డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశమే కాదు, ప్రపంచం గర్వించే మేధావి. ఏప్రిల్ 14, డిసెంబర్ 06 ఆయన జయంతి, వర్థంతిల సందర్భంగా విగ్రహాలకు దండలు వేయడం, దండాలు పెట్టడం సాధారణంగా ప్రతీయేటా జరుగుతున్న ఒక తంతు. అసలు అంబేద్కర్ ఏం చెప్పాడు? ఆయన దేశానికి ఏం చేశాడు? నేటి పాలకులు ఏం చేస్తున్నారు? నీటితరం ఏం చేయాలనేది చర్చించు కోవాల్సిన సందర్భం. అంబేద్కర్ అనగానే రాజ్యాం గం రాశాడు, రిజర్వేషన్లు ఇచ్చాడనే ఒక పరిమిత అర్థంలో చూస్తున్నారు. కానీ, ఆ రెండు తన చివరి దశకంలోనివి మాత్రమే.ఆయన జీవితాంతం పోరాడింది అణగారిన వర్గాల సమానత్వం కోసం. రాష్ట్రాలు- మైనార్టీలు అనే పుస్తకంలో అంబేద్కర్ భారతదేశంలో భూమి జాతీయీకరణ జరగాలని, పరిశ్రమల్లో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని స్పష్టంగా పేర్కొన్నాడు. మహిళా సమానత్వం కోసం హిందూ కోడ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు నాటి కాంగ్రెస్ దాన్ని అంగీకరించకపోవడంతో కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. కార్మికులకు కనీస వేతనం చట్టాన్ని 1948 సంవత్సరంలోనే ఆయన రూపొందించాడు. అంబేద్కర్ మనుస్మృతి దుర్మార్గాలను తీవ్రంగా ఖండించాడు. 1927 డిసెం బర్ 25న మనుస్మృతిని దహనం చేశాడు. మనువాదం పెట్టుబడ ిదారీ విధానం అంతం చేయటమే దేశ ప్రజల కర్తవ్యమని భావించాడు. అందుకే బ్రాహ్మణిజం, క్యాపిటలిజం రెండూ తన శత్రువులని బాహటంగా ప్రకటించాడు.
స్వాతంత్య్ర ఉద్యమకాలంలో 1925 సంవత్సరంలో ఏర్పడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు (ఆరెస్సెస్) అంబేద్కర్ పట్ల విరోధ వైఖరి కలిగి ఉంది. ప్రత్యేకించి అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఇది అతుకుల బొంత రాజ్యాంగమని, అమెరికా, బ్రిటన్, ఇంగ్లాండ్ దేశాల నుంచి అరువు తెచ్చుకున్న రాజ్యాంగమని, ఇది ఈ దేశానికి పనికి రాదని, మనుస్మృతియే మన ప్రాచీన భారత రాజ్యాంగమనీ ప్రకటించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెప్పింది. దీన్ని బట్టి అంబేద్కర్ ఆశయం పట్ల ఎంత విరోధి పాత్ర నిర్వహించిందో విధితమవుతుంది. నేడు ఆరెస్సెస్ కన్నుసన్నల్లో నడిచే బీజేపీనే కేంద్రంలో అధికారంలో ఉంది. క్యాపిటలిజానికి, కమ్యూనలిజానికి అసలు సిసలైన ప్రతినిధిగా శిఖండి పాత్ర పోషిస్తున్నది. ఆరెస్సెస్-బీజేపీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతి తమ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని ఆశిస్తున్నది. అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛగా తలెత్తుకుని బతకటానికి కావలసిన ఆర్టికల్ 21, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఆర్టికల్ 19కి తెస్తే వాటికి విరుద్ధంగా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్నది. ఆరెస్సెస్, బీజేపీని ప్రశ్నించిన దబో ల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గీ, గౌరీ లంకేష్ వంటి మేధావులను పొట్టన పెట్టుకుంది. ఈ దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి ఉన్న ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దాన్ని తలలేని మొం డెంలా మార్చింది. కులోన్మాదం చివరికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారుపై కూడా విద్వేషపు విషపు బూటు విసిరింది. చివరకు పోలీసు శాఖలో కూడా చొచ్చుకుపోయి హర్యానాలో పూరణ్‌కుమార్ అనే ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు దారితీసింది.
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రనంతరం కూడా కూడా కుల వివక్ష ,అంటరానితనం కొనసాగడం దేశం మూఢత్వ చాందసాల పుణ్యమే. నేడు కేంద్ర సర్కార్ రాజ్యాంగ మౌలిక పునాదులపైన నేడు పెద్దఎత్తున దాడి చేస్తున్నది. రాజ్యాంగం నిర్మితమైన స్వతంత్ర సంస్థలను తమ జేబుసంస్థలుగా మార్చుకుంటున్నది. దేశభక్తి ముసుగులో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు, కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నది. అడవులన్నింటినీ అదానీకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నది. యూని వర్సిటీలలో ప్రజాతంత్ర భావా లను నిరాకరిస్తున్నది. అంబే డ్కర్ కార్మికులకు కనీస వేతన చట్టం కార్మికుల హక్కులకోసం కృషి చేస్తే, బీజేపీ సర్కార్ ఇటీవల కోట్లాది మంది కార్మికులు వందల ఏండ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడులు తీసు కొచ్చింది. కార్మికుల పొట్టలు కొట్టి కార్పొరేట్ల బొజ్జలు నింపే కుట్రలకు తెరదీసింది. బీహార్ ఎన్నికల తర్వాత నిసిగ్గుగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేస్తామని ప్రకటించింది. చేస్తున్నది కూడా. మూడు నల్లచట్టాలు తెచ్చి రైతు మెడలో ఉరితాడు వేయ టానికి ప్రయత్నించింది. దానికి వ్యతిరేకంగా ఏడాదికాలం పాటు రైతాంగం పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసింది. ఆ పోరాటంలో 750 మంది రైతులు చని పోయారు. ఈ పాపం కేంద్రసర్కార్‌దే. అనంతరం పార్ల మెంటు సాక్షిగా చట్టాలను వెనక్కి తీసుకుంటున్నన్నాని మోడీ క్షమాపణలు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికారు. ఏమైంది? ఇప్పటివరకు అతీగతి లేదు.మరి ఈ ప్రభుత్వం ప్రజలు, కార్మికులు, రైతుల పక్షాన కాకుండా ఎవరి కోసం పనిచేస్తున్నదో అర్థం చేసుకోవాలి.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ‘రాజ్యాంగమే మా ఎజెండా’ అని రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రచారంలో చేశాడు. ప్రధాని మోడీ ఎన్నికల మాత్రం రాజ్యాంగం గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. బీజేపీ పన్నెం డేండ్ల పాలనలో దేశవ్యాప్తంగా కులపరమైనటువంటి హింస మరింతగా రెట్టింపు స్థాయిలో పెరిగితే ప్రధాని ఏం చేస్తున్నాడు? ఉత్తర భారతదేశంలో కాపు పంచాయితీల పేరిట హింస జరుగుతుంటే, దక్షిణ భారతదేశంలో కుల దురహంకార హత్యల రూపంలో హింస చెలరేగుతుంది. అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కుల నిర్మూలన జరగాలని కోరు కున్నట్టా? లేదంటే దాన్ని ప్రోత్సహిస్తున్నట్టా? మోడీ పరివారమే సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ దశాబ్దకాలంగా 142 కుల దురహంకార హత్యలు జరిగాయి. బీజేపీ ఎందుకు మాట్లాడం లేదు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసి మహిళ నిండు గర్భిణిని కుల దురహంకారంతో హత్య చేస్తే బీజేపీ ఎంపీ బాధిత కుటుంబాన్ని పరమర్శించలేదు. షాద్‌నగర్‌లో దళిత యువ కుడిని కిడ్నాప్, హత్య, సజీవ దహనం చేస్తే ఆ నేతలెవరూ ఖండించలేదు. దీన్ని బట్టి వారు ఈ హత్యలను సమర్థిస్తున్నట్టు అనుకోవాలా,వద్దా?
దేశంలోని ప్రజల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. సామాజిక న్యాయం దక్కడం లేదు. రిజర్వేషన్లకు కూడా ఎత్తేసే కుట్ర జరగుతున్నది. బీజేపీ అనుసరిస్తున్న తీరుతో రాజ్యాంగమే ప్రమాదంలో పడుతున్నది. అంబేద్కర్ ఆశయాన్ని కూడా తుంగలో తొక్కే ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. దీన్ని ఎదుర్కో వాల్సిన బాధ్యత ఈ దేశ యువతరం పైన ఉంది. అంబేద్కర్ ఆశయాలను సాధించాలనుకునే అభ్యు దయ ప్రగతిశీల శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. భారత రాజ్యాంగాన్ని, ప్రభు త్వరంగ సంస్థలను, రిజర్వేషన్లను, కార్మిక చట్టాలను ఐక్యంగా రక్షించుకోవాలి. కమ్యూనిస్టులు నేడు సరళీకరణ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం సమైక్యంగా పోరాడుతు న్నారు, మతోన్మాదంపైనా ఐక్యంగా ఉద్యమిస్తున్నారు.అంబేద్కర్ ఆశించిన కులరహిత సమాజాన్ని నిర్మించడానికి నేటితరం సమరం చేయాలి.అదే అంబేద్కర్ మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి)
టి.స్కైలాబ్ బాబు
9177549646



