ఆస్తుల జప్తుకు ఆర్ఆర్ చట్టం అమలు
కలెక్టర్ అనుమతులకు నివేదిక
స్టేషన్ ఘన్పూర్ ఆర్డిఓ వెంకన్న
నవతెలంగాణ – పాలకుర్తి
ఆలయ బకాయి దారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్టేషన్గన్పూర్ ఆర్డీవో డిఎస్ వెంకన్న తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయంలో అధికారులు, ఆలయ బకాయి దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డిఓ డిఎస్ వెంకన్న మాట్లాడుతూ 2007 నుండి 2017 మధ్యకాలంలో 22 మంది 61 లక్షల బకాయిలు ఉన్నారని తెలిపారు. బకాయిలు చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు చేసినప్పటికీ స్పందించడం లేదని అన్నారు. బకాయిదారులపై ఆర్ఆర్ చట్టం ద్వారా చర్యలు తీసుకునేందుకు అసిస్టెంట్ దేవాదాయ కమిషనర్ నల్లగొండ సమక్షంలో అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ కు నివేదికను సమర్పిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ పరమతులు వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ అనంతరం ఆలయ బకాయిదారులపై ఆర్ఆర్ చట్టం ద్వారా చర్యలు చేపట్టి ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ బకాయిదారులే టెండర్లలో బినామీయుల ముసుగులో వస్తున్నారని తెలిపారు. ఆలయంలో పూజా సామాగ్రి తో పాటు తదితర వాటికి వేలంపాట కోసం ఆహ్వానిస్తే బకాయిదారులే ఇతరులను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. ఆర్ఆర్ చట్టం అమలు చేయకముందే బకాయి దారులు స్వచ్ఛందంగా వచ్చి బకాయిలు చెల్లించుకోవాలని స్పష్టం చేశారు. బకాయిదారులను ఉపేక్షించేది లేదని, ఎవరిని వదలబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సూత్రం సరస్వతి, పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి, ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఎస్సై దూలం శ్రీనివాస్, ఆలయ సూపరిండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ సిబ్బంది రాములు, ఓం ప్రకాష్, రమేష్ లతోపాటు బకాయిదారులు పాల్గొన్నారు.



