నవతెలంగాణ – కంఠేశ్వర్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రాకపోవడం చాలా బాధాకరం. ఈ పరిస్థితుల్లో బీసీలకు కేవలం 22% రిజర్వేషన్లు రావడం శోచనీయం అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. నగరం లోని కేర్ డిగ్రీ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..50% జనరల్ స్థానాలు కేటాయించబడ్డాయి. 50% జనరల్ స్థానాల్లో ప్రతి బీసీ బిడ్డ పోటీ చేయాలి. ఆ ఊరిలోని బీసీ కులస్తులందరూ ఏకమై ఒకే ఒక బీసీ అభ్యర్థిని జనరల్ స్థానంలో నిలబెట్టుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అని నరాల సుధాకర్ అన్నారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలను గెలిపించుకున్నప్పుడు మాధవరెడ్డి లాంటి బీసీ ద్రోహులకు మనం తగిన గుణపాఠం చెప్పినట్టు అవుతది అని రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్ అన్నారు.
చాలా చోట్ల అగ్రవర్ణాల వారు బహుజనులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ రాలేదు కాబట్టి బీసీ బిడ్డలైన మీరు పోటీ చేయకండి. జనరల్ స్థానంలో మేము పోటీ చేస్తాం.. మాకు మీరు సపోర్ట్ చేయండి అని బీసీ బిడ్డలను కొందరు అగ్రవర్ణాల వారు తప్పుదోవ పట్టిస్తున్నారని, నగర అధ్యక్షులు దర్శనం దేవేందర్ అన్నారు. జనరల్ స్థానం అంటే ప్రతి ఒక్కరు పోటీ చేయవచ్చు కాబట్టి ప్రతి జనరల్ స్థానంలో కనీసం ఒక్క బీసీ బిడ్డ నిలబడి మన బలాన్ని చాటి అత్యధిక మెజార్టీతో బీసీ బిడ్డను జనరల్ స్థానంలో గెలిపించుకుందాం అని జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగ కిషన్ పిలుపునిచ్చారు.
అగ్రవర్ణాలకు డబ్బులకు ఏం కొదవలేదు. వారు డబ్బులను విచ్చలవిడిగా ఎగజల్లి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి బీసీ బిడ్డ డబ్బులకు ఆశపడకుండా మన ఆత్మగౌరవాన్ని చాటాల్సిన అవసరం ఉందని నరాల సుధాకర్ అన్నారు. దాదాపు 60 శాతం ఉన్న మన బీసీలు దేంట్లో తక్కువ కాదని చూపెట్టాల్సిన సమయం ఇది. కాబట్టి జనరల్ స్థానాల్లో బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు గంగాకిషన్, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, బసవ సాయి, వాసం జయ తదితరులు పాల్గొన్నారు.



