బలమున్న అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ- హాలియా
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం హాలియాలోని సుందరయ్య భవన్ లో పెద్దవూర, తిరుమలగిరి సాగర్ పార్టీ మండల కమిటీల సంయుక్త సమావేశం ఎస్ కె బషీర్, వి పుల్లయ్యల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిజాయితీతో పనిచేసే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
డబ్బులు, మద్యం కులం మతం ప్రాంతం వివిధ ప్రలోభాలతో వచ్చే అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కోరారు. ఇప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్యం మంచినీళ్లు మురికి కాలువలు సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, వీటికి పరిష్కారం కావాలంటే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే కేరళ తరహా పంచాయతీ పాలన అందించడానికి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడానికి ముందుంటామని అన్నారు. వివిధ రాజకీయ పార్టీలు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నాయని కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), పెద్దవూర మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, తిరుమలగిరి సాగర్ మండల కార్యదర్శి జటావత్ రవి నాయక్, ఇరు మండలాల నాయకులు కత్తి శ్రీనివాస్ రెడ్డి, దంతాల నాగార్జున, జగదీష్, చాంద్ పాషా, బుర్రి సైదులు, దోరేపల్లి మల్లయ్య, పొదిల వెంకన్న, లచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



