ఇందిరా సౌర గిరి జల వికాసంతో గిరిజనుల అభివృద్ధి
ఎక్సైజ్, పర్యాటక సంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు
నవతెలంగాణ – అచ్చంపేట: ఏళ్ల తరబడి అడవులను నమ్ముకొని జీవిస్తున్న గిరిజనుల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందిరా సౌర గిరి జల వికాసంతో గిరిజన కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి చెందుతారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సోమవారం ఇందిర సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. పర్యాటక ఏర్పాట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ లతో కలిసి ఆదివారం ఏర్పాట్లు పరిశీలించారు. సభ, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లు, ఇందిర సౌరగిరి జల వికాస పథకం లబ్ధిదారులైన రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాల ఏర్పాట్లను, హెలిపాడు నిర్మాణ పనులను, మీడియా పాయింట్ ఏర్పాట్లు, బారీ కెడింగ్, బందోబస్తు వంటి అంశాలను ముఖ్యమంత్రి భద్రత సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలి ఇచ్చి, బోర్లు వేయించి, సౌర విద్యుత్ ద్వారా సాగునీటి వసతులు కల్పించి పండ్ల తోటలను పెంచుకునే విధంగా పండ్ల మొక్కలు నాటి లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక ఎకరానికి ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులనుండే ఖర్చు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా ఆలోచన చేసి వారి ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెద్ద రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఎత్తున ఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అడవి బిడ్డల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుండి రూ .12600 కోట్ల రూపాయల ఖర్చుతో 6 లక్షల ఎకరాల ఎకరాలకు 2 లక్షల రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు మంత్రి వివరించారు. ఎన్నో ఏళ్ల నుండి ప్రభుత్వ నిరాదరణకు గురైన గిరిజనులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గిరిజనుల ఆదాయాన్ని పెంచే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టనుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి లాంచనంగా ప్రారంభించనున్న ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి గిరిజన సోదరులందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని మంత్రి సూచించారు. ఈ పథకాన్ని పాలమూరు జిల్లాలో ప్రారంభిస్తున్నందున మహబూబ్ నగర్ జిల్లా గిరిజన సోదరుల తరపున గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంతో గొప్ప ఆశయంతో ప్రారంభించనున్న ఈ పథకాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా గిరిజన సోదరులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని నమ్ముకుని బ్రతికే గిరిజన సోదరులు సోమవారం జరిగే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దాదాపు 40 వేల మంది గిరిజనుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పథకాన్ని లాంచనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు.
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, మాట్లాడుతూ..ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, గిరిజనుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్ల రూపాయలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదులుగా ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభం కానున్నదని తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం అని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల పొడు భూముల్లో అధునాతనమైన యాంత్రిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా గిరిజనులను సమగ్ర అభివృద్ధి వైపు పయనించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ప్రవేశపెట్టనుందని, తెలిపారు. అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ… నల్లమల్ల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం మా నియోజకవర్గ ప్రజల మధ్యలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గ గిరిజనులందరూ ఆనందోత్సవాలను వ్యక్తం చేశారని తెలిపారు. నల్లమల్ల గిరిజన ప్రజల చిరకాల స్వప్నం ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడడం చాలా ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు.