Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవీపేట్ లో సర్పంచ్ ఎన్నికలను రద్దు చేయాలి: సర్పంచ్ అభ్యర్థి మంద స్వరూప 

నవీపేట్ లో సర్పంచ్ ఎన్నికలను రద్దు చేయాలి: సర్పంచ్ అభ్యర్థి మంద స్వరూప 

- Advertisement -

– నామినేషన్ లో ఒరిజినల్ కుల దృవీకరణ లేదని రిజెక్ట్..
– కోర్టుకు వెళ్ళేందుకు సిద్ధం 
– న్యాయ పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు 
– సీపీఐ(ఎం) అభ్యర్థికి మద్దతు ప్రకటించిన స్వరూప
నవతెలంగాణ – నవీపేట్
నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీకి సిపిఐ అభ్యర్థిగా మంద స్వరూప శనివారం నామినేషన్ వేశారు. అయితే ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రం లేదనే సాకుతో ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేశారు. దీంతో నవీపేట్ సర్పంచ్ ఎన్నికను రద్దు లేదా వాయిదా వేయాలని సర్పంచ్ అభ్యర్థి మందస్వరూప డిమాండ్ చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను గత 20 సంవత్సరాలుగా సిపిఐలో జిల్లా నాయకురాలిగా పనిచేస్తున్నానని తెలిపారు. నవీపేట మేజర్ గ్రామపంచాయతీకి బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న కారణంగా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని తెలిపారు. కుల ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్ సమస్యల కారణంగా సర్టిఫికేట్ రాలేదని అన్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి దరఖాస్తును గమనించి పక్కకు పెట్టి రాత్రి 10 గంటలకు గెజిటెడ్ ఆఫీసర్లు అందుబాటులో లేని సమయం చూసి క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలని చెప్పారని అన్నారు.

దీంతో క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం ఎమ్మార్వోను సంప్రదించగా.. ఆదివారం సెలవు కావడంతో సోమవారం కుల దృవీకరణ పత్రం ఇచ్చారని అన్నారు. దీంతో ఆర్డీవోకు అప్పిల్ చేయడంతో ఒరిజినల్ కుల ధ్రువీకరణ పత్రంతో సోమవారం ఆర్డిఓ దగ్గరికి వెళ్లి పత్రాలు సమర్పించగా.. మంగళవారం రావాలని చెప్పారని అన్నారు. మంగళవారం ఎన్నికల అధికారి, ఆర్డీవోలు ఇద్దరు కలిసి నవీపేట్ లో సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం అయిందని నీకు తెలియదా అని ప్రశ్నించారని అన్నారు.

దీంతో నేను ఒక్కసారిగా షాక్ కు గురైయ్యానని అన్నారు. వెంటనే తేరుకుని అలా ఎలా ఏకగ్రీవం అయ్యారని ప్రశ్నిస్తే.. ఆర్డీవో బిగ్గరగా అరుస్తూ బెదిరించారని తెలిపారు. రిజెక్ట్ దరఖాస్తుపై సంతకం చేయాలని ఒత్తిడికి గురి చేశారని అన్నారు. తాను ఏ విధంగా రిజెక్ట్ అవుతానో చెప్పాలని, కలెక్టర్ ను కలిసేందుకు వెళ్లగా.. ఆయన మీటింగ్ లో ఉండడంతో డిఆర్ఓ ను కలిశానని తెలిపారు. ఆయన ఆర్డీవోకు ఫోన్ చేశారు. ఆర్డీవో  ఏదో ఒత్తిడికి లోనైనట్లు ఆమెను కచ్చితంగా రిజెక్ట్ చేయాలని చెప్పారని అన్నారు. తాను ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తానని చెప్పడంతో సాయంత్రం వరకు అక్కడే ఆపి, సమయాన్ని వృధా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానిక సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండి అవినీతికి తావు లేకుండా వామపక్ష సిద్ధాంతాల ప్రకారం పని చేస్తానని భావించే నన్ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు చేపట్టడం దౌర్జన్యం అని అన్నారు. కాబట్టి అధికార యంత్రాంగం స్పందించి వెంటనే న్యాయం చేయాలని అన్నారు. లేనియెడల న్యాయస్థానాలను ఆశ్రయించి నవీపేట్ సర్పంచ్ ఎన్నికను వాయిదా లేదా రద్దు చేసేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.

ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే సీపీఐ(ఎం) బలపరిచిన నాయక్ వాడి రమాదేవికి మద్దతు ఇచ్చి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. మద్దతుగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు పెద్ది వెంకట రాములు హాజరై మాట్లాడుతూ.. బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మహిళ అభ్యర్థిగా నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీకి ప్రధాన పోటీదారులుగా మారే అవకాశం ఉండడంతో ఆమెను అడ్డుకునేందుకు బూర్జువా పార్టీ నాయకులు అధికారులతో చేతులు కలిపి అడుగడుగునా అడ్డంకులు కలగజేశారని అన్నారు. దీనికి కారణమైన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలను రద్దు చేయాలని దీని కోసం న్యాయ పోరాటానికి సహకరిస్తామని అన్నారు. వామపక్షాల ఐక్యతలో భాగంగా సిపిఐ, సీపీఐ(ఎం)లు కలిసి సీపీఐ(ఎం) బలపరిచిన నాయక్ వాడి రమాదేవి గెలుపుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు సుజాత, దేవేందర్ సింగ్, షేక్ మహబూబ్, వసంత్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -