Sunday, May 18, 2025
Homeరాష్ట్రీయం20మంది మావోయిస్టుల అరెస్ట్‌

20మంది మావోయిస్టుల అరెస్ట్‌

- Advertisement -

– భారీగా ఆయుధాలు స్వాధీనం
– ఎస్పీ సమక్షంలో మరో 8మంది లొంగుబాటు
నవతెలంగాణ-ములుగు

ములుగు పోలీసులు 20మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సమక్షంలో మరో 8మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. వారందరినీ శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల సమీపంలో గల వెంకటాపురం, వాజేడు, పెరూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధుల్లో గల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్‌ నిర్వహించి 20మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఐఎన్‌ఎస్‌ ఏఎస్‌, ఎస్‌ఎల్‌ఆర్‌ 303 వంటి ఆయుధాలు, గ్రెనేడ్లు, బుల్లెట్లు, కమ్యూనికేషన్‌ పరికరాలు, డిజిటల్‌ డేటా సామాగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టులు అటవీ ప్రాంతం లో ఐఈడీలు అమర్చి ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంపై పోలీసుల నిఘా పెంచి, సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో కలిసి కూంబింగ్‌ చేపట్టామన్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి పారిపోతున్నట్టు సమాచారం అందడంతో మూడు విడతలుగా మావోయిస్టులను అరెస్టు చేసినట్టు చెప్పారు. అందులో భాగంగా మే 16న వెంకటాపురం వద్ద ఆరుగురు మావోయిస్టులు అరెస్టు కాగా,17న ఉదయం వాజేడు మురుమూరు అటవీ ప్రాంతంలో ఏడుగురు, కనాయిగూడం, గంగారం గుత్తికోయ గ్రామ సమీపంలో ఏడు గురు మావోయిస్టులను అరెస్టు వివరించారు. ఈ 20మందిలో డివిజన్‌ కమిటీ సభ్యుడు(డివిసి) ఒకరు, ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎం) ఐదుగురు, పార్టీ సభ్యులు (పిఎం) పద్నాలుగు మంది ఉన్నారని, వీరంతా గతంలో పలు తీవ్రమైన నేరాల్లో పాల్గొన్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా 2017 నుంచి 2024 వరకు జరిగిన అంబుష్‌ దాడులు, ఐఈడి పేలుళ్లు, ఆయుధాల దోపిడీలు వంటి క్రిమినల్‌ ఘటనల్లో వీరి ప్రమేయం ఉన్నట్టు తెలిపారు. మావోయిస్టు నాయకులు, సభ్యులు ప్రభుత్వ సరెండర్‌ పాలసీని వినియోగించుకుని సమాజంలోకి వచ్చి శాంతియుత జీవితం గడపాలని కోరారు. ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దని, సహాయం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎనిమిది మంది లొంగుబాటు
ప్రభుత్వ నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న 8మంది సభ్యులు శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని సూపరింటెండెంట్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శబరీష్‌ సమక్షంలో లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పోరుకన్నా ఊరు మిన్న-మన ఊరికి తిరిగి రండి’ అనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభావితమై 8మంది సభ్యులు హింసామార్గాన్ని వీడి ప్రశాంత జీవితం వైపు అడుగులు వేశారని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి 24గంటల్లోపు రివార్డు నగదు పంపిణీ, వైద్య చికిత్స, పునరావాసానికి ప్రభుత్వ సహాయం, ఇతర అవసరాలకు శాశ్వత మార్గదర్శనం, తక్షణ సహాయంగా రూ.25వేల చొప్పున అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఏటునాగారం ఎస్పీ ఉపాధ్యాయ, ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌, వెంకటాపురం సీఐ, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -