సంగీత యనమంద్ర… తన 27 ఏండ్ల టెక్ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తనను తాను సవాలు చేసుకుంటున్నారు. టెక్ రంగంలో విభిన్న డొమైన్‌లను నావిగేట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాబోయే కాలంలో ఏఐ మన జీవితంలో ఎలా భాగం కాబోతోందో చెబుతున్నారు. ఓపెన్‌టెక్స్ట్ ఇండియాలో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా, హైదరాబాద్‌కు సైట్ లీడర్‌కు ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఉత్పత్తులు, సేవలను నిర్మించడంలో రెండున్నర దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్న ఆమె ప్రయాణం నేటి మానవిలో…
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సంగీత మొదటి నుండి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆనందాన్ని పొందుతారు. ‘అందరిలా నేనూ ఓ సాధారణ అమ్మాయిని. కానీ ‘నిన్న’ ఉన్నదానికంటే ఎలా భిన్నంగా ఉండగలనని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను’ అని ఆమె అంటున్నారు. ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఆమె ఎక్సలెన్స్ వైపు ప్రయాణం ఊహించని విధంగా ప్రారంభమైంది. తరగతిలో 18వ ర్యాంక్, బాలికలలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది ఆమెలో గణితం, భౌతిక శాస్త్రంలోని భయాలను అధిగమించాలనే దృఢ సంకల్పానికి దారితీసింది. ‘నెమ్మదిగా ఆరో తరగతిలోనే మొదటి ర్యాంకుకు చేరుకున్నాను. నా పాఠశాల జీవితంలో టాపర్‌గా కొనసాగాను’ అని ఆమె పంచుకున్నారు. ఈ తొలి విజయం ఆమెలో కొత్త రంగంలోకి అడుగుపెట్టాలనే అభిరుచిని కలిగించింది. ‘ఏదైనా సవాలుగా భావించినప్పుడు, దాన్ని సాధించగలిగితే కొంత సంతృప్తి లభిస్తుంది’ అని అంటూ భయం ఉన్నప్పటికీ ఎనిమిదవ తరగతిలోనే స్కూటర్ నడపడం గురించి పంచు కున్నారు. ‘నా నిశ్శబ్ద సాధికారత నా తండ్రి నుండి వచ్చింది. నేను స్కూటర్ నడుపుతున్నపుడు నాన్న కూడా భయపడ్డారు. కానీ ఆయన నన్ను ఆపలేదు’.
కెరీర్ ప్రారంభంలో
కాలేజీ టాపర్ అయినప్పటికీ సంగీత ఐటీలోకి ప్రవేశించడం సజావుగా సాగలేదు. 1990లో ఆమె ఎంసీఏ పూర్తి చేశారు. ఐటీలో అంతగా అవకాశాలు లేని సమయంలో ఉద్యోగంలోకి వచ్చారు. ‘నేను ఇగ్నో, భారతీదాసన్ విశ్వవిద్యాలయంలో పార్ట్ టైమ్ క్లాసులు తీసుకోవడం ప్రారంభించాను’ అని గుర్తుచేసుకున్నారు. భర్త ప్రోత్సాహంతో ఉదయం జాబ్ చేస్తూనే సాయంత్రం తరగతులకు హాజరై ఎంటెక్ పూర్తి చేశారు. మరోసారి టాపర్‌గా నిలిచి తన విద్యా నైపుణ్యాన్ని కొనసాగించారు. ఎంటెక్ చదువుతున్నప్పుడు విరించి టెక్నాలజీస్‌లో ఒక ప్రాజెక్ట్‌లో పనిచేసే అవకాశం లభించింది. ఆ కంపెనీ తర్వాత ఆమెను లీడ్‌గా తీసుకుంది. ఇదే తర్వాత కాలంలో ఆమె విభిన్న ప్రాజెక్టులను నిర్వహించడంలో నాంది పలికింది.
సాంకేతిక వైవిధ్యాన్ని నేర్చుకోవడం
సాంకేతికత, పాత్రలు, డొమైన్‌లలో దాని అద్భుతమైన వైవిధ్యానికి నిదర్శనంగా సంగీత కెరీర్ నిలుస్తుంది. ‘నేను మొబైల్ టెక్నాలజీలతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. ఒకేసారి బహుళ ప్రాజెక్టులలో పని చేయాల్సి వచ్చింది. విరించిలో చేరినప్పుడు నేను టెక్ లీడ్‌గా ఒకేసారి మూడు ప్రాజెక్టులను నిర్వహించాల్సి వచ్చింది. ప్రతి ప్రాజెక్ట్ వేరే టెక్నాలజీలో ఉంది’ అని ఆమె వివరించారు. ఈ వైవిధ్యమే ఆమె నేర్చుకోవడానికి, అభివృద్ది చెందడానికి దారితీసింది. ఈ ప్రాజెక్టులు, ఉత్పత్తులను నడిపించగలిగేలా సాంకేతికతను ఎలా అధ్యయనం చేయాలో, సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో ఆమె స్వయంగా కనుగొన్నారు.
విభిన్న డొమైన్‌లలో ఆమె పని
ఆమె కెరీర్ మొబైల్ టెక్నాలజీల నుండి ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, విశ్లేషణలతో మొదలై ఇప్పుడు ఏఐ వరకు అభివృద్ధి చెందింది. ఎయిర్‌లైన్స్, సెక్యూరిటీ, లీగల్, ఆపై ఇన్ఫోసిస్, వర్చుసా, కోనీ సొల్యూషన్స్, బార్క్లేస్ టెక్నాలజీ సెంటర్ ఇండియా వంటి కంపెనీలలో క్లినికల్ ట్రయల్స్ వంటి విభిన్న డొమైన్‌లలో ఆమె పని చేశారు. ఎనిమిదేండ్ల కిందట ఓపెన్‌టెక్స్ట్‌కు మారినప్పుడు ఆమె వృత్తిపరమైన అతిపెద్ద సవాలును ఎదుర్కొన్నారు. ‘నేను ఎనిమిది మంది వ్యక్తుల బృందంతో ప్రారంభించాను. కానీ రెండు త్రైమాసికాల్లో ఈ బృందాన్ని నేను 100 మందికి పైగా పెంచాల్సి వచ్చింది. ఈ సమయంలోనే నేను ఫస్ట్ లైన్ మేనేజర్‌గా, జట్లను నిర్వహించడానికి, ఏర్పాటు చేయడానికి నాయకురాలిగా ఉన్నాను’ అని పంచుకున్నారు. ఓపెన్ టెక్స్ట్‌లో ఆమె విశ్లేషణలు, చట్టపరమైన సాంకేతిక రంగంలో ఇంజనీరింగ్, ఉత్పత్తి నిర్వహణ బృందాలను పర్యవేక్షి స్తున్నారు. హైదరాబాద్‌కు సైట్ లీడర్‌గా కూడా ఉన్నారు.
పని- వ్యక్తిగత జీవిత సమతుల్యత
కెరీర్ మొత్తంలో సంగీత వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. ‘నా ఈ ప్రయాణంలో ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేదు, నిరంతరం పని చేస్తూనే ఉన్నాను’ అంటారు ఆమె. తరచుగా ఆమె పని ఉదయం 7:30 ప్రారంభమైన కొన్నిసార్లు తెల్లవారుజామున 2 లేదా 3 గంటలకు ఇంటికి చేరుకుంటారు. సవాళ్లను స్వీకరించాలనే ఆమె అభిరుచి, సంకల్పం ఆమెను ముందుకు తీసుకెళ్లింది. ‘ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడి విషయాల గురించి పెద్దగా ఆలోచించను. అదేవిధంగా ఆఫీసు నుండి బయలుదేరినప్పుడు ఆ బరువులను ఇంటికి మోసుకెళ్లను. అయితే కుటుంబానికి ఎంత సమయం కేటాయించామనేది కాదు, ఎంత నాణ్యమైన సమయం కేటాయించామో అదే ముఖ్యం. నా కెరీర్ నేను ఎప్పుడూ సంస్థకు దగ్గరగా ఉండలేదు. నా కూతురితో గడిపేందుకు నాకు ఎక్కువ సమయం ఉండేది కాదు. కానీ ఆమెకు అవసరమైన చిన్న చిన్న విషయాలను చూసుకునేదాన్ని. ఉదాహరణకు ఆమెకు గణితం అంటే భయం. ఆమె కోసం ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసేదాన్ని. అర్థం కానివి చెప్పేదాన్ని. అయితే కొంత అపరాధం ఉంది. కానీ నా భర్త మద్దతు నన్ను దాన్ని అధిగమించేలా చేసింది’ అని ఆమె పంచుకున్నారు.
టెక్‌లో మహిళలకు మద్దతు
సంగీత తన బృందంలోని మహిళలకు, ముఖ్యంగా వివాహం లేదా ప్రసూతి సెలవు వంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ముఖ్యంగా తిరిగి వచ్చే తల్లులతో తాను నిరంతరం సంప్రదిస్తున్నానని, వారి కుటుంబాన్ని ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై వారికి సలహా ఇస్తున్నానని ఆమె చెప్పారు. ‘కొత్త సాంకేతికతలు లేదా కొత్త ప్రాజెక్టులపై పని చేసే ముందు సవాళ్లను స్వీకరించమని నేను వారిని ప్రోత్సహిస్తున్నాను’ అన్నారు. అలాగే ఆమె సౌకర్యవంతమైన కార్యాలయ ఏర్పాట్ల అవసరాన్ని కూడా నొక్కి చెబుతున్నారు. ముఖ్యంగా తిరిగి వచ్చే తల్లులు మరింత కలుపుకొని పనిచేసే కార్యాలయాన్ని సృష్టించాలంటున్నారు. కెరీర్ ఎంపికల గురించి మహిళల అవగాహనను విస్తృతం చేయవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆమె ప్రారంభించిన ‘ఉమెన్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎక్సలెన్స్’ మహిళలకు ఓ మార్గదర్శకత్వంగా సహయపడుతుంది.
ఏఐని స్వీకరించడం
సంగీతకు ఏఐ అనే చిక్కుముడిపై సమతుల్య దృక్పథం ఉంది. ఉద్యోగాలు పోతాయని భయపడే బదులు ఆమె ఏఐని ఉన్నత స్థాయి ఆలోచనకు స్థలాన్ని సృష్టించే సాధనంగా చూస్తున్నారు. ఏఐని ప్రారంభ బిందువుగా ఉపయోగించమని, వారి ప్రత్యేక దృక్పథాలను కూడా జోడించమని ఆమె ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ‘దాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉపయోగించవద్దు, మీ ఆలోచనలను కూడా దానికి వర్తింపజేయండి. ఏఐ మన ఆలోచనా విధానాన్ని అధిగమించకూడదు. మన ఆలోచనా ప్రక్రియలో మనం ప్రత్యేకంగా ఉన్నాము. అది స్పష్టంగా బయటకు రావాలి’ అంటున్నారు. ఆమె ఏఐ పనిపై ఆశావాదంగా ఉన్నారు. ఇది మరింత అన్వేషించడానికి, మెరుగైన పని చేయడానికి మనకు అవకాశాలు ఇస్తుందని నమ్ముతున్నారు. ‘పదవీ విరమణ తర్వాత నేను మహిళలకు మెంటరింగ్ ద్వారా సాంకేతికతలో సాధికారత కల్పించాలను కుంటు న్నాను. అవసరమైన వారికి నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా సమాజ అభివృద్ధిలో కూడా పని చేయాలనుకుంటున్నాను’ అని ఆమె ముగించారు.
సవాళ్లంటే మక్కువ ఎక్కువ
- Advertisement -