భోపాల్‌లో యూత్ కాంగ్రెస్‌పై జల ఫిరంగులు
భోపాల్ : ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రెండో దశ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్)కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూత్ కాంగ్రెస్ ఆందోళన నిర్వహించింది.
ఈ ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బారికేడ్లను పక్కకి నెడుతూ, వాటిపై ఎక్కుతూ ముందుకు వెళ్లడానికి యూత్ కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించారు. దీంతో వీరిని చెదరగొట్టడానికి పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్ రెండో దశకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ‘ఓటు చోర్, గద్ది ఛోడో’ క్యాంపెన్‌ను ప్రారంభించింది.
ఇందులో భాగంగానే భోపాల్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కూడా కాంగ్రెస్ ఇలాంటి ఆందోళననే నిర్వహించింది. ఈ ఆందోళనను అడ్డుకోవడానికి నగరంలోని ప్రధాన రోడ్లను మూసివేస్తూ బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. వీటిని దాటడానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి విధానసభ వైపు కాంగ్రెస్ కార్యకర్తలు మార్చ్‌ను ప్రారంభించారు. ‘ఓట్ చోర్, గద్ది ఛోడో’ వంటి నినాదాలు చేశారు. సర్ ఆందోళనలపై తక్షణ చర్య తీసుకోవాలని, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రోడ్లను దిగ్భంధించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొవడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించాల్సి వచ్చింది. కాగా, గురువారం ముందుగా రెండో దశ సర్ ప్రక్రియపై కాంగ్రెస్ నాయకులు సచిన్ పైలట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాయ్‌పూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో అనేక సార్లు సర్‌ను నిర్వహించినా ఈసారి ఈ ప్రక్రియపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. అనేక రాష్ట్రాల్లో బీఎల్‌ఓలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒక్క అనర్హమైన ఓటు కూడా జాబితాలో ఉండకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ‘కానీ, ఓటు హక్కు కలిగిన నిజమైన దేశ పౌరుడు పేరును పేదలు, దళితులు, వెనుకబడినవారు.. అనే కారణంతో తొలగిస్తే.. అలాంటి అన్యాయాన్ని కాంగ్రెస్ సహించదు. ఎన్నికల కమిషన్ ఉద్దేశం నిష్పాక్షికంగా లేకుంటే.. అది నిస్వార్థంగా పనిచేయకపోతే, అది ఒత్తిడితో పని చేస్తుంటే.. ఈ విషయాలను బయటపెట్టడానికి మేం కృషి చేస్తాం’ అని తెలిపారు. డిసెంబరు 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పైలట్ తెలిపారు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో దశ సర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని తుది జాబితాను 2026 ఫిబ్రవరి 7న ప్రచురించనున్నారు.



