Friday, November 28, 2025
E-PAPER
Homeజాతీయంఅమరావతే గ్రోత్‌ ఇంజన్‌

అమరావతే గ్రోత్‌ ఇంజన్‌

- Advertisement -

రెండోదశ ల్యాండ్‌ పూలింగ్‌కు సహకరించండి
రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతాం : రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


అమరావతి: అమరావతే రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా ఉండాలని, రాజధాని అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో రాజధాని రైతులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని రైతులకు న్యాయం చేయడం తన బాధ్యత అని అన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలని చెప్పారు. రాజధానిలో రెండో విడత ల్యాండ్‌ పూలింగులో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నామని సిఎం తెలిపారు. తన హయాంలో ఎప్పుడూ భూసేకరణలో ఇబ్బందులు రాలేదన్నారు. భూముల ధరలు పెరగబో తున్నాయని, రిటర్నబుల్‌ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దని చెప్పారు. కొందరు రైతులు ఎఫ్‌ఎస్‌ఐ పెంచాలని కోరుతున్నారని, దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

రైతులు చెప్పే ఏ సమస్యనైనా వీలైనంతవరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని, ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రెండో విడత భూ సమీకరణకు పూర్తిగా సహకరిస్తామని ముఖ్యమంత్రితో రైతులు చెప్పినట్లు సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సిఎం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే తమకు మేలు జరుగుతుందని రైతులు అన్నారు. రెండోదశ పూలింగ్‌కు అంగీకరించకపోతే అమరావతి మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ముఖ్యమంత్రి రైతులతో అన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ, ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, సిఆర్‌డిఎ కమిషనర్‌ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర సమస్యలు వినిపించండి ఎంపిలకు సిఎం దిశానిర్దేశం
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాలని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఎంపీలకు సూచించారు. పార్టీ ఎంపీలంతా సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంథా తుపాను నష్టపరిహారం త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలని సూచించారు. కృష్ణా – గోదావరి జలాల్లో, గోదావరి ట్రిబ్యునల్‌, సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రాన్ని ఒప్పించేలా పార్లమెంట్‌లో రాష్ట్ర గొంతుకను వినిపించాలన్నారు. వంశధార – గోదావరి – నల్లమల సాగర్‌ అనుసంధానం, వెలిగొండ, ఉత్తరాంధ్ర జల ప్రాజెక్టులన్నీ రాష్ట్ర భవిష్యత్‌ని నిర్ణయిస్తాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027లో జాతికి అంకితం చేసేందుకు కేంద్ర సహకారాన్ని కోరాలన్నారు. పత్తి, మొక్కజొన్న, అరటి ధరల పతనం, సిసిఐ నియమాల కారణంగా వచ్చిన సమస్యలను కేంద్రానికి వివరించి రైతులకు ఉపశమనం కల్పించేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్‌, డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్‌, వసతులపై కేంద్ర సహాయం సాధించాలని సూచించారు.

ఎంఎస్‌ఎంఇ పార్కులు, క్వాంటం వ్యాలీ, ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌కు మద్దతు సాధించేలా ఎంపీలు కృషి చేయాలని ఆదేశించారు. మెట్రో రైల్‌ ప్రాజెక్టులు, ఎకనామిక్‌ రీజియన్స్‌, భోగాపురం ఎయిర్‌ పోర్టు, విశాఖ రైల్వే జోన్‌, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వంటి అంశాలపై కేంద్రంతో చురుగ్గా చర్చలు జరపాలన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో పేదల సేవలో వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఎంపీలు క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. లాజిస్టిక్‌ కార్పొరేషన్‌ ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మరో మెట్టుగా ఎస్క్రో అకౌంట్‌ నిలుస్తుందన్నారు. మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. గత పాలకులు మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో కేవలం 42 శాతమే సీట్లు విద్యార్థులకు ఇస్తామన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 50 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -