Saturday, November 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురాష్ట్రాల అధికారాలను హరించేలా విత్తన బిల్లు

రాష్ట్రాల అధికారాలను హరించేలా విత్తన బిల్లు

- Advertisement -

నాసిరకం విత్తనాల నియంత్రణ, సర్టిఫికేషన్‌పై హక్కులివ్వాలి
రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలి
పంట నష్ట పరిహారంపై బిల్లులో స్పష్టత లేదు : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నవతెలంగాణ రాజేంద్రనగర్‌
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా విత్తన బిల్లు-2025 రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉందనీ, కీలక అధికారాలన్నీ కేంద్రానికి కట్టబెట్టడం ఆందోళనకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు శాసనసభలోనూ చర్చిస్తామని తెలిపారు. పార్లమెంట్‌లో చర్చ జరిగేలా చూస్తామని చెప్పారు. కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025పై శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. అందులో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. విత్తనాల రిజిస్ట్రేషన్‌ నుంచి లైసెన్సింగ్‌ వరకు, మార్కెట్‌ నియంత్రణ నుంచి నాణ్యత పర్యవేక్షణ వరకు అన్నిటినీ కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవాలనే ధోరణి రాజ్యాంగ భావనకు వ్యతిరేకమని చెప్పారు. విత్తన సర్టిఫికేషన్‌ అధికారం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని నొక్కి చెప్పారు.

ఏ కంపెనీ ఎంత ధరకు అమ్ముతుందనే దానిపై నియంత్రణ లేదనీ, ధరల నియంత్రణపైనా రాష్ట్రాలకు హక్కులు లేవని ఎత్తిచూపారు. నాణ్యమైన విత్తనాన్ని రైతుకు అందుబాటులోకి తేవటం ఎంత కీలకమో నాసిరకం విత్తనాల వల్ల నష్టం జరిగినప్పుడు రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇప్పించడమూ అంతే కీలకమని చెప్పారు. దేశానికి అవసరమయ్యే విత్తనాల్లో 40 శాతానికిపైగా ఉత్పత్తి తెలంగాణ నుంచి జరుగుతున్నదనీ, విత్తన రైతులకు నష్టం జరిగితే పరిహారమిచ్చే ఏర్పాటు ఉండాలని డిమాండ్‌ చేశారు. సాంప్రదాయ విత్తనాల రక్షణ కోసం తెలంగాణలో రైతుల కోసం పనిచేసే కొన్ని సంస్థలు సీడ్‌ బ్యాంకులు పెడుతున్నామనీ, పాతకాలం నాటి విత్తనాలు, మూల విత్తనాలు దాచి పెట్టడం, పాత విత్తనాలను రైతుకు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

ఆ విత్తనాలన్నింటిని కూడా చట్టం నుంచి మినహాయింపు చేశారే తప్ప ప్రత్యేక ప్రోత్సాహకాలు తేలేదని ఎత్తిచూపారు. విదేశీ ఏజెన్సీలు సర్టిఫై చేసి విత్తనాలను మన దేశంలో అమ్ముకునే వెసులుబాటు కల్పించడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే విత్తనాలకు కూడా మన దేశంలో ట్రయల్స్‌ జరిపి సర్టిఫికేషన్‌ ఏజెన్సీ సర్టిఫికేట్‌ చేస్తేనే అమ్ముకునే అవకాశం కల్పించాలని సూచించారు. లేదంటే నాసిరకం విత్తనాల సంఖ్య పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. రైతు లకు రక్షణ, రాష్ట్రాల హక్కులు, నష్టపరిహారం విధా నం, విత్తన రైతుల సమస్యలు వంటి కీలక అంశాల్లో అవసరమైన మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగా నికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విత్తన చట్టం ముసాయిదాపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు.

డిసెంబర్‌ మొదటి వారంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖమంత్రి, అందరి అభిప్రాయాలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ప్రకటించారు. వర్సిటీ ఉపకులపతి అల్దాస్‌ జానయ్య మాట్లాడుతూ..60 ఏండ్ల తర్వాత తీసుకొచ్చిన ఈ చట్టంలో రైతు ప్రయోజనాల కోసం అనివార్యంగా సవరణలు చేయాలన్నారు. నేడు విత్తన సరఫరా సుమారు 90 శాతం ప్రయివేటు పరిశ్రమల చేతుల్లోకి వెళ్లిందని తెలిపారు. ఈ క్రమంలో రైతుల ప్రయోజనాలు, పరిరక్షణ కోసం చట్టాన్ని సవరించాలని, అందుకోసం రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ చట్టానికి ఎనిమిది సవరణలను అయన ప్రతిపాదించారు. 2004లో నాటి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టాన్ని ప్రతిపాదించిందని, కానీ రాష్ట్రాలు, రైతు సంఘాల ఒత్తిడితో దాన్ని అమలు చేయలేదని గుర్తు చేశారు. చట్టం అమలులో ఐకార్‌ సంస్థలు, రాష్ట్రాల విశ్వ విద్యాలయాలకి పాత్ర ఉండాలని అభిప్రాయపడ్డారు. రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలని అన్నారు. రైతులకు నష్టపరిహారం నిబంధనలు స్పష్టంగా ఉండాలని కోరారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించడాన్ని తప్పుబట్టారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ..రైతులకు నాసిరకం విత్తనాలు కట్టబెట్టే కంపెనీలపై శిక్షలు కఠినంగా ఉండేలా చట్టం ఉండాలని సూచించారు. మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ఈ చట్టంపై విశ్వ విద్యాలయం సూచించిన సవరణలు బాగున్నాయన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11, 12 తేదీల్లో విశ్వ విద్యాలయంలో పది వేల మంది రైతులతో నిర్వహించనున్న మెగా రైతు మేళా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మిన్‌ భాషా, సీడ్స్‌ కార్పోరేషన్‌ చైర్మెన్‌ అన్వేష్‌ రెడ్డి, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి, రైతు కమిషన్‌ సభ్యులు రాములునాయక్‌, పశ్య పద్మ, జైపాల్‌రెడ్డి, వ్యవసాయ రంగ నిపుణులు దొంతి నరసింహారెడ్డి, కన్నెగంటి రవి, అరిబండి ప్రసాద్‌ రావు, రామాంజనేయులు, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, రైతులు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం విత్తన విభాగం సంచాలకులు ఎం.నగేష్‌కుమార్‌ చట్టానికి సంబందించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -