Sunday, May 18, 2025
Homeఎడిట్ పేజిమూర్ఖపు నోళ్లు

మూర్ఖపు నోళ్లు

- Advertisement -

‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’ ఇది ఎప్పటిదో నానుడి. నోరు మంచిదవటం అటుంచి కంపుగా, మూర్ఖంగా మారితే ఎంత దుర్మార్గంగా తయారవుతుందో విజరుషా, జగదీశ్‌ దేవడా ఇంకా మరికొన్ని నోళ్లు బహిరంగంగా నిరూపిస్తున్నాయి. గత పదకొం డేండ్ల నుండి ఇలాంటి వాళ్ల నోటి నుండి వస్తున్న కంపును భరించలేక చస్తున్నాం. ఇవేవో వ్యక్తిగతమేకాదు, వ్యవస్తాపరమైన, సమాజం మొత్తానికి వర్తించే విచ్ఛిన్న భావజాలపు కల్మషాలకు వ్యక్తం చేస్తు న్నాయి. వ్యవస్థలనే అవమానపరచే దుష్ట ధ్వనులివి. నోళ్లు నిండిన మాటలు, కేవలం నోళ్లలోంచేరావు. అవన్నీ వాళ్ల మనసు బురదల్లో పుట్టిన ఆలోచనలే. మూర్ఖత్వం మూర్తీభవించిన వారి అభివ్యక్తులు అవి. ఈ నోళ్లను కట్టడి చేయకపోతే వాతావరణ మంతా దుర్గం ధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది.
పెహల్గాం దాడి తర్వాత మన భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం చేపట్టిన సిందూర్‌ ఆపరేషన్‌ విజయవంతం అయినందుకు, దేశంలోని ప్రజలందరూ, ప్రతిపక్షాలూ, దేశ వాసులందరూ ప్రభుత్వానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతును అందించారు. తరతమ భేదాలన్నీ మరచి వెన్నంటి ఉన్నారు. ఇలాంటి ఐక్యత అవసరమైన వేళ విచ్ఛిన్న ప్రకటనలు, అవమాన పరిచే ఉక్తులు, అధికారపు హోదాలు వెలగపెడుతున్నవారి నుండి రావటం క్షమించరాని నేరమే అవుతుంది. ఆపరేషన్‌ సిందూర్‌లో ప్రముఖపాత్ర పోషించిన కల్నల్‌ సోఫియా ఖురేషీ, అందుకు సంబంధించిన వివరాలను దేశానికి సగర్వంగా వివరించి తెలిపింది. అట్లాంటి ఒక వీరవనితపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలోని మంత్రి, బీజేపీ నాయకుడు విజరుషా దుర్మార్గమైన వ్యాఖ్య చేశాడు. సోఫియా ఖురేషీ ‘ఆమె ఉగ్రవాదుల సోదరి’ ఆమెతోనే ఉగ్రవాదులను మట్టుపెట్టించారు మన ప్రధాని అని వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదుల సోదరి అని ఎందుకన్నాడంటే, ఉగ్ర వాదులు ముస్లిం మతస్తులు కావున మన కల్నల్‌ ఖురేషి ముస్లిం కావడం, ఆయన ఆలోచనలు మతపరంగానే విశ్లేషించాయి. ఇది చాలా తీవ్రమయిన వ్యాఖ్య. మన సైన్యంలో అనేకమంది అనేక మతాలకు, ప్రాంతాలకు సంబంధించిన వారు తమ సేవలను అందిస్తున్నారు. అంతేకాదు, త్యాగాలను చేస్తున్నారు. భారతదేశం లౌకికదేశమని స్వయానా ఖురేషీ వెల్లడించింది. పెహల్గాంలో తీవ్ర వాదులు మతం పేరు అడిగి చంపారంటున్నారు. మన మంత్రులూ మతాన్ని ఆధారం చేసుకునే మాట్లాడుతున్నారు. ఇది ఖురేషీ సేవను, సాహసాన్ని, నిబద్ధతను అవమానించే వ్యాఖ్య. ముప్పయి ఏండ్ల నుండి సేవ చేస్తూ ఎన్నో ప్రశంసలను పొందిన కల్నల్‌ ఆమె. ఆమే కాదు, ఆమె తాత, తండ్రి అందరూ దేశం కోసం సైన్యంలో పనిచేసినవారే. ‘మాకు ముందు దేశం, ఆ తర్వాతే మతం’ అని ప్రకటించిన వారు కూడా. విజరుషా వ్యాఖ్య తీవ్రమైందిగా భావించి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు నమోదు కాగా దానిపై స్టే ఇవ్వాలని సుప్రీంకు వెళ్లగా సుప్రీంకోర్టు నిరాకరించి, కల్నల్‌కు క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. ఇవన్నీ జరుగుతున్నా ఇంతవరకు, అక్కడి ప్రభుత్వం కానీ, బీజేపీ నాయకత్వంకానీ అతనిపై ఏ చర్యా తీసు కోలేదు. ప్రధాని కూడా మాట్లాడలేదు. సోఫియా కుటుంబ సభ్యులు సైతం ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని, రక్షణ మంత్రి, హోం మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మతం ఆధారంగానే మనుషులను చూడటం మాట్లాడటమనేది రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నవారు చేయవచ్చా!
ఇదిలావుంటే సైనికులకు చేతులెత్తి సలాం చేయాల్సిన వేళలో ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా యావత్‌ సైన్యం ప్రధాని మోడీ పాదాలకు ప్రణమిల్లిందని, మన సైన్య పరాక్రమాన్ని అవమానిం చాడు మధ్యప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి జగదీశ్‌ దేవ్డా. తక్షణమే క్షమా పణలు చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. అంతేకాదు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీడియాకు తెలియచేసిన విదేశీ వ్యవహారాల కార్యదర్శి, విక్రమ్‌ మిస్రీపైన మూర్ఖ శిఖామణులు ట్రోలింగ్‌కు తెగబడ్డారు. కాల్పుల విరమణ అనేది ప్రభుత్వాల మధ్య జరిగేదన్న ఇంగిత జ్ఞానం వీళ్లకు లేకపోయింది. అంతకుముందు పెహల్గాంలో భర్తను కోల్పోయిన హిమాన్షుపై కూడా దుర్మార్గమైన ట్రోలింగ్‌ జరి గింది. ఈ మూర్ఖపు వ్యాఖ్యలు, ట్రోలింగ్స్‌ అన్నీ దేశభక్తులమని చెప్పు కునే సంఘ పరివార్‌ శక్తుల నుండే వస్తున్న విషయాన్ని గమనించాలి. ప్రభుత్వాలు ఇప్పటికయినా ఈ నోళ్లను మూయించాలి! దేశ సమైక్యతను దెబ్బతీసే వారిని శిక్షించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -