స్టార్ హెల్త్‌కు వినియోగదారుల కమిషన్ షాక్
బాధితులకు రూ.50వేలు చెల్లించాలని ఆదేశం
నవతెలంగాణ – బిజినెస్ డెస్క్
వైద్య బీమా రంగంలో కీలక సంస్థగా ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు వినియోగదారుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. బీమా సంస్థలు వైద్య చికిత్స పద్ధతులను నిర్దేశించలేవని సంచలన తీర్పునిచ్చింది. కోవిడ్‌కు సంబంధించిన క్లెయిమ్‌ను తిరస్కరించినందుకు స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌కు వడ్డీతో పాటు దాదాపు రూ. 50,000, వ్యాజ్య ఖర్చులను చెల్లించాలని ఘజియాబాద్ జిల్లా కన్సూమర్ ఫోరం ఆదేశించింది. బాధితురాలు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని బీమా సంస్థ క్లెయిమ్‌ను తిరస్కరించింది. దీనిపై వినియోగదారుల ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సేవలో లోపమని కమిషన్ స్పష్టం చేసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనాన్ని వెల్లడించింది.
వైద్య చికిత్స విధానాన్ని లేదా పద్ధతిని నిర్ణయించే అధికారం బీమా సంస్థకు లేదని తేల్చి చెప్పింది. కోవిడ్ సంబంధిత క్లెయిమ్‌ను తిరస్కరించిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. బీమా సంస్థ ఇప్పుడు దాదాపు రూ.50,000 మొత్తాన్ని సహా 6 శాతం వార్షిక వడ్డీతో పాటు రూ.2,000 వ్యాజ్యం ఖర్చులను చెల్లించాలని స్టార్ హెల్త్‌ను కమిషన్ ఆదేశించింది. ఈ మొత్తాన్ని 30 రోజులలోపు చెల్లించాలని స్పష్టం చేసింది. రోగికి కరోనా లక్షణాలు లేని కారణంగా రోగికి ఇంట్లోనే చికిత్స అందించాల్సిందని.. కాబట్టి ఆస్పత్రిలో చేరడం అవసరం లేదని స్టార్ హెల్త్ క్లెయిమ్ తిరస్కరించింది. దాద్రీ నివాసి అయిన నీతూ నగర్ 2022 సెప్టెంబర్ 1న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (డీసీడీఆర్)కి ఫిర్యాదు చేశారు. నీతూనగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె భర్త అజరు నగర్ 2018 నుంచి స్టార్ హెల్త్ ‘ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ పాలసీ’ కింద కవరేజ్ కలిగి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎటువంటి అంతరాయం లేకుండా చెల్లింపులు చేశారు.
2022 జనవరిలో పాలసీ నాలుగో సంవత్సరం నడుస్తున్నప్పుడు నీతూ నగర్‌కు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు హాస్పిటల్‌ల్లోనే సేవలు అవసరమని కుటుంబ సభ్యులు భావించారు. పాలసీ నిబంధనల ప్రకారం.. ఆసుపత్రిలో చేరడానికి ముందే బీమా సంస్థకు సమాచారం ఇచ్చారు. కొన్ని రోజుల్లో క్యాష్‌లెస్ క్లెయిమ్ ఆమోదించబడుతుందని కుటుంబానికి చెప్పారు. ఆస్పత్రి డిశ్చార్జ్ తర్వాత బిల్లులను చెల్లించడానికి స్టార్ హెల్త్ నిరాకరించింది. మొత్తం ఖర్చు రూ.49,423 కావడంతో కుటుంబం ఆ మొత్తాన్ని తమ సొంత డబ్బుతో చెల్లించి, రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసింది. దీంతో వారు కమిషన్‌ను ఆశ్రయించగా బీమా సంస్థ వాదనను కమిషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ పుండిర్, సభ్యురాలు అంజు శర్మ తిరస్కరించారు. వైద్యుల నిర్ణయాన్ని బీమా సంస్థ ఎలా కొట్టిపారేస్తుందని స్పష్టం చేశారు. ”వైద్య నిపుణులు ఆస్పత్రిలో చేరడం అవసరమని సూచించినప్పుడు.. చికిత్సను ఇంట్లోనే చేయాలని బీమా సంస్థ పట్టుబట్టకూడదు. రోగి ఇంట్లో ఐసోలేషన్‌లో చికిత్స పొందాల్సిందనే కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించడం సేవల్లో లోపమే.” అని తేల్చారు. ఆస్పత్రి ఖర్చులతో పాటు వడ్డీ, కేసు ఖర్చులను రీయింబర్స్ చేయాలని స్టార్ హెల్త్‌ను ఆదేశించారు.
చికిత్స నిర్ణయంపై బీమా సంస్థలకు అధికారం లేదు..!
- Advertisement -
- Advertisement -



