– ఆస్పత్రుల పర్మిషన్ సర్టిఫికెట్లు, పత్రాల పరిశీలన
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలోని ఆస్పత్రులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తీవ్రంగా స్పందించింది. డాక్టర్ రాథోడ్ నేతృత్వంలోని బృందం శనివారం ఆకస్మికంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ కోటాచలం సమక్షంలో పర్మిషన్ సర్టిఫికెట్లు, అనుమతుల పత్రాలు, వైద్యాధికారుల ప్రమాణాలు వంటి కీలకమైన డాక్యుమెంట్లను పరిశీలించింది. నాలుగు ఆస్పత్రులపై పూర్తి సమాచారం సేకరించి హైదరాబాద్‌కు తీసుకెళ్లింది. త్వరలో ఈ నివేదికను ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్‌కు సమర్పించి, ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు అధికార బృందం వెల్లడించింది. వారం రోజులుగా సూర్యాపేటలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులతోపాటు డీఎంహెచ్‌ఓ కోటాచలంపై ఆరోపణలు వస్తుండటంతో.. సమగ్ర సమాచారం సేకరించేందుకు ఈ బృందం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఆస్పత్రుల పర్మిషన్‌కు సంబంధించిన అర్హత పత్రాలు, సంబంధిత వైద్యాధికారుల అనుమతి సర్టిఫికెట్లు వంటి కీలక డాక్యుమెంట్లను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అనే దానిపై సమగ్రంగా నివేదిక సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నాలుగు ఆస్పత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక పత్రాలను సేకరించి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నివేదికను రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవిచంద్రనాయక్‌కు సమర్పిస్తామని, అనంతరం ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో తదుపరి చర్యలు తీసుకుంటారని అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ తెలిపారు. ఈ బృందంలో పర్సనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్, డిప్యూటీ సీిఎస్‌పీసీపీ ఎన్‌డిటి డాక్టర్ సుమిత్రారాణి, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా మోహన్ పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర బృందం తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES