Friday, November 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇండస్ట్రియల్ ల్యాండ్‌ పాలసీపై అసత్య ప్రచారాలు

ఇండస్ట్రియల్ ల్యాండ్‌ పాలసీపై అసత్య ప్రచారాలు

- Advertisement -

కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమల తరలింపు
అవినీతికి తావు లేకపోగా రాబడికి అవకాశాలు
విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలోనూ అవినీతికి ఆస్కారం లేదు : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇండస్ట్రియల్ ల్యాండ్‌ పాలసీపై ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆ వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకే పరిశ్రమలను తరలిస్తున్నట్టు తెలిపారు. దీంట్లో అవినీతికి తావు లేకపోగా రాబడికి అవకాశాలున్నాయని స్పష్టంచేశారు. విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం లోనూ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారం లేదనీ, అత్యంత పారదర్శకమైన పాలసీ అని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాలసీని పూర్తిగా అర్థం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలతో తమకు పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతున్నారని విమర్శించారు. కాలుష్య కారక పరిశ్రమలను ఒఆర్‌ఆర్‌ బయటకు పంపాలనే డిమాండ్‌ పాతదే అని గుర్తుచేశారు. గతంలోనూ ఈ పాలసీ ఉందనీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ చర్చ జరిగిందని అన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేది లేదనీ, పాలసీని మార్చేది లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంలో రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలను మంత్రి ఉత్తమ్‌ కొట్టి పారేశారు. రూ.50 వేల కుంభకోణం కూడా జరగలేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన భద్రాద్రి కొత్తగూడెం పవర్‌ ప్రాజెక్టు పెద్ద కుంభకోణం అని విమర్శించారు. గత ప్రభుత్వం ఇండియా బుల్‌ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని పరికరాలు కొనుగోలు చేసిందని తెలిపారు. ఆ సబ్‌ క్రిటికల్‌ సాంకేతిక పరిజ్ఞానంతో సదరు కేంద్రాన్ని నిర్మించారని చెప్పారు. ఆ కేంద్రం ఎందుకు ఉపయోగించలేని పరిస్థితి ఉందని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం విద్యుత్‌ ప్రాజెక్టుకు కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలంగాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -