Saturday, November 29, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివిధానం.. విరాళం!

విధానం.. విరాళం!

- Advertisement -

భారత ఆర్థిక వ్యవస్థ కార్పొరేట్‌ శక్తుల చెప్పుచేతుల్లో ఉందనే అనుమానం ఇక అనుమానం కాదు, అది నిజమని చెప్పే విషయాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. సెమీ కండక్టర్‌ల ఉత్పత్తిలో భాగంగా టాటా గ్రూపు, ప్రభుత్వం కలిసి కోట్ల రూపాయల క్విడ్‌-ప్రో-కోకు పాల్పడిన అంశాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. అయితే, కేంద్రం తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు, రెండూ ఒకే దిశలో కదలడం దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రమాదకరం. పాలకులు అనుసరిస్తున్న విధానాలు ప్రజల అవసరాలకన్నా, కార్పొరేట్‌ ప్రయోజనాలకు మేలుచేసే విధంగా ఉండటం మరీ ఆందోళనాకరం. ఎన్నికల బాండ్లు తెరమరుగైన తర్వాత వస్తున్న విరాళాలా విధానాలు ఈ వాస్తవాలను ఆవిష్కరిస్తుంటే దేశంపై దీని ప్రభావం పడకుండా ఉండగలదా? కార్పొరేట్లకు రాయితీల రూపంలో అమలయ్యే భారీ నిధుల వరద, వెనువెంటనే మొదలయ్యే విరాళాల హవా, చకచకా ఇచ్చే అనుమతుల ఉత్తర్వులు..ఈ క్రమపద్ధతి అంతా కూడా రాజకీయ స్వతంత్రతనే వేలెత్తి ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం విరాళాల విధానాన్ని అనుసరిస్తుందా?లేక విధానమే విరాళాల కోసం రూపుదిద్దుకుంటోందా?

దేశీయంగా సెమీకండక్టర్‌ పరిశ్రమ నిర్మాణానికి ఊతమివ్వడంలో భాగంగా మూడు సెమీకండక్టర్‌ యూనిట్లకు మోడీ సర్కార్‌ గతేడాది నిర్ణయం తీసుకుంది. అందులో రెండింటికి టాటా గ్రూపు నేతృత్వం వహిస్తోంది. అయితే రూ.1.18లక్షల కోట్లతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రోత్సహించే పేరుతో రాయితీలకు రూపకల్పన చేసింది. ఈ యూనిట్ల నిర్మాణంలో సగం నిధుల్ని భరించేందుకు ముందుకొచ్చింది. ఇక్కడే, కీలక ఆర్థిక, పారిశ్రామిక, పన్ను విధానాల్ని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. టాటా గ్రూపు నిర్మించబోయే రెండు యూనిట్లకు సబ్సిడీ ఏకంగా రూ.44,203కోట్లను కేంద్రం అందిస్తోంది. దీనికి కేబినేట్‌ ఆమోద ముద్ర వేసిన నాలుగు వారాల వ్యవధిలో బీజేపీకి అతిపెద్ద డోనర్‌గా టాటా గ్రూపు ఆవిర్భవించింది. ‘మీరు మాకోసం ఇంతచేస్తే.. మీకు ఏం చేయకుండా ఉంటామా’ అని రూ.758కోట్లను పార్టీకి విరాళంగా అందజేసింది. దీన్నిబట్టి పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజా సంక్షేమానికా, వారి స్వార్థ ప్రయోజనాలకా? అన్నది ఇట్టే అర్థమవుతుంది.

2024 ఎన్నికలకు ముందు ఎన్నికల బాండ్ల గురించి దేశంలో పెద్దఎత్తున చర్చ జరిగింది. కేంద్రం, కార్పొరేట్‌ శక్తులు మిలాఖతై క్విడ్‌ ప్రో కోకు ఏ విధంగా పాల్పడుతున్నారనేది బట్టబయలైంది. సుప్రీంకోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి. ఇది చాలాతప్పని న్యాయస్థానం కూడా కేంద్రాన్ని మందలించింది. పైగా తీసుకున్న విరాళాల లిస్టును కూడా ప్రకటిం చాలని చెప్పింది. ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన నిధుల్ని గమనిస్తే బీజేపీదే అగ్రస్థానం. 2021-24 వరకు రాజకీయ పార్టీలకు ఎలాంటి విరాళాలను టాటా ట్రస్టు ఇవ్వలేదు. కేవలం లోక్‌సభ ఎన్నికలకు ముందుగా అంటే గతేడాది ఏప్రిల్‌లో కోట్ల రూపాయలను బదిలీ చేసింది. టాటా గ్రూపునకు చెందిన పదిహేను సంస్థలు దాదాపు రూ.915కోట్లు రాజకీయ విరాళాలుగా ముట్ట జెప్పాయి. ఇవేకాదు, మూడో సెమీ కండక్టర్‌ చేపట్టిన తమిళనాడుకు చెందిన మురుగప్ప సంస్థకు కూడా కేంద్రం రూ.3501 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. దీంతో బీజేపీకి ఆ సంస్థ రూ.125కోట్లు విరాళంగా ఇచ్చి తమ విధేయతను చాటుకుంది. అంటే ఎవరికి ఎంత మేలుచేస్తే వారినుంచి అంత దండుకోవడం ఆ పార్టీ లక్ష్యంగా కనపడుతున్నది.

రాజకీయ-కార్పొరేట్‌ బంధం కొత్తదేమీ కాదు. కానీ ఇటీవల కాలంలో అది అధికార విధానాలను పూర్తిగా ఆక్రమించే స్థాయికి చేరింది. ఎన్నికల విరాళాల రూపంలో వచ్చిన డబ్బు ఒకవైపు, ఆ డబ్బుకు ప్రతిఫలంగా ఇచ్చిన రాయితీలు మరోవైపు ఇది కచ్చితంగా ‘క్విడో ప్రో కో’నే. పబ్లిక్‌ డిబెట్‌, పార్లమెంటరీ స్క్రూటినీ లేకుండా ఇలాంటి కీలక నిర్ణయాలు దోపిడీకి దారితీస్తాయి. పైగా ప్రయివేటీకరణకు వంత పాడతాయి. ఒక్క సెమీ కండక్టర్‌ల ఉత్పత్తిలోనే ఇంత మొత్తం చేతులు మారితే ఇప్పటివరకు అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు కేటాయించిన గనులు, పరిశ్రమలు, రహదారులు, బొగ్గు, టెలికాం, విమానరంగాల వంటి వాటిలో కేంద్రం వాటా ఎంతుండాలి? పెరుగుతున్న ధరల భారంతో దేశ ప్రజానికం అష్టకష్టాలు పడుతూ పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని పోరాడితే వేధింపులు, నోటీసులు, అరెస్టులు, నిర్భందాలు. విరాళాలిచ్చిన వారికేమో రుణాలు, రాయితీలు. ఇంతకన్నా దౌర్భగ్యం ఏముంటుంది? ఆర్థిక సంస్కరణల్లో పారదర్శకత, విధాన స్వతంత్రత, రాజకీయ సమతుల్యత కీలకం. లేదంటే అది దేశంపై నిర్మాణాత్మక ప్రభావం చూపుతుంది.ఈ క్విడ్‌ ప్రో కో వ్యవస్థ ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక దిశను నిర్ణయించే హక్కు ప్రభుత్వాల చేతుల్లో ఉండదు. విరాళాలిచ్చే కంపెనీలే విధానాలు నిర్ణయిస్తాయి. ఈ రహస్య బంధాన్ని ప్రజలు ప్రశ్నించాలి. లేదంటే దేశం కార్పొరేట్‌ రాజ్యంగా మారుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -