నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ప్రజా నాయకుడు చింతల భూపాల్ రెడ్డి స్మరణలో నిర్వహించిన సంతాప సభ శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలోని ఎస్ఎం రెడ్డి గార్డెన్‌లో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో ప్రత్యేకంగా జరిగింది. సభ ప్రారంభమయ్యే సరికి భూపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరుడు భూపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిద్ధాంతాలపై నమ్మకం ఉంచి, ప్రజల కోసమే జీవించిన నాయకుడని, ఆయన చేసే సేవలు ఎప్పటికీ మరవలేనివని వక్తలు గుర్తుచేశారు. గ్రామీణ సమస్యల పరిష్కారం నుంచి పార్టీ బలోపేతం వరకు భూపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు తమ మాటల్లో భావోద్వేగంతో తెలిపారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ మాట్లాడుతూ.. “కందాల రంగారెడ్డి చూపిన పోరాట మార్గంలో భూపాల్ రెడ్డి నడిచారు. ఎన్నో ఒడిదుడుకులు,రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ నిజాయితీ,నిబద్ధతతో ముందుకు సాగి చౌటుప్పల్ పట్టణంలో పార్టీని నిలబెట్టిన అరుదైన నాయకుడు” అని కొనియాడారు. ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు లో ప్రత్యేక పాత్ర పోషించారని భూపాల్ రెడ్డి ఒక మాస్ లీడర్ గా ఎదిగారని ఎండి జహంగీర్ అన్నారు.
సంతాప సభలో ప్రత్యేక ఆకర్షణగా ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఈర్ల ముత్యాలు ఆధ్వర్యంలో కళాకారులు భూపాల్ రెడ్డి ప్రజా సేవలకు ప్రతిరూపంగా నిలిచిన పాటలను సాంస్కృతిక రూపంలో ప్రదర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేసిన పోరాటాలు, గ్రామీణ అభివృద్ధికి చేసిన కృషి,భారీగా కృషి చేశారని తెలిపారు.
సభలో మరో ముఖ్యమైన అంశంగా దర్శకుడు భాస్కర్ రూపొందించిన చిన్న సినిమా కూడా ఆవిష్కృతమైంది. భూపాల్ రెడ్డి చిన్ననాటి నుంచి ఆయన లోకసేవా పయనం, రైతు సమస్యలు, కార్మిక పోరాటాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం—ఈ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన వీడియోను యూట్యూబ్ ద్వారా విడుదల చేసి సభలో ప్రదర్శించారు. వీడియో చూసిన చాలా మంది క్షణక్షణం ఆయనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
సంఘర్షణలతో నిండిన రాజకీయ జీవితం గడిపినా, వ్యక్తిగత జీవితంలో సరళతకు, నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన భూపాల్ రెడ్డిని గుర్తుచేసుకుంటూ సభలో పలువురు నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు చేయూతనిస్తామని హామీ ఇచ్చారు. సంతాప సభ ముగింపు సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన చూపిన ప్రజా మార్గంలో నడుస్తామని పాల్గొన్న కార్యకర్తలు గట్టిగా సంకల్పం వ్యక్తం చేశారు.




