Saturday, November 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబూట్లు, బట్టల్లో తెలంగాణకు డ్రగ్స్‌

బూట్లు, బట్టల్లో తెలంగాణకు డ్రగ్స్‌

- Advertisement -

కొరియర్‌లో ఢిల్లీ టూ తెలంగాణ
డ్రగ్స్‌ సరఫరాలో మాస్టర్‌ మైండ్‌ అరెస్ట్‌
రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం
ఢిల్లీ కమిషనరేట్‌లో ఢిల్లీ, తెలంగాణ పోలీసుల మీడియా సమావేశం
ఈగల్‌ టీంను అభినందించిన ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

దేశ రాజధానిలో ఢిల్లీ పోలీసులతో కలిసి తెలంగాణ ఈగల్‌ టీం చేపట్టిన భారీ ఆపరేషన్‌లో కీలక ఆధారాలు సేకరించింది. పెద్ద ఎత్తున నడుస్తోన్న డ్రగ్స్‌ దందాను గుర్తించిన పోలీసులు, ఢిల్లీ, గ్రేటర్‌ నోయిడా, గ్వాలియర్‌, విశాఖపట్నంలో ఏకకాలంలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్‌ సరఫరాలో మాస్టర్‌ మైండ్‌ తో పాటు, 12 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుంది. దాదాపు నెల రోజులకు పైగా నిఘా పెట్టిన ఈగల్‌ టీం ఈ అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఆటకట్టించింది. ఈ వివరాలను శుక్రవారం ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు వెల్లడించారు. తెలంగాణ ఈగల్‌ టీం ఎస్‌పి సీతారాంతో కలిసి ఢిల్లీ క్రైంబ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ సురేంద్ర కుమార్‌ వివరించారు. నైజీరియన్‌ డ్రగ్‌ ముఠాపై ఢిల్లీ, తెలంగాణ పోలీసుల జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించినట్టు చెప్పారు. మెహురౌలి, సంత్‌ ఘర్‌, నిలోథి, ప్రతాప్‌ ఎన్‌ క్లేవ్‌, గ్రేటర్‌ నోయిడా, మునిర్కా ప్రాంతాల్లో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో తెలంగాణ నుంచి 180 మంది పోలీసులు పాల్గొన్నట్లు చెప్పారు. మొత్తం 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, ఇందులో గ్రేటర్‌ నోయిడాలో డ్రగ్స్‌ ఆర్థిక వ్యవహారాలు చూసే బద్రుదీన్‌ అనే కీలక వ్యక్తి అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. మొత్తం రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ రికవరీ చేశామన్నారు. డ్రగ్స్‌ కేసులో 10 మందిని అరెస్ట్‌ చేయగా, తెలంగాణ పోలీసులు ఏడుగురిని, ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వీరిలో ఢిల్లీ ఎన్సీఆర్‌కు చెందిన వారని, ఇద్దరు నైజీరియా, యుగాండ నుంచి ఒకరు ఉన్నట్లు తెలిపారు. అలాగే.. వీసా గడువు ముగిసిన మరో 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణలో నమోదైన కేసుల ఆధారంగా వారిని అరెస్ట్‌ చేశామన్నారు. డ్రగ్స్‌ కంట్రోలో తెలంగాణ ఈగల్‌ టీం కృషిని సీపీ అభినందించారు.

కొరియర్‌లో డ్రగ్స్‌
దేశ రాజధాని ఢిల్లీ నుంచి దేశ వ్యాప్తంగా జరుగుతోన్న ఈ డ్రగ్స్‌ దందాలో వీస్తూ పోయే నిజాలను తెలంగాణ ఈగల్‌ టీం గుర్తించింది. ప్రధానంగా మెట్రో పాలిటన్‌ సిటీలకు చేరుతోన్న ఈ డ్రగ్స్‌ తీరును సేకరించింది. కొరియర్‌ ద్వారా ఢిల్లీ టూ తెలంగాణకు డ్రగ్స్‌ చేరుతుందని ఈగల్‌ టీంకు చెందిన ఎస్‌పీ సీతారాం తెలిపారు. ముఖ్యంగా షూస్‌, షర్ట్‌ కాలర్‌ లో ఉంచి డ్రగ్స్‌ కొరియర్‌ చేసేవారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల నమోదు చేసిన కేసు ఆధారంగా ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టామన్నారు. ఢిల్లీ పోలీసులతో కలిసి ఈగల్‌ టీమ్‌ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఈ ఆపరేషన్‌లో ఢిల్లీ పోలీసులు పూర్తి సహకారాన్ని అందించారన్నారు. ఫోన్‌ కాంటాక్ట్‌ డిటైల్స్‌ ద్వారా పూర్తి వివరాలు రాబట్టినట్లు చెప్పారు. అంతర్జాతీయ డ్రగ్‌ నిందితులతో పాటు, రూ. 1,18,500 నగదు రికవరీ చేశామన్నారు. నైజీరియన్స్‌ షూస్‌, బట్టల్లో డ్రగ్స్‌ పంపిస్తున్నారన్నారు. వీరు తెలంగాణలోని 1,975 వినియోగదారులకు సప్లై చేస్తున్నారని తెలిపారు. గడిచిన రెండు నెలల్లో రూ. 5 కోట్ల లావాదేవీలు జరిగినట్టు గుర్తించామన్నారు. కాగా… ఈ జాయింట్‌ ఆపరేషన్‌ లో స్మగ్లింగ్‌ కొకైన్‌, ఎండిఎంఎ, హెరైన్‌, సింథటిక్‌ డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -