ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తాం
అంతవరకు కగార్‌ను ఆపేయండి
మావోయిస్టు ఎంఎంసీ ప్రతినిధి అనంత్ విజ్ఞప్తి
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలకు లేఖ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలను వీడి ప్రభుత్వం ఎదుట సామూహికంగా లొంగిపోతామనీ, అప్పటి వరకు ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) అధికార ప్రతినిధి అనంత్ ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అనంత్ లేఖను రాసినట్టు ఓ ప్రకటనను విడుదల చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలవాలని తమ కమిటీ నిర్ణయం తీసుకున్నదని ఆయన తెలిపారు. ఒక్కొరొక్కరుగా కాక సామూహికంగా ప్రభుత్వం ఎదుట లొంగిపోవటం ఉచితంగా ఉంటుందని తాము భావిస్తున్నట్టు వివరించారు.
ఇప్పటికే పార్టీ అగ్రనేతలు సోనూ దాదా, సతీశ్ దాదాలు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారనీ, వారు తీసుకున్న నిర్ణయం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అనివార్యంగా కూడా మారిందని అనంత్ పేర్కొన్నారు. సాయుధ బలగాల ఆపరేషన్‌లతో అనేక మంది పార్టీ శ్రేణులను కోల్పోవడం జరిగిందనీ, మిగతావారి మనుగడ కూడా ఆందోళనకరంగా ఉన్నదని వివరించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎదుట లొంగిపోవటం ఒకటే మార్గమని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇదివరకు తాను రాసిన లేఖకు స్పందించి ఛత్తీస్‌గఢ్ హౌం శాఖ మంత్రి విజయ్ శర్మ 10-15 రోజుల పాటు లొంగిపోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్టు ప్రకటించారనీ, కానీ అంత తక్కువ సమయం తమకు సరిపోదని అనంత్ వివరించారు. తమ శ్రేణులకు తాము తీసుకున్న తాజా నిర్ణయాన్ని తెలపడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు.
ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులలో తాము లొంగిపోవడానికి ఎవరైతే అనుకూలమైన రీతిలో చర్యలు తీసుకుంటారో వారి సమక్షంలోనే సామూహికంగా లొంగిపోవాలని తాము భావిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. లొంగిపోయే ముందు కానీ, లొంగిపోయిన తర్వాత కానీ తమ వైపు నుంచి ప్రజల సంక్షేమానికి సంబంధించి కొన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచుతామని అనంత్ వివరించారు. లొంగిపోవాలని తాము తీసుకున్న నిర్ణయాన్ని ఆలిండియా రేడియో ద్వారా సాయంత్రం ప్రసారం చేసే ప్రాంతీయ వార్తల కంటే ముందు తమ ప్రకటనను కూడా ప్రసారం చేయాలనీ, దాని ద్వారా తమ పార్టీ శ్రేణులు సమాచారం అందుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఉదయం, సాయంత్రం ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను వినే అలవాటు తమ శ్రేణులకు ఉందని వివరించారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని శ్రేణులకు చేర్చటానికి గానూ దండకారణ్యంలో శాంతియుత వాతావరణాన్ని కల్పించాలనీ, సాయుధ బలగాలు కూంబింగ్ ఆపరేషన్‌లు సాగిస్తే తాము తిరగటం కష్టమవుతుందనీ, కాబట్టి వెంటనే బలగాలను వెనక్కి రప్పించుకోవాలని ఆయన కోరారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను కూడా తాము నిర్వహించటం లేదని, అలాగే తాము నిర్వహించే ఇతర కార్యకలాపాలను కూడా నిలిపివేశామని అనంత్ వివరించారు.



