సిరీస్ విజయంపై భారత్ గురి
డబుల్ ధమాకాపై సఫారీల కన్ను
రేపటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్
స్వదేశంలో దారుణ టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమ్ ఇండియా మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. భారత్‌లో 25 ఏండ్లలో తొలిసారి టెస్టు సిరీస్ విజయంతో దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఓటమి నైరాశ్యంలో ఉన్న భారత్‌పై డబుల్ ధమాకా కొట్టేందుకు సఫారీలు ఎదురు చూస్తున్నారు. రోకో రాకతో వన్డేల్లో దక్షిణాఫ్రికాపై తీయని ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల భారత శిబిరంలో కనిపిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆదివారం రాంచీ వన్డేతో ఆరంభం కానుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
భారత క్రికెట్‌లో ఫోకస్ టెస్టు ఫార్మాట్ నుంచి వైట్‌బాల్‌కు మారుతోంది. స్వదేశీ టెస్టుల్లో దారుణ పరాజయాల అనంతరం అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న టీమ్ ఇండియా.. వైట్‌బాల్ ఫార్మాట్‌లో పుంజుకుని అభిమానులకు ఊరట అందించాలని భావిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఆదివారం రాంచీ మ్యాచ్‌తో ఆరంభం కానుంది. వన్డే సవాల్ ముంగిట ఇటు డ్రెస్సింగ్‌రూమ్‌లో, అటు అభిమానుల్లో కొన్ని అంశాలపై ఆసక్తి కనిపిస్తోంది. ఆ విషయాలు ఓసారి చూద్దాం.
యశస్వి జైస్వాల్ మెరిసేనా?
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు జట్టు ప్రణాళికల్లో అంతర్బాగం. కానీ వైట్‌బాల్ ఫార్మాట్‌లో యశస్వి జైస్వాల్ నిలకడగా అవకాశాలు అందుకోవటం లేదు. టాప్-3లో బ్యాటింగ్ చేసే యశస్వి జైస్వాల్.. జట్టులో చోటు దక్కించుకోవటం కష్టమవుతోంది. గతంలోనూ ఆటగాళ్లు గాయపడినప్పుడు జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడూ శుభ్‌మన్ గిల్ గాయంతో ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్‌లో నిరాశపరిచిన జైస్వాల్.. వన్డేల్లో మెరిస్తే గిల్ రీ ఎంట్రీ ఇచ్చినా జట్టులో నిలిచేందుకు అవకాశం ఏర్పడుతుంది. రుతురాజ్ గైక్వాడ్ సైతం టాప్ ఆర్డర్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో టాప్-3లో స్థానం సుస్థిరం చేసుకోవటం జైస్వాల్‌కు కీలకం. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ వరకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడే అవకాశం కనిపిస్తోండగా.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా జట్టులో నిలిచేందుకు యశస్వికి ఇది మంచి అవకాశం. దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు.
రోకో మేనియా
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో రోకో ద్వయం (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి) అభిమానులను అలరించింది. ఈ సిరీస్ స్వదేశంలో జరుగుతుండటంతో అభిమానులకు పరుగుల పండుగ అందించేందుకు రోడో జోడీ సిద్ధమవుతోంది. ఆసీస్‌పై ఆఖరు వన్డేలో అదరగొట్టిన రోహిత్, కోహ్లి.. అచ్చొచ్చిన పిచ్‌లపై స్వదేశంలో చెలరేగాలని ఎదురుచూస్తున్నారు. పవర్‌ప్లేలో రోహిత్ శర్మ దూకుడు, విరాట్ కోహ్లి క్లాసికల్ ఊచకోత కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సొంతగడ్డపై అశేష అభిమానుల నడుమ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జోరును నిలువరించటం దక్షిణాఫ్రికాకు అంత సులువు కాబోదు.
అర్ష్‌దీప్‌కు పరీక్ష
యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టీ20 ఫార్మాట్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్‌గా సత్తా చాటిన అర్ష్‌దీప్ సింగ్.. 50 ఓవర్ల ఆటలో తనదైన ప్రదర్శన కనబరచలేదు. ఇప్పటివరకు 11 వన్డేలు ఆడిన అర్ష్‌దీప్ సింగ్.. అందులో ఆరు మ్యాచులను 2022లో ద్వితీయ శ్రేణి జట్టుతో శిఖర్ ధావన్, రాహుల్ కెప్టెన్సీలో ఆడాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ పేస్ బౌలింగ్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై జరుగనుంది. దీంతో అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంతో కాలం బెంచ్‌పై ఉంచలేరు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి లభించిన సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నాడు. ఈ సిరీస్‌లో రాణిస్తే.. ప్రపంచకప్‌లో బుమ్రాతో కలిసి కొత్త బంతిని పంచుకునేందుకు అర్ష్‌దీప్ సింగ్ ఓ అడుగు ముందుకు వేసినట్టే.



