వరి తప్ప పత్తి విత్తనాలు పట్టని ఆగ్రో, సీడ్ కార్పొరేషన్
కొన్ని బ్రాండ్లకు డిమాండ్ సృష్టించి దోపిడీ
ఇదే అదునుగా కల్తీ విత్తనాలు అంటగడుతున్న దళారులు
ఏటా నష్టపోతున్న పత్తి రైతులు
గ్రామాల్లో రహస్య గోదాముల్లో కల్తీ విత్తనాల నిల్వలు
టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా వైఫల్యం
ప్రభుత్వ సంస్థలే విక్రయించాలి : రైతు సంఘం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తొలకరి కురిసిందంటే రైతులు పత్తి విత్తుకునే పనిలో పడతారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వానాకాలం పంటల సాగు పట్ల రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే, పత్తి సాగు విషయంలో ప్రభుత్వాలు రైతుల్ని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వరి సాగుకు కావాల్సిన విత్తనాల్ని ప్రభుత్వరంగ సంస్థలు సబ్సిడీపై సరఫరా చేస్తున్నాయి. కానీ.. అత్యధికంగా సాగవుతున్న పత్తి విత్తనాలు పూర్తిగా ప్రయివేట్ కంపెనీల చేతుల్లో ఉండిపోయాయి. దీంతో పత్తి సాగు చేసే రైతులకు ప్రతి ఏటా సమస్యలెదురవుతున్నాయి. అవగాహనాలేమీ, అవసరాల్ని ఆసరా చేసుకుంటున్న కంపెనీలు, ఏజెన్సీలు, రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు, దళారులు అందరూ పత్తి విత్తన దందా సాగిస్తున్నారు. కంపెనీల విత్తనాల్లో కొన్ని బ్రాండెడ్లకు డిమాండ్ సృష్టించి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఒక పక్క సాగుతుండగా.. తక్కువ ధర పేరిట కల్తీ విత్తనాల్ని అంటగట్టి లాభపడుతున్నారు. ప్రతి ఏటా కల్తీ విత్తనాలు కొని రైతులు నష్టపోతున్నారు. ఈ వానాకాలం సీజన్‌లోనూ కల్తీ విత్తనాల విక్రయాలు గుట్టుగా సాగుతున్నట్టు పోలీసు వర్గాల అనధికార సమాచారం. ఈ వానాకాలంలో రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసే అవకాశముందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకోసం 45 వేల క్వింటాళ్ల పత్తి విత్తనాల అవసరముంటుందని నిర్ధారించారు. అదే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి పంటే సాగవుతుంది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3.34 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 48000 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పత్తి సాగు కోసం సుమారు 8 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరముంది.
గుట్టుగా కల్తీ విత్తన దందా
ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 5.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశముంది. ఎకరానికి ప్యాకెట్‌న్నర నుంచి రెండు ప్యాకెట్ల వరకు విత్తనాలు విత్తుతారు. ఈ వానాకాలంలో సుమారు 8 లక్షల విత్తన ప్యాకెట్ల్ల విక్రయాలు సాగనున్నాయి. కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దఎత్తున సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు కల్తీ విత్తనాలు వచ్చినట్టు చెబుతున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే దళారులు కొందరు ఆయా ప్రాంతాల్లోని రహస్య గోదాములు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. బయటి రాష్ట్రాల నుంచి తెచ్చిన కల్తీ విత్తనాలను ఆ గోదాముల్లో ప్యాకింగ్ చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొందరు స్థానిక మధ్యవర్తులతో ఒప్పందం కుదుర్చుకుని విత్తనాలు అమ్ముతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా బీటీ పత్తి విత్తనాల బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్ల మాదిరే కల్తీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేసి రైతులకు అమ్ముతున్నారు. కంపెనీ విత్తనాల మాదిరిగానే తెగుళ్లను తట్టుకుంటుందని, అధిక దిగబడులు వస్తాయని నమ్మబలుకుతున్నారు. బీటీ ప్యాకెట్ ధర రూ.901 ఉండగా.. అందులో సగం రూ.500, రూ.600కే ఇస్తామని అంటగడుతున్నారు.
బ్రాండెడ్ కంపెనీల దందా
బీటీ-1, బీటీ-2, బీటీ-3 విత్తనాలు మార్కెట్లో ఉంటున్నాయి. బీటీ-3 విత్తనాలపై నిషేధం ఉన్నా కొన్ని చోట్ల గుట్టుగా రైతులకు అధిక ధరలకు అమ్ముతున్నారు. రాసి, తులసీ, మహికో, అంబూజ, యూఎస్, అగ్రీసీడ్, క్యాష్, 7067, రేవంత్, ఎటీఎం, సీమాన్, బయోసీడ్, జయగోల్డ్, చంద్రగోవా, సదానంద్, యాక్స్‌్, ప్రవర్ధన్, సంకేత్ వంటి కంపెనీలవి బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిల్లో ఏ కంపెనీ, ఏ రకం విత్తనం మేలైనదో రైతులకు అవగాహన లేదు. దీంతో కంపెనీలు, ఏజెన్సీలు, రిటైల్, హోల్‌సేల్ వ్యాపారులు కుమ్మక్కవుతున్నారు. ఈ సీజన్‌లోనూ ఒకటి రెండు బ్రాండ్లకు మాత్రమే డిమాండ్ సృష్టించి కొరత ఉందని చెబుతున్నారు.
పట్టని ఆగ్రో, సీడ్ కార్పొరేషన్
తెలంగాణ సీడ్ కార్పొరేషన్, ఆగ్రో సంస్థలు వరి విత్తనాలను మాత్రమే విక్రయిస్తున్నాయి. పత్తి విత్తనాలపై దృష్టి సారించడం లేదు. పత్తి విత్తనాలు పూర్తిగా ప్రయివేట్ కంపెనీలు, వ్యాపారుల చేతుల్లోనే ఉన్నాయి. దీంతో రైతు లు నిలువు దోపిడీకీ గురవుతున్నారు. ప్రభుత్వ సంస్థలు విక్రయించడం వల్ల నాణ్యమైన, ఎంఆర్‌పీ ధరలకే పత్తి విత్తనాలు రైతులకు అందే అవకాశముం టుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జయరాజు అన్నారు.
టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా
కల్తీ విత్తనాల విక్రయాలు, నిల్వలు, బ్రాండెడ్ పేరిట బ్లాక్ మార్కెట్ వంటి విషయాలపై టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెట్టినట్లు జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పని సరిగా రసీదు పొందాలని, కల్తీ విత్తనాల నిల్వలు, విక్రయాల సమాచారముంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు పెంచామన్నారు.
విత్తన దందా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES