ప్రభుత్వంలో కానరాని చిత్తశుద్ధి
బడ్జెట్ కేటాయింపులూ ఖర్చు చేయని వైనం
ఫలితంగా మురిగిపోతున్న నిధులు
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం బుధవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకుంది. వారి కోసం ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంది. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నదని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. వికలాంగుల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. అయితే ఈ వికలాంగుల చట్టం (సిప్డా) కింద కేటాయించిన నిధులను ఖర్చు చేయకపోవడంతో అవి మురిగి పోతున్నాయి. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో భారత్ యొక్క మొత్తం వ్యయం మూడింట రెండు వంతులు పెరిగింది. కానీ అదే సమయంలో వికలాంగుల బడ్జెట్ కుంచించుకుపోయింది. నాలుగు వరుస సంవత్సరాలలో కేంద్రం తన వికలాంగుల వార్షిక బడ్జెట్ రూ.851.66 కోట్లలో విడుదల చేసింది కేవలం రూ.354.21 కోట్లు మాత్రమే. అందులోనూ ఖర్చు చేసింది చాలా తక్కువ మొత్తమే. 2022-23లో సిప్డా నిధులలో 72 శాతం మురిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి వికలాంగుల బడ్జెట్‌లో ఖర్చు చేసింది పాతిక శాతమే. ఎనభై సంవత్సరాల లోపు వయసున్న వికలాంగులకు అందజేస్తున్న నెలవారీ పెన్షన్ రూ.300 వద్ద అలాగే ఉండిపోయింది.
ఆదరణ కరువైన ‘నిరామయ’
వికలాంగులకు మౌలిక సదుపాయాలు కల్పించడం మాట అటుంచితే ప్రభుత్వ వైఖరిలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని యాక్షన్ ఫర్ ఆటిజం సంస్థలో పరిశోధన, శిక్షణ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న నిధి సింఘాల్ విమర్శించారు. ప్రభుత్వ ఉదాశీన వైఖరిని ఆమె ఎత్తిచూపుతూ ‘కేవలం లక్ష నుంచి రెండు లక్షల రూపాయల కవరేజీ కలిగిన ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘నిరామయ’ను వికలాంగులకు వర్తింపజేసేందుకు ప్రయివేటు బీమా సంస్థలు కుంటిసాకులు వెతుకుతున్నాయి. మానసిక ఆరోగ్య పరిస్థితులు, శారీరక బలహీనతలను కారణాలుగా చూపుతూ బీమా సౌకర్యాన్ని నిరాకరిస్తున్నాయి. ఒకవేళ ఆ సౌకర్యాన్ని కల్పించినప్పటికీ చెల్లింపుల సమయంలో పత్తా లేకుండా పోతున్నాయి’ అని తెలిపారు. వికలాంగుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న అనేక సంస్థలు వారి పట్ల అమానుషంగా, క్రూరంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు, పేదలు వికలాంగులైన తమ పిల్లలను పెంచలేక వారిని ఇలాంటి సంస్థల్లో చేర్చి చేతులు దులుపు కుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ రిజిస్ట్రీ లేని సీఎంటీ
1995వ సంవత్సరపు వికలాంగుల హక్కుల చట్టం స్థానంలో 2016లో కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. వైకల్య కేటగిరీలను ఏడు నుంచి ఇరవై ఒకటికి పెంచింది. ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, కండరాల బలహీనత వంటి వ్యాధులతో పాటు బహుళ వైకల్యాలను అందులో చేర్చింది. అయితే సీఎంటీ కోసం జాతీయ రిజిస్ట్రీ లేదని డాక్టర్ ప్రియాన్షు చెప్పారు. అంటే ఎంతమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారో తెలియదు. క్లినికల్ పరీక్షలు ఉండవు. మ్యాపింగ్, జన్యుపరమైన రికార్డులు లేవు. సీఎంటీతో బాధపడుతున్న వారికి ప్రత్యేక ఔషధాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర వ్యాధులకు వాడే మందులు వీరికి హాని కలిగిస్తాయి. ఎందుకంటే వారి నరాలు పెలుసుగా ఉంటాయి. సాధారణ యాంటీబయాటిక్ మందును వీరికిస్తే కండరాల బలహీనత మరింత తీవ్రమవుతుంది. మత్తును కలిగించే కొన్ని మందులు తీవ్ర సమస్యలకు కారణమవుతాయి. కొన్ని రకాల స్టెరాయిడ్లు వ్యాధిని తీవ్రతరం చేస్తాయి.
కేటాయించిన నిధులూ ఖర్చు చేయడం లేదు
2020-21 నుంచి 2023-24 వరకూ కేంద్ర బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే సిప్డా వార్షిక బడ్జెట్ కంటే ఖర్చు చేసిన మొత్తం చాలా తక్కువగా ఉన్నదని అర్థమవుతుంది. 2022-23లో బడ్జెట్‌లో గరిష్టంగా 72.7 శాతం నిధులను ఖర్చు చేయలేదు. 2020-21లో సవరించిన అంచనా రూ.148.07 కోట్లు తగ్గింది. ఇది బడ్జెటరీ అంచనాలో 58.9 శాతం. 2021-22లో సవరించిన అంచనా రూ.101.33 కోట్లు (బడ్జెటరీ అంచనాలో 48.3 శాతం), 2022-23లో 174.8 కోట్లు (బడ్జెటరీ అంచనాలో 72.7 శాతం), 2023-24లో 73.21 కోట్లు (బడ్జెటరీ అంచనాలో 48.8 శాతం) తగ్గిపోయింది. అంటే వార్షిక బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులతో పోలిస్తే ఖర్చు బాగా తగ్గిందని అర్థం. 2024-25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో డిసెంబర్ నాటికి ఖర్చు చేసింది పాతిక శాతం మాత్రమే. కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారత శాఖ వార్షిక నివేదిక నుంచి తీసుకున్న డేటా ప్రకారం నాలుగు సంవత్సరాల కాలంలో మొత్తం బడ్జెట్‌లో విడుదల చేసింది 41.6 శాతం మాత్రమే. అందులో కూడా క్షేత్ర స్థాయిలో ఖర్చు చేసింది చాలా తక్కువ.
ఉద్యోగాలలో దక్కని ప్రాతినిధ్యం
వికలాంగుల కోసం ప్రభుత్వానికి అనేక సంవత్సరాలుగా ఓ విధానం అంటూ ఉంది. అయినప్పటికీ దాని అమలులో చిత్తశుద్ధి కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వ వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ పీఎం-దక్ష్ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. వికలాంగులను వారికి కాబోయే యజమానులతో అనుసంధానించడానికి దీనిని ఏర్పాటు చేశారు. అయితే మార్చింగ్ షీప్ అనే సంస్థ బుధవారం బయటపెట్టిన వివరాల ప్రకారం…59 రంగాలకు చెందిన 876 సంస్థలను ఈ పోర్టల్‌లో చేర్చారు. అయితే భారతీయ లిస్టెడ్ కంపెనీలలో వికలాంగుల ప్రాతినిధ్యం ఒక శాతం కంటే తక్కువగానే ఉంది. 37.9 శాతం సంస్థల్లో ఒక్క శాశ్వత వికలాంగ ఉద్యోగి కూడా లేడు. వికలాంగుల కోసం ఇన్‌క్లూజివ్ ఇండియాను నిర్మించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ప్రధాని మోడీ గత సంవత్సరం చెప్పారు. అయితే మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయని పక్షంలో వికలాంగ పౌరుల ఇబ్బందులు, సమస్యలు అలాగే ఉండిపోతాయి.
పరికరాలకూ కొరతే
రిజిస్ట్రీ అనేదే లేనప్పుడు సీఎంటీ వ్యాధిగ్రస్తులకు ఏ మందులు ఇవ్వాలో వైద్యులకు ఎలా తెలుస్తుంది? మందుల సంగతి అలా ఉంచితే వారికి అవసరమైన పరికరాల కొరత కూడా ఎక్కువగానే ఉంది. సీఎంటీ రోగులకు తరచుగా కార్బన్-ఫైబర్ యాంకిల్-ఫుట్ ఆర్థోసిస్ పరికరం అవసర మవుతుంది. ఇది తేలికగా ఉంటుంది. బ్యాలెన్స్‌ని నిలుపుతుంది. సంపన్న దేశాలలో వీటిని ప్రామాణికమైనవిగా పరిగణిస్తారు. మన దేశంలో మాత్రం ఇప్పటికీ పోలియో కాలంలో తయారు చేసిన కాలిపర్లనే వాడుతున్నారు. ప్రపంచ జనాభాలో పదిహేను శాతం మంది ఏదో ఒక వైకల్యంతో జీవిస్తున్నారని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.



