సర్పంచ్ స్థానాలకు 8,198, వార్డులకు 11,502
అత్యధికంగా నల్లగొండలో 974, అత్యల్పంగా ములుగులో 63
వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపని అభ్యర్థులు…బ్యాలెట్లో నోటా
ఫ్రీ సింబల్స్, అభ్యర్థుల వ్యయాన్ని విడుదల చేసిన ఈసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లకు రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు సగటున ఒక్కటి కంటే తక్కువ, వార్డు మెంబర్ల స్థానాలకు సగటున 4.5 శాతం మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం పూట ముహూర్తం బాగా లేదని పలు ప్రాంతాల్లో సాయంత్రం మూడు గంటల నుంచి నామినేషన్ వేసేందుకు అభ్యర్ధులు క్యూ కట్టారు. దాంతో 5 గంటల లోపు వచ్చిన వారికి రిటర్నింగ్ అధికారులు అధికారులు అవకాశం కల్పించారు. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,236 సర్పంచ్ స్థానాలకు 4,901 నామినేషన్లు దాఖలు కాగా మొదటి రోజుతో కలిపి మొత్తం రెండు రోజుల్లో 8,198కి చేరాయి.
అలాగే 37,440 వార్డులకు గాను 9,643 నామినేషన్లు దాఖలు కాగా, మొదటి రోజుతో కలిసి 11,502కు చేరాయి. సర్పంచ్ స్థానాలకు రెండు రోజుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 796 నామినేషన్లు వేశారు. 48 స్థానాలున్న ములుగు జిల్లాలో అత్యల్పంగా 63 నామినేషన్లు వచ్చాయి. 28,70 వార్డుమెంబర్లు ఉన్న నల్లగొండలో అత్యధికంగా 974, ములుగు జిల్లాలో 93 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు సగటున రెండు చొప్పున, వార్డు మెంబర్లకు మూడున్నర స్థానాలకు కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. మారిన రాజకీయ పరిస్థితులు, అధిక వ్యయం మూలంగా పోటీ చేసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైతాయని భావిస్తున్నారు.
ఎన్నికల బ్యాలెట్లో నోటా
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. సర్పంచ్ ఎన్నికలకు 30 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను ప్రకటించింది. సర్పంచ్ ఎన్నికల్లో మొదటి గుర్తు ఉంగరం, రెండవ గుర్తు కత్తెర కాగా, చివర రెండు గుర్తులు వరుసగా గాలి బుడగ, క్రికెట్ స్టంప్స్‌గా మొత్తం 30 గుర్తులను కేటాయించారు. వార్డు ఎన్నికల్లో మొదటి గుర్తు గౌను, రెండవ గుర్తు గ్యాస్ పొయ్యి కాగా, చివర రెండు గుర్తులు వరుసగా విద్యుత్ స్తంభం, కెటిల్‌గా మొత్తం 20 గుర్తులను కేటాయించారు. బ్యాలెట్ చివరి గుర్తు తర్వాత నోటా గుర్తు ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఈసీ సర్క్యూలర్ జారీ చేసింది. గుర్తు కేటాయింపు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద్వారా కేటాయిస్తారు. ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉంటే వాటి ఇంటి పేరు, నివాసాన్ని పరిగణంలోకి తీసుకుని ఎన్నికల అధికారులు గుర్తులను కేటాయించాలని ఈసీ సూచించింది.
సర్పంచ్ ఎన్నికల గరిష్ట వ్యయం రూ.2.5 లక్షలు
సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని ఈసీ ప్రకటించింది. ఈ మేరకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని 243 (కే) అధికరణ, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఈ వ్యయాలను నిర్ణయించినట్టు పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 50 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.1.5 లక్షలు, 50 వేలు అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీల్లో పోటీ చేసే వారు రూ.2.5 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. 50 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే వార్డు మెంబర్లు రూ.30 వేలు, 50 వేలు అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాతీల్లో పోటీ చేసే వారు రూ.50 వేలకు మించి వ్యయం చేయరాదని ఉత్తర్వులో పేర్కొన్నారు. రోజు వారి వ్యయాన్ని సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.
కొనసాగుతున్న నామినేషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



