జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్
నవతెలంగాణ-పాలకుర్తి
సమన్వయంతో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ తెలిపారు. రెండో విడత గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా బుధవారం పాలకుర్తిలో గల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని వర్ధన్నపేట ఏసీపి అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్ రెడ్డి తో కలిసి సందర్శించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ఎన్నికలు జరిగే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాలని సూచించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థుల వెంట అయిదుగురు మాత్రమే నామినేషన్ కేంద్రాలకు రావాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను పాటించి ఎన్నికల అధికారులకు సహకరించాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి గొడవలకు పాల్పడిన సహించేది లేదని హెచ్చరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు గుంపులు, గుంపులుగా కాకుండా క్రమశిక్షణతో గ్రామాల వారీగా నామినేషన్లను దాఖలు చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందితోపాటు పోలీస్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు దూలం పవన్ కుమార్, మేకల లింగారెడ్డి లతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



