– మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి
నవతెలంగాణ కమ్మర్ పల్లి
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సకల జనులు సంబురంగా ఉన్నారని, మ్యానిఫెస్టోతో ప్రతి ఇంటా పండుగ నెలకొందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సకల జనులు సంబురంగా ఉండడంతో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను చూసి గ్రామాల్లో ప్రజలు మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ జేజేలు పలుకుతున్నారన్నారు.కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా తెలంగాణ ప్రజలందరికి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. తెలంగాణ అప్పుడెట్లా ఉండేదో.. ఇప్పుడెట్ల ఉందో ప్రజలు ఆలోచించాన్నారు.తొమ్మిదిన్నరేండ్ల క్రితం తెలంగాణలో కరువులు, వలసలు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, తీవ్రమైన కరెంటు కోతలు ఎన్నెన్నో సమస్యలు ఉండేవన్నారు.ప్రజలు నమ్మకంతో గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్దితో పనిచేసి, ప్రజలందరి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. బాల్కొండ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చరిత్రలోనే నిలిచిపోయే విధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను గడప గడపకు వెళ్లి ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకువెళ్లాలన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను గుర్తించి మూడోసారి భారీ మెజారిటీతో గెలిపించే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు.మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించారాని,అర్హులైన మహిళలకు నెలనెలా జీవన భృతి అందిస్తామని, పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని హామీ ఇచ్చారని, తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేదఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5లక్షల జీవిత భీమా, ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో రూ.5వేలకు పెరుగుతుందన్న విషయాన్ని వివరించాలన్నారు. రైతు బంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా రూ.10వేలను బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఐదేండ్లలో క్రమంగా పెంచుతూ గరిష్టంగా ఎకరానికి ఏట రూ.15వేలు అందించే హామీని కూడా రైతుల్లోకి తీసుకుపోవాలన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు, సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, పిప్పేరా అనిల్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, రైతు విభాగం మండల అధ్యక్షుడు బద్దం రాజశేఖర్, గ్రామ శాఖ అధ్యక్షులు చింత గణేష్, మండల కో ఆప్షన్ సభ్యుడు అజ్మతు హుస్సేన్, నాయకులు అవారి గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.