నవతెలంగాణ – గోవిందరావుపేట
నామినేషన్ ల పర్వంలో భాగంగా రెండవ రోజు కూడా మండల వ్యాప్తంగా నామినేషన్లు మందకోడిగా సాగాయి. రెండవ రోజు సర్పంచ్ పదవికి ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించి 16 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. గత రెండు రోజులుగా సర్పంచ్ పదవులకు ఏడుగురు వార్డు సభ్యులుగా 28 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. కొత్త ఎకౌంటు ఓపెన్, ఆఫిడవిట్, అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి. గతంలో అన్ని బ్యాంకులలో ఖాతాలు ఉండటం వల్ల కొత్తగా ఖాతా సాధ్యం కాదని బ్యాంకు అధికారులు తెలుపుతుండడంతో పోటీ అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ అఫీడబిట్ దాఖలు చేయాల్సిందే అనడంతో అఫిడవిటి కేంద్రాల వద్ద పోటీ అభ్యర్థులు బారులు తీరారు.
రూ.50 స్టాంప్ పేపరు 300 నుండి 400 రూపాయల వరకు చెల్లిస్తూ సకాలంలో ఇవ్వడం లేదని ఇబ్బందులు పడుతున్నారు. రెండవ రోజు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన వారిలో పసర గ్రామపంచాయతీ నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా గొంది దేవేంద్ర ఉన్నారు. శనివారం ఆఖరి రోజు కావడంతో నామినేషన్లు విస్తృతంగా దాఖలు కావచ్చనీ అధికారులు రాజకీయ పార్టీల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అఫిడవిట్ లేకుండానే నామినేషన్ స్వీకరించడం వల్ల అభ్యర్థులకు సులభంగా మారిందని, మూడు రోజులలో నామినేషన్ వేసేందుకు పొందుపరచినవి అన్ని ఇవ్వడం అసాధ్యంగా ఉన్నాయని మరికొందరు అభ్యర్థులు ఇదంతా మనకెందుకులే అని తప్పుకుంటున్నారని పలు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఇలాంటి క్లిష్టతరమైన నిబంధనలు కాకుండా సులభతరమైన నిబంధనలను అమలులోకి తీసుకురావాలని దానివల్ల పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వారు అంటున్నారు.



