Friday, November 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభూములు కోల్పోతున్న రైతులకు..రూ.50లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

భూములు కోల్పోతున్న రైతులకు..రూ.50లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

- Advertisement -

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నాగమడుగు ఎత్తిపోతల పథకం పరిశీలన

నవతెలంగాణ-నిజాంసాగర్‌/నాగిరెడ్డిపేట్‌
నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంప్‌హౌస్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జుక్కల్‌ నియోజకవర్గంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నా.. ఆ నీటితో నియోజకవర్గానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. జుక్కల్‌ నియో జకవర్గంలో చెరువుల ద్వారా 22 వేల ఎకరాలు, కౌలాస్‌నాలా ద్వారా 9 వేల ఎకరాలు మాత్రమే సాగవుతుందని ఇంకా 40 వేల ఎకరాలకు నీళ్లు అవసరమని తెలిపారు.

లెండి ప్రాజెక్టు మహారాష్ట్రతో పంచాయితీ ఉండటం వల్ల ఏండ్ల తరబడి నిర్మాణం కాకుండా పోయిందని, జుక్కల్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే నాగమడుగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కట్టాల న్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు కోసం దాదాపు 200 ఎకరాల భూ సేకరణ అవసరమున్నందున కేవలం పంపుహౌస్‌ కోసం 12 ఎకరాలు మాత్రమే సేకరించారని చెప్పారు. ప్రాజెక్టు చుట్టుపక్కల చిన్న, సన్న కారు రైతులతో ఆమె మాట్లాడారు. నాలుగు సంవత్సరాల క్రితం ఎకరం భూమికి ఎంతో కొట్లాడితే గాని రూ.17లక్షల నష్టపరిహారం చెల్లించారని, అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని ధరలు పెరిగాయని.. రైతులకు ఎకరానికి 50 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేదంటే ఎకరం భూమికి ఎకరం భూమి ఇంకో దగ్గర ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ పరిస్థితిని పరిశీలిం చాలని ప్రాజెక్ట్‌ పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ముంపు రైతులను వెంటనే ఆదుకోవాలి
ముంపు రైతులను వెంటనే ఆదుకోవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాగిరెడ్డిపేట్‌ మండలంలోని బంజారా శివారులో ముంపునకు గురైన రైతులతో ఆమె సమావేశమై మాట్లాడారు. ప్రజల ఓట్లతో గెలిచి సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పంట పొలాల్లో విరిగిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే మరమ్మతు చేయాల న్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీనిచ్చి గాలికి వదిలేశారని, దాన్ని వెంటనే అమలుచేసి ఇన్సూరెన్స్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బతుకమ్మ ఎత్తితే దించేది లేదని, ప్రజా సమస్యలు లేవనెత్తి పరిష్కరించే వరకూ తగ్గేది లేదని అన్నారు. ప్రశ్నిస్తే గానీ సమస్య పరిష్కారం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్‌ గౌడ్‌, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భాజా లలిత, యూత్‌ అధ్యక్షులు చరణ్‌, మైనార్టీ అధ్యక్షులు జాకీర్‌, మహిళా అధ్యక్షురాలు పద్మ, సిద్దు జహీర్‌ బాగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -