కేసీఆర్ దత్తత గ్రామాలు ఏకగ్రీవం
కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ఫాంహౌస్‌లో కేసీఆర్ భేటీ
నవతెలంగాణ-మర్కుక్
మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని.. నాడు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకుందామని దత్తత గ్రామాల సర్పంచ్‌లకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామపంచాయతీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులను సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించి అభినందనలు తెలిపారు. వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధియే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని తెలిపారు. ప్రతి వార్డు మెంబర్ గ్రామ ప్రజలతో మమేకమై కలిసి గ్రామ అభివృద్ధి దిశలో ముందుండాలని సూచించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో.. ఎర్రవల్లి, నర్సన్నపేట ఏకగ్రీవమైన సర్పంచులు కవిత రాంమోహన్ రెడ్డి, గిల్క బాలనర్సయ్య, మాజీ సర్పంచ్ కమ్మరి బాలరాజు, బీఆర్‌ఎస్ నాయకులు కిష్టారెడ్డి, బీంరెడ్డి బాల్‌రెడ్డి, కనకరాజు యాదవ్, రాంరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, గీసు మల్లేశం, పరాశురాం తదితరులున్నారు.



