త్వరలో యూడీఐడీ కేంద్రం సేవలు అందుబాటులోకి: ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
బ్యాంక్ లింకేజ్ రుణాల అందజేత
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
దివ్యాంగులు ఆత్మస్థైర్యం తో ముందుకు వెళ్లాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఆటల పోటీల కార్యక్రమం బుధవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని, ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. దివ్యాంగులు అందరితో పాటు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో సెర్ప్ ఆధ్వర్యంలో త్వరలో యూడీఐడీ కేంద్రం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. దానిలో పూర్తిస్థాయిలో సేవలు అందుతాయని పేర్కొన్నారు.
డే కేర్ సెంటర్ సేవలు సైతం త్వరగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. రెగ్యులర్ గా శిబిరాలు నిర్వహిస్తూ అలింకో ద్వారా సహాయ ఉపకరణాలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ వికలాంగుల సంఘానికి ఎస్ బీ ఐ ఆధ్వర్యంలో రూ. 8 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణం పత్రాన్ని ఆ సంఘం బాధ్యులకు ఇంచార్జి కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు



