిపి వేయాలని జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరంద సర్య్కులర్‌ జారీ చేశారు. వేలం ద్వారా, బలవంతంగా సర్పంచ్‌, వార్డు మెంబర్‌ స్థానాలకు జరిగే ఏకగ్రీవాలపై అధికారులకు ఎన్నికల కమిషన్‌ కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో వేలంపై ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు మకరంద తెలిపారు. ఏదైనా గ్రామంలో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరిస్తు న్నారని ఫిర్యాదులు అందినప్పుడు, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు.

రాష్ట్ర స్థాయి ఎంసీసీ కమిటీ ఏర్పాటు
పంచాయతీల ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌ చైర్మెన్‌గా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సక్రమంగా జరిగేలా ఈ కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

లీగల్‌ సెల్‌ ఏర్పాటు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు, ఇతర ఎన్నికల వ్యవహారాలపై కోర్టుల్లో వరుస పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం పంచాయ తీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ సృజన సర్క్యులర్‌ జారీ చేశారు. ముగ్గురు సూపరింటెండెంట్‌ స్థాయి అధికారులను ఈ సెల్‌కు నియమించారు. లీగల్‌ సెల్‌లో కిషన్‌ సింగ్‌, మాధురి లత, క్రాంతి కిరణ్‌లు సూపరిండెంట్‌లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోర్టుల్లో కొత్తగా దాఖలయ్యే కేసులకు జిల్లా స్థాయి అధికారులు 24 గంటల్లోగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులకు వివరాలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడానికి, కోర్టు కేసులు ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక సెల్‌ జిల్లాలన్నింటితో సమన్వయం చేస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -