సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ – వనపర్తి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలో వామపక్ష పార్టీలైన సీపీఐ(ఎం) సిపిఐ పరస్పర సహకారంతో తమ అభ్యర్థులను పోటీలో నిలిపేందుకు కృషి చేస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యాలయంలో సీపీఐ(ఎం) – సిపిఐ జిల్లా నాయకులతో గ్రామ పంచాయతీ ఎన్నికల అవగాహనపై సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. రాజు అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం పుట్ట ఆంజనేయులు మాట్లాడుతూ ఈ సమావేశంలో ఇరు పార్టీలు చర్చించుకుని సీపీఐ(ఎం) -సిపిఐ ఒకరికి పై ఒకరు పోటీ చేయరాదని, సీపీఐ(ఎం) పోటీ చేసిన దగ్గర సిపిఐ ఓట్లు వేయాలని వేయించాలని, సిపిఐ పోటీ చేసిన దగ్గర సీపీఐ(ఎం) ఓట్లు వేసి వేయించి గెలిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రధానంగా గ్రామాలలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సీపీఐ(ఎం)- సిపిఐ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా,వార్డు సభ్యులుగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో సీపీఐ(ఎం) వామపక్ష ప్రభుత్వం భారతదేశానికి ఆదర్శంగా పరిపాలన అందిస్తున్నదన్నారు. ఈ జిల్లాలో ఆదర్శవంతమైన పరిపాలన గ్రామాల్లో జరగాలంటే సీపీఐ(ఎం) -సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని, బూర్జువా పార్టీలు ఎన్నికలను ఒక వ్యాపారంగా చేసుకున్నాయన్నారు.
ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ప్రజలకు పంచడం, మద్యం పంపిణీ చేయడం ఓట్లు కొనడం జరుగుతుందని సీపీఐ(ఎం)- సిపిఐ లో నిజాయితీగా ప్రజల కోసం పనిచేయడం జరుగుతుందని బూర్జువా పార్టీలు ఎన్నికల్లో ఖర్చుపెట్టి ఎన్నికల తర్వాత విపరీతంగా సంపాదించుకోవడం ప్రజలకు అర్థమవుతుందని దాన్ని చూసి ఇప్పటికైనా ప్రజలు కమ్యూనిస్టులను గెలిపించుకోవడం గ్రామ అభివృద్ధికి అవసరమని అన్నారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో బిజెపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిడమే సీపీఐ(ఎం)- సిపిఐ లక్ష్యమని ప్రజలు అప్రమత్తంగా ఉండి బిజెపిని ఓడించాలని సీపీఐ(ఎం)- సిపిఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. డి. జబ్బార్, సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



