విప్లవదీక్షకు ఆయనొక ఉదాహరణ.చైతన్యస్ఫూరికి ఆయనో ప్రతీక. సమసమాజ నిర్మాణమే జీవిత లక్ష్యంగా జీవితాంతమూ కృషిచేసిన మహానేత. ప్రజాశ్రేయస్సే కర్తవ్యంగా నడిచిన నిరాడంబర నిబద్ధజోధ. ఉన్నత కుటుంబం నుంచి వచ్చాడు. దీనుల కోసం, పేదల కోసం శ్రమించాడు. సైకిల్‌మీదే చట్టసభలకు వెళ్లిన ప్రజానాయకుడు. ఆయన గురించి తెలుసుకోవడం రేపటితరానికి ఒకస్ఫూర్తి. అది మనల్ని నడిపించే దీప్తి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనొక అరుణశిఖరం. విప్లవం కోసం మెరిసిన పతాకం.సమసమాజ భావనకు ప్రతిరూపం.. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.
నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఓ భూస్వామ్య కుటుంబంలో 1913 మే1 జన్మించిన సుందరయ్యది బాల్యం నుంచే పోరాట శైలి. తన కండ్ల ముందు ఏ అన్యాయం జరిగినా సహించేవాడు కాదు. కొన్ని కులాల వాళ్లను తక్కువగా చూడటం, చులకనగా మాట్లాడం ఆయనకు నచ్చేది కాదు. అంటరానితనం, సామాజిక అసమానతలు సరికాదని చెప్పేవాడు. దళితులను ఇంట్లోకి ఎందుకు రానివ్వరని అమ్మతో తగాదా పడేవాడు. వ్యవ సాయ కార్మికులకు రావాల్సిన కూలి విషయంలో మోసం ఉందని గొడవపడేవాడు. దళితుల పేర్ల చివర ‘వాడు’ అని ఎవరైనా అంటే వాగ్వాదానికి దిగేవాడు. సొంత గ్రామంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా తిరగబడ్డాడు. భూమిలేని పేదలకు భూమిని పంచాలని, కూలీ రేట్లు పెంచాలని పట్టుబట్టాడు. రేట్లు పెంచితే తర్వాత భూమిని పంచాలని వారు డిమాండ్ చేస్తారనే వాదన భూస్వాముల నుంచి వచ్చింది. కానీ ఆయన కూలి పెంపు పోరాటం చేసి ఆ తర్వాత భూపంపిణీ కోసం కూడా తిరుగుబాటు చేశాడు. సమానత్వం కోసం జరిగిన ఈ పోరాటంలో ఆయన దళితులతోనూ, వెనుకబడిన కులాలతో కలిసి నిలబడ్డాడు. అప్పుడే కులానికి చిహ్నమైన తన పేరులో నుంచి సుందరరామి’రెడ్డి’ని తొలగించుని సుంద రయ్యగా మారాడు.
జాతియోద్యమం పిలుపుతో ‘సైమన్ కమిషన’్‌కు వ్యతిరేకంగా తరగతులను వెళ్లకుండా బహిష్కరించాలని విద్యార్థులను కోరాడు. అప్పటికి ఆయన వయసు పదమూడేండ్లు. కాలక్రమేణా సుందర య్యను కమ్యూనిస్టు ప్రణాళిక ఎంతగానో ప్రభావితం చేసింది.దాన్ని చదివాక కమ్యూనిజమే సరైన రాజకీయ దృక్పథమని నిర్ణయించుకున్నాడు. దీనికి లోతైన అవగాహన అవసరమని గ్రహించి మార్క్సిజం-లెనినిజం అధ్యయనంపై దృష్టి పెట్టాడు. సుందరయ్యను కమ్యూనిస్టుగా తీర్చిదిద్దింది అమీర్ హైదర్‌ఖాన్. అప్పటి నుండి అంచలంచెలుగా మహా కమ్యూనిస్టు నేతగా ఎదిగాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. దేశ పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు చరిత్రను, అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. అంతేకాదు, సాహి త్యాన్ని, పోరాటాల చరిత్రను చదివాడు. కమ్యూనిస్టు ఉద్యమంలోకి దూకాడు.
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సుందరయ్య నాయకత్వం వహించాడు. రజాకార్ల అమానుషం, భూస్వాముల ఆకృత్యాలు, దేశ్‌ముఖ్‌ల వేధింపులతో విసిగిపోయిన పల్లె ప్రజలు కమ్యూని స్టులతో కలిసికదం తొక్కడంలో సుందరయ్యది కీలకపాత్ర. అప్పటిదాకా ఫ్యూడల్ నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి మొండికేసిన నిజాం చివరికి కమ్యూనిస్టులు బలపడటం, భారత మిలిటరీ జోక్యంతో తలొగ్గక తప్పలేదు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత కమ్యూనిస్టులు తెలంగాణలో పది లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత కమ్యూనిస్టులు బలపడ్డారు. అప్పటికీ తెలంగాణ కమిటీకి సుందరయ్యే నాయకత్వం వహిస్తున్నారు. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్టులకు మంచి ఫలితాలు వచ్చాయి. సుందరయ్య ప్రజాప్రతినిధిగా ఎన్నికై పార్లమెంట్‌లోనూ, శాసనసభలోనూ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించేవారు. పార్లమెంట్‌కు కూడా ఆయన సైకిల్‌పైనే వెళ్లేవారు. క్యారేజికి పైళ్లను కట్టుకుని, సైకిల్‌ను స్టాండ్‌లో పెట్టి అక్కడినుంచి ఫైళ్లు సంకలో పెట్టుకుని పార్లమెంట్ సమావేశ మంది రానికి నడుచుకుంటూ వెళ్లేవారు. ప్రతిరోజూ సరైన సమయానికి చేరుకునేవారు. రావడానికి ముందే దిన పత్రికల్ని చదివేవారు. ఆరోజు పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని పేపర్లను క్షుణ్ణంగా పరి శీలించి సిద్ధం చేసుకుని వచ్చేవారు. ఆయన ప్రసంగాలను ప్రతిపక్షసభ్యులు కూడా చాలా శ్రద్ధగా వినేవారు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఇంటికి సైకిల్‌పైనే వెళ్లేవారు. సైకిల్‌పైనే తిరుగుతూ పనులన్నింటినీ సకాలంలో పూర్తిచేయడం అందరినీ ఆశ్చర్యపరిచేది. పార్లమెంట్, అసెంబ్లీలో ఇరవైయేండ్ల పాటు ప్రజావాణిని వినిపించారు.
పార్లమెంటరీ కార్యక్రమాల్లో భారత విప్లవోద్యమ పాత్ర, పరిమితుల గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేది. బాధ్యతయుతమైన విమర్శ ఎలా ఉండాలో, ప్రత్యామ్నాయ సూచనలు ఎలా చేయాలో, పార్లమెంట్ బయట జరుగుతున్న ప్రజాపోరాటాలను ఎలా ప్రతిధ్వనింపచేయాలో సుందరయ్య ఆచరణలో చూపారు. కమ్యూనిస్టు పార్లమెంట్ సభ్యుడు ఎలా ఉండాలన్న దానికి ఒక చక్కని ఉదాహరణ సుందరయ్య. కమ్యూనిస్టు పార్టీలో అతివాదులు, మిత వాదుల చీలికల తర్వాత తను నమ్మిన సిద్ధాంతంతో 1964లో ఏర్పడిన సీపీఐ(ఎం)లోనే తుదిశ్వాస వరకు కొనసాగారు. పార్టీ అఖిలభారత తొలి ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం నాయకత్వం అందించారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఎంతో కార్యదీక్షతో కార్యకర్తలతో మమేకమై పేదల కోసం పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కులరహిత సమాజం, భూస్వామ్య దోపిడీ పీడనలు, పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన చేసిన అలుపెరగని పోరాటం, చూపిన తెగువ ఆయన్ను చరత్రిలో చిరస్థాయిగా నిలిపాయి. జీవితమంతా కచ్చితమైన క్రమశిక్షణ, కమ్యూనిస్టు విలువలను పాటించిన నాయకుడు. ఆసాధారణమైన త్యాగాలు చేసిన అత్యున్నత నేత. 1985 మే19న అనారోగ్యంతో కన్నుమూశారు.
నిరంతర చింతనలో..
అడుగడుగూ సంతకాలలో
మార్క్సిజపు రంగరింపులో..
కాలపు ఉలి మలిచిన రూపం
సుందర సమున్నత ద్వీపం..
మా సుందరయ్య..
చైతన్య దారిదీపం..
మా సుందరయ్య…
(మే19 కామ్రేడ్ పీఎస్ 40వ వర్థంతి)
ఎన్.అజయ్ కుమార్
కొనసాగే చైతన్యం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES