వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ఖమ్మంలో లేబర్ కోడ్ జీవో ప్రతులు దహనం
నవతెలంగాణ -ఖమ్మం
కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్, మతోన్మాద శక్తులకు ఉపయోగపడేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే నల్ల చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలని కోరుతూ గురువారం ఖమ్మంలోని సరిత క్లినిక్ సెంటర్‌లో లేబర్ కోడ్ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో బి.వెంకట్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్, మతోన్మాద శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక, రైతు హక్కులతో పాటు ఉపాధి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. దాంతో కార్పొరేట్ శక్తులకు, గుత్తా పెట్టుబడుదారులకు ఉపయోగపడేలా దేశ సంపదను కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటల పని గంటల పెంపు, కనీస వేతనాలు చట్టం రద్దు, ఫ్యాక్టరీ యజమానులకు సకల హక్కులు కల్పిస్తూ ప్రధాని మోడీ జీవోలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని సైతం రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యూపీఏ-1 ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టానికి నేడు క్రమక్రమంగా బడ్జెట్‌ను తగ్గిస్తున్నారని, 8 కోట్ల మంది వ్యవసాయ కూలీలకు పని లేకుండా జాబ్ కార్డును రద్దు చేశారని తెలిపారు.
కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసేవరకూ పోరాటం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణు, కళ్యాణం వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదినేని రమేష్, బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక, సీఐటీయు, రైతు సంఘం జిల్లా నాయకులు బండి రమేష్, వడ్లమూడి నాగేశ్వరరావు, వై.విక్రం, పడిగల నాగేశ్వరరావు, వాసిరెడ్డి ప్రసాద్, భూక్య శ్రీనివాసరావు, గుండె వెంకట్రావు, బండారు వెంకయ్య, ముదాం శ్రీనివాసరావు, షేక్ బషీర్, ఎస్‌కే ఇమామ్, సారంగి పాపారావు, ఆర్.ప్రకాష్, దొంగల తిరుపతిరావు, ఎస్.నవీన్ రెడ్డి, రంగు హనుమంత చారి, లోకేష్, జిల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.



