వినియోగ వస్తువులపై పెరుగుతున్న ఆసక్తి
జోరుగా వాహనాలు, మొబైల్ ఫోన్ల కొనుగోలు
ఆహారంపై తగ్గిపోతున్న ఖర్చు
భారతీయ కుటుంబాల వ్యయ ప్రాధాన్యతల్లో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. ఒకప్పుడు ఆహార పదార్థాల కొనుగోలుపై ఎక్కువగా ఖర్చు చేసే వారు. ఇప్పుడది బాగా తగ్గిపోయింది. అదే సమయంలో వినియోగ వస్తువుల కొనుగోలు గణనీయంగా పెరిగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో వాహనాలు, టీవీలు, మొబైల్ ఫోన్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారు పట్టణ వినియోగదారులతో పోటీ పడి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు 2011-12 లో గ్రామీణ ప్రజల్లో 19 శాతం మందికి మాత్రమే మోటారు వాహనాలు ఉండేవి. 2023-24లో ఇది ఏకంగా 59 శాతానికి పెరిగింది. అదే సమయంలో పట్టణ ప్రజల్లో వాటి వినియోగం 40 నుంచి 68 శాతానికి చేరుకుంది.
న్యూఢిల్లీ : ప్రస్తుతం భారతీయ కుటుంబాలలో సగానికి పైగా కుటుంబాలకు మోటారు వాహనాలు ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం అనేక రెట్లు పెరిగింది. ఫలితంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం బాగా తగ్గిపోతోందని పీఎం-ఆర్థిక సలహా మండలి (పీఎం-ఈఏసీ) సోమవారం విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది.
పెరిగిన మోటారు వాహనాల కొనుగోలు
అటు నగరాలలోనూ, ఇటు గ్రామాలలోనూ ద్విచక్ర వాహనాలు లేదా కార్లు ఉన్న కుటుంబాల వాటా 2023-24లో యాభై శాతం దాటిందని పీఎం-ఈఏసీ సభ్యులు షామిక రవి, సింధూజ పెనుమర్తి తమ నివేదికలో వివరించారు. దేశంలో వినియోగ వస్తువుల కొనుగోలుపై చేస్తున్న వ్యయం గణనీయంగా పెరిగిందని దీనిని బట్టి అర్థమవుతోంది. భారతీయ కుటుంబాలు కొనుగోలు చేస్తున్న వినియోగ వస్తువుల్లో మోటారు వాహనాలు మొదటి స్థానంలో ఉన్నాయి. హర్యానా, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో పట్టణ కుటుంబాల వద్ద ఉన్న మోటారు వాహనాల కంటే గ్రామీణ కుటుంబాల వద్ద ఉన్న వాహనాలే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం.
ల్యాప్‌టాప్‌లు, పీసీల వాడకం అంతంతే
భారత్‌లో డిజిటల్ పరికరాలపై ఫోకస్ పెరుగుతున్నప్పటికీ ల్యాప్‌టాప్‌లు, పీసీల వినియోగంలో వృద్ధి కన్పించకపోవడం విశేషం. పట్టణాలలో ల్యాప్‌టాప్‌ల వినియోగం 2011-12లో 14.9 శాతం ఉండగా 2023-24లో కేవలం ఒక శాతం పాయింట్ మాత్రమే పెరిగి 15.9 శాతానికి చేరింది. అదే గ్రామీణ కుటుంబాల విషయానికి వస్తే అదే కాలంలో వినియోగం 1.5 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగింది. ల్యాప్‌టాప్ అప్లికేషన్స్‌పై తగిన పరిజ్ఞానం లేకపోవడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది.
తగ్గిన టీవీలు… పెరిగిన మొబైల్ ఫోన్లు
టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వినియోగానికి సంబంధించి నివేదిక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. దేశంలో దాదాపు ప్రతి ఇంటిలోనూ టెలివిజన్ ఉంటుంది. అయితే 2011-12లో పట్టణ ప్రాంతాల్లో 80.4 శాతం కుటుంబాల వద్ద టీవీలు ఉండగా 2023-24 నాటికి అది 78.5 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో గ్రామీణ కుటుంబాలలో ఈ శాతం 49.6 నుంచి 61.1కి పెరిగింది. తెలంగాణ, ఒడిషా, కేరళ, గుజరాత్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, తమిళనాడు, హర్యానా, కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్రలో టీవీలు ఉన్న పట్టణ కుటుంబాల సంఖ్య తగ్గుతోంది.
మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడమే దీనికి కారణం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. పట్టణ ప్రాంతాల్లో వీటి వినియోగం 92.2 శాతం నుంచి 97.7 శాతానికి పెరగ్గా గ్రామీణ ప్రాంతాల్లో 77.6 శాతం నుంచి 98.5 శాతానికి పెరిగింది. సమాచారం, వినోదం కోసం ఇప్పుడు ప్రజలు టీవీల కంటే మొబైల్ ఫోన్ల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క తెలంగాణలో మాత్రమే పట్టణ కుటుంబాలలో మొబైల్ ఫోన్ల వాడకం 12 సంవత్సరాలలో 3.8 శాతం పాయింట్లు పడిపోయింది.
ఆహారంపై తగ్గిన మక్కువ
కుటుంబ వ్యయ ప్రాధాన్యతల్లో మార్పు కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని నివేదిక తెలియజేసింది. నెలసరి తలసరి వ్యయం (ఎంపీసీఈ)లో ఆహార వాటా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటిసారిగా యాభై శాతం కంటే దిగువకు పడిపోయింది. గ్రామీణ ఆహార వినియోగం 52.9 శాతం నుంచి 47 శాతానికి, పట్టణ వినియోగం 42.6 శాతం నుంచి 39.7 శాతానికి తగ్గింది. అదే కాలంలో ఇంధనం, విద్యుత్, వైద్యం, విద్య వంటి పద్దులపై ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో 35.2 శాతం నుంచి 39.9 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 45.4 శాతం నుంచి 47.8 శాతానికి పెరిగింది. భారతీయ కుటుంబాల వినియోగ ప్రాధాన్యతలు, కోరికల్లో వచ్చిన మార్పుకు ఇది అద్దం పడుతోంది. 2011-12లో నిర్వహించిన 68వ రౌండ్ జాతీయ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్), 2023-24లో నిర్వహించిన తాజా కుటుంబ వినియోగ వ్యయ సర్వే నుంచి తీసుకున్న డేటా ఆధారంగా నివేదికను రూపొందించారు.



