Friday, November 28, 2025
E-PAPER
Homeజాతీయంనీకిది..నాకది

నీకిది..నాకది

- Advertisement -

సబ్సిడీ ఇచ్చారు..విరాళాలు దండుకున్నారు
కేంద్రం సబ్సిడీ రూ.44,203 కోట్లు..టాటా గ్రూప్‌ చందా రూ.758 కోట్లు
గతేడాది బీజేపీకి అధిక మొత్తంలో అందిన నిధులు
సెమీకండక్టర్‌ యూనిట్లకు ఆమోదం తర్వాతే ఈ పరిణామం
బీజేపీ-టాటా క్విడ్‌ప్రోకోపై కొత్త అనుమానాలు

బీజేపీ, కార్పొరేట్‌ రంగం మధ్య ఉన్న సంబంధాల గురించి కొత్తగా చెప్పాల్సినవసరం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు, బడాపారిశ్రామికవేత్తలకు ఏదో విధంగా లబ్ది చేకూర్చటం.. అందుకు కృతజ్ఞతగా కాషాయపార్టీకి భారీ ఎత్తున విరాళాలు చేకూరటం షరా మామూలుగా మారింది. దీంతో ప్రస్తుతం దేశంలోనే అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా బీజేపీ ఉన్నది. తాజాగా బీజేపీ-టాటా గ్రూప్‌నకు మధ్య సంబంధం గురించి కొత్త చర్చ వెలుగులోకి వచ్చింది. 2024లో కేంద్రం సెమీకండక్టర్‌ యూనిట్లకు భారీ ప్రభుత్వ సబ్సిడీలు ప్రకటించింది. ఈ నిర్ణయంతో టాటా గ్రూప్‌నకు భారీ మొత్తంలో రాయితీ అందింది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే టాటా గ్రూప్‌ బీజేపీకి చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ విరాళాన్ని అందించింది. ఇప్పుడిదే పలు అనుమానాలకు దారి తీస్తున్నది.

న్యూఢిల్లీ : దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడిలో ఉన్నది. రాజకీయ పార్టీలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో గతేడాది ఫిబ్రవరి 29న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు సెమీకండక్టర్‌ యూనిట్లకు ఆమోదం లభించింది. వీటిలో రెండింటిని టాటా గ్రూప్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ ఖర్చులో కేంద్రం 50 శాతం, అంటే రూ.44,203 కోట్లు సబ్సిడీగా భరిస్తోంది. ఈ విధంగా కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం జరిగిన నాలుగు వారాల్లోనే టాటా గ్రూప్‌ బీజేపీకి రూ.758 కోట్లు విరాళంగా అందించింది. ఈ విరాళం టాటా గ్రూప్‌ ‘ప్రొగ్రెస్సివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌’ ద్వారా బదిలీ అయింది.

2024-25లో టాటా గ్రూప్‌నకు చెందిన 15 కంపెనీలు కలిపి రూ.915 కోట్లను రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇచ్చాయి. ఇందులోపైన తెలిపి న మొత్తంలో అత్యధికంగా బీజేపీకి అందించగా.. కాంగ్రెస్‌కు రూ.77.3 కోట్లు సమర్పించుకు న్నాయి. ఇక బీఆర్‌ఎస్‌, వైసీపీ, టీఎంసీ, డీఎంకే, బీజేడీ, జేడీ(యూ), ఎల్జేపీ(ఆర్‌వీ) వంటి ఎనిమిది ప్రాంతీయ పార్టీలకు రూ.10 కోట్ల చొప్పున అందించాయి. ఇక 2021-24 మధ్య టాటా గ్రూప్‌.. ప్రొగ్రెస్సివ్‌ ట్రస్ట్‌ ద్వారా ఎలాంటి రాజకీయ విరాళాలూ ఇవ్వలేదు. కానీ 2024లో, అది కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక్కసారిగా భారీ మొత్తంలో రూ.915 కోట్ల విరాళాలను అందించటం తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నది. అనేక చర్చలకు దారి తీస్తున్నది.

ఇతర కంపెనీలదీ ఇదే దారి..
ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ఇతర కంపెనీలు కూడా టాటా గ్రూప్‌ మార్గాన్నే అనుసరించాయి. బీజేపీకి భారీ మొత్తంలో విరాళాలు సమర్పించుకు న్నాయి. ఇందులో మురుగప్ప గ్రూప్‌ రూ.125 కోట్లు, కైన్స్‌ టెక్నాలజీ ఎండీ రమేశ్‌ కుంహికన్నన్‌ రూ.12 కోట్లు కాషాయపార్టీకి అందించారు. తమిళనాడులోని మురుగప్ప గ్రూప్‌నకు మూడో సెమీకండక్టర్‌ యూనిట్‌ వ్యయానికి కేంద్రం రూ.3,501 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఇక కేన్స్‌ టెక్నాలజీ నుంచి 2023-24లో బీజేపీకి రూ.12 కోట్లు విరాళంగా అందటం, ఆ తర్వాతే గుజరాత్‌లో మరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి ఆమోదం లభించటం గమనార్హం.

పదేండ్ల నుంచి ఇదే తంతు
కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత పదేండ్లుగా రాజకీయ విరాళాల్లో బీజేపీ ఎవరికీ అందనంత ముందంజలో ఉన్నది. 2024 ఏప్రిల్‌ 2న టాటా గ్రూప్‌ ఇచ్చిన ఈ భారీ విరాళం.. 2023-24లో ఏదేనీ రాజకీయ పార్టీకి అందిన అతిపెద్ద మొత్తాన్ని మించిపో యింది. కాగా ఇప్పటివరకు 2024-25కు సంబంధించి ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌ నుంచి వచ్చిన విరాళాలు ప్రకటించలేదు. టాటా గ్రూప్‌ చివరిసారిగా 2018-19లో భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చింది. ఆ ఏడాది రూ.478 కోట్లు సమర్పించినట్టు పలు రాజకీయపార్టీల నివేదికల ప్రకారం తెలుస్తున్నది. అయితే ఇందులోనూ సింహభాగం రూ.356 కోట్లు బీజేపీకే వెళ్లటం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -