– సోనియా, రాహుల్‌కు అండగా నిలుద్దాం
– కేసులకు అదిరేది లేదు
– మోడీ, షాలకు బెదిరేది లేదు
– రాజకీయాల్లో చేసింది చెప్పుకోవాలి
– సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
– బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు : నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులతో సీఎం రేవంత్ రెడ్డి
– టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఓట్ చోరీ అంశం నుంచి దేశ ప్రజల దృష్టి మరల్చేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌పై మళ్లీ మళ్లీ అక్రమ కేసులు బనాయిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ నేపధ్యంలో వారిరువురికి అండగా నిలుద్దామంటూ ఆయన పిలుపునిచ్చారు. కేసులకు అదిరేది లేదు.. మోడీ, అమిత్ షాలకు బెదిరేది లేదని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకాటి శ్రీహరి, అజహరుద్దీన్, నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం… డీసీసీ అధ్యక్షులకు, ఇతర నాయకులకు పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. మోడీ సర్కార్ తమ పార్టీ పట్ల అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని ఆయన ఎండగట్టారు. పంచాయతీ ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలు, గ్లోబల్ సమ్మిట్, ఇందిరమ్మ చీరెల పంపిణీ, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంపై ఆయన వారికి మార్గదర్శనం చేశారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని చెప్పారు. సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించిన ఆ కుటుంబం దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఆ పత్రికకు సంబంధించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు, ఆర్థికంగా నిలబెట్టేందుకు సోనియా గాంధీ, రాహుల్ కృషి చేశారని తెలిపారు. తిరిగి ఆ పత్రికను పునరుద్ధరించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అవసరమైనప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను డైరెక్టర్లుగా నియమించటం ద్వారా పత్రికను పునరుద్ధరించారని వివరించారు.
ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క రూపాయీ లేదని స్పష్టం చేశారు. నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పత్రికను నడిపితే..దీనిపై మనీ ల్యాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్‌ను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసుల పేరుతో మళ్లీ ఇప్పుడు హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. సోనియా గాంధీ, రాహుల్‌పై కేంద్రం బనాయించిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే వాటిని ఇంటిటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులు, నాయకులపై ఉందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, కోటి మంది ఆడ బిడ్డలకు కోటి చీరలను సారెగా అందిస్తున్నామని చెప్పారు. ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత పార్టీ జిల్లా అధ్యక్షులదేనని అన్నారు. గ్రామలవారీగా సమన్వయం చేసుకుంటూ వాటి పంపిణీని పూర్తి చేయాలని కోరారు.
డిసెంబర్‌లోగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ పూర్తి కావాలని, మార్చిలో పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలను పంపిణీ చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలపై ప్రతీ గ్రామంలో చర్చ నిర్వహించాలని ఆదేశించారు. రాజకీయాల్లో పనులు చేయటమే కాదు.. చేసిన వాటిని చెప్పుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత కార్యకర్తలందరిపైనా ఉఉందని నొక్కి చెప్పారు. జిల్లా అధ్యక్ష బాధ్యతనేది చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. అయితే బాధ్యతలు, విధులు నిర్వర్తించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొందరు ముందుకు పోకుండా కాళ్లలో కట్టెలు పెడతారని, వాటిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుక పోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
పెండింగ్ పదవులను భర్తీ చేస్తాం : మహేశ్ కుమార్ గౌడ్
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… వారం పది రోజుల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవులతోపాటు పెండింగ్‌లో ఉన్న ఇతర పదవులనూ భర్తీ చేస్తామని వెల్లడించారు. జిల్లాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు. తాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కాకపోయినా పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు. అదే మాదిరిగా ఏళ్ల తరబడి కష్టపడితేనే పదవులు వస్తాయని వివరించారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కులగణన నిర్వహించారని చెప్పారు. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా జనగణన చేయాల్సి వస్తోందని అన్నారు.
నిష్పాక్షికంగా వ్యవహరించాం : మీనాక్షి
డీసీసీ అధ్యక్షుల ఎంపికలో నిష్పాక్షికంగా వ్యవహరించామని మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఏఐసీసీ పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అందరి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు. సీఎం, పీసీసీ చీఫ్ తమ సొంత జిల్లాలకు కూడా ఎలాంటి పేర్లనూ ప్రతిపాదించలేదని స్పష్టం చేశారు. అందరి సహకారం, సమన్వయం వల్లే సమర్థులైన వారికి డీసీసీ అధ్యక్ష పదవులను ఇవ్వగలిగామని తెలిపారు.వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అనుయాయులను గెలపించాలని, ఓట్ చోరీపై విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. నూతన జిల్లా అధ్యక్షులకు జనవరిలో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు.
‘ఓట్ చోరీ’ నుంచి దృష్టి మరల్చేందుకే కేసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



