సోషల్ మీడియా మాధ్యమాలపై ఆంక్షలు
నవతెలంగాణ – కడ్తాల్
కడ్తాల్ మండలం కర్కల్ పహాడ్ శ్రీశైలం ప్రధాన రహదారి పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యలను కఠినతరం చేస్తున్నట్టు సీఐ సిహెచ్ గంగాధర్ తెలిపారు. ఎన్నికలు సమరస్యతతో, శాంతియుత వాతావరణంలో జరగాలని ప్రతి ఒక్కరూ కర్తవ్యబద్ధంగా వ్యవహరించాలని ఆయన ప్రజలకు సూచించారు.
సీఐ గంగాధర్ బృందంతో కలిసి కిరాణా షాపులు, హోటళ్లు, రోడ్డు పక్కనున్న అన్ని జన సమూహాలను ప్రత్యక్షంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యల భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా ఇతరులను కించపరిచేలా, వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరిస్తూ, అలాంటి వారి మీద కేసులు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని, శాంతి భద్రతలు భంగం కలిగించే ప్రయత్నాలు ఎవరిచేత జరిగినా సహించబోమని సిఐ గంగాధర్ తెలిపారు. ప్రజలు, వ్యాపార వర్గాలు, యువత అందరూ సహకరించి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్ పోలీస్ వారి బృందం స్థానికులు పాల్గొన్నారు.



