షణ్ముఖ సుందరం ఉదయాన్నే లేచి గడ్డం గీసుకున్నారు. స్నానం చేసి ఉతికిన పంచె కట్టుకుని, గోడమీద ఉన్న సుబ్రమణ్యస్వామి ఫోటో ముందు నిలబడి ప్రార్ధన చేసుకున్నారు. ఆయనగారి కొత్త నాటకం ఎనిమిదవ సారిగా చెన్నైలో జరగబోతోంది. ఏడుసార్లు విజయవంతంగా ప్రదర్శించబడినట్లుగానే ఈసారి కూడా జరగాలని దేవుడి దగ్గర మొక్కుకున్నారు. తలలో ఒక్కడో ఒక మూలలో చురుక్కుమని నొప్పిగా అనిపించి మాయమయ్యింది.
”అన్నయోవ్! ఆ పిల్ల మన కొంప ముంచేసేటట్లు ఉందన్నా” అంటూ సింగారం పరిగెత్తుకుంటూ వచ్చి దిగులుగా అన్నాడు. సింగారం ఆ నాటక కంపెనీకి టైలరు.
”ఎవరూ? ఏంటయ్యా నువ్వు చెప్పేదీ?”
”మీరు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నారు కదా, ఆ హీరోయినియే.”
”ఏమయ్యింది?”
”ఆ దారి వెంబట వస్తున్న నన్ను హీరోయిని సావిత్రి అమ్మ పిలిచి ఈ రోజు తన కూతురు నాటకానికి రావడం కుదరదు అని చెప్పమన్నది.”
”ఏమిటీ?”
”అవునన్నా. ఈ రోజు నాటకానికి అది రాదట.”
షణ్ముఖ సుందరానికి ఇంకా విషయం బోధపడలేదు. ఆ నాటకానికి కథానాయిక సావిత్రి. ప్రతి ప్రదర్శనకీ ఆమె బాగానే నటిస్తూ వస్తోంది అని ఊళ్ళో మంచి పేరు. పాత నటీమణులకు నాటకానికి ఇరవై రూపాయలు ఇచ్చినప్పుడు ఈ పిల్లకి మాత్రం ముప్పై రూపాయలు. ఏమయ్యింది?
”ఏమిట్రా? అమ్మవారు గానీ పోసిందటనా?” ఊరంతా అప్పుడు మశూచికం వ్యాపించి ఉంది.
”లేదన్నా మొక్కజొన్న కండెలా నిగనిగలాడుతూనే ఉంది. దాని అమ్మ మాత్రం ఏమీ చెప్పటం లేదు.”
షణ్ముఖ సుందరం ఒక్క క్షణం అలాగే విస్తుపోయి నిలబడి పోయారు. సింగారంతో, ”వెంటనే వేలూను రమ్మని చెప్పు” అన్నారు. వేలు ఆయన కోసం ఎప్పుడూ వచ్చే రిక్షావాడు.
రిక్షా వచ్చేసింది. షణ్ముఖ సుందరం సింగారాన్ని అడిగారు. ”నువ్వూ వస్తావా?”
”వద్దన్నా. మొండిగా రాను అని చెప్పినా చెబుతుంది. మీరు విడిగా వెళ్లి నాలుగు చీవాట్లు పెట్టి రండి.”
నాలుగు సందులు దాటితే సావిత్రి ఇల్లు. నడిచి కూడా వెళ్లి పోవచ్చు. కానీ ఇంటి ముందు రిక్షాలో వెళ్లి దిగితేనే ఆ ఇంటి ఆడవాళ్ళు గౌరవంగా చూస్తారు.
ఇంత త్వరగా ఆయన్ని సావిత్రి తల్లి ఎదురు చూడలేదు. ఆదరాబాదరాగా జుట్టు ముడేసుకుంటూ, ”రండి” అంది.
”పాప రావడం కుదరదని ఏదో కబురు పంపించావట.”
”అవునండీ. ఈ ఒక్క రోజుకు వేరే ఏర్పాటు చేసుకోండి.”
”ఏంటీ వాగుతున్నావు? ఆరు గంటలకి నాటకం. ఇప్పుడు రానని చెబితే ఎలా?”
”ఏం చెయ్యడం? సినిమా ఛాన్సు ఉన్నట్లుండి వచ్చింది.”
షణ్ముఖ సుందరంకు తను అప్పుడే ఓడి పోయినట్లు అనిపించింది.
”నాటక ప్రదర్శన అయిన తరువాత వెళ్ళొచ్చుగా?”
”సేలంకు వెళ్ళాలి. ఈ రోజు మధ్యాహ్నమే బయలు చేరాలి.”
”మధ్యాహ్నమా? సేలంకు మధ్యాహ్నం రైలు ఏదీ లేదుగా?”
”రైలు కాదండీ. కారులో తీసుకు వెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను.”
నాలిక చివరి దాకా వచ్చిన బూతు పదాన్ని బలవంతంగా నొక్కి పెట్టారు.
”సావిత్రి ఎక్కడీ”
”దుకాణానికి వెళ్ళింది. కొత్తగా సబ్బులూ, పవుడర్లూ కొనుక్కోవాలి కదా.”
ఆమెను తిరిగి చూడకుండా షణ్ముఖ సుందరం వేగంగా వీధికి వచ్చారు. ”అయ్యా!” అంటూ వేలు పిలిచిన తరువాతే ఆయనకు తాను రిక్షాలో వచ్చింది గుర్తుకు వచ్చింది. షణ్ముఖ సుందరం రిక్షాలో ఎక్కి కూర్చున్నారు.
”అయ్యా! ఇంటికే కదా?”
”అవును.”
ఆ వీధి దాటక ముందే షణ్ముఖ సుందరం, ”భాగ్యం ఇంటికి వెళ్ళు” అన్నారు.
రిక్షా వేగం కాస్త తగ్గు ముఖం పట్టింది. ”అది ఎక్కడ ఉందయ్యా?”
”నీకు భాగ్యం ఇల్లు తెలియదా?”
”తెలీదయ్యా.”
రెండేళ్ళుగానే వేలు ఆయనకి రిక్షా తొక్కుతున్నాడు. భాగ్యంతో కాంటాక్ట్ లేకుండా పోయి ఐదేళ్ళు అవుతున్నాయి.
”ఈ వీధిలోనే నేరుగా వెళ్లి కుడి వైపు తిరిగితే అక్కడ చిన్న చిన్న ఇళ్ళు కనబడతాయి. అక్కడికి వెళ్ళు.”
ముందొక కాలంలో భాగ్యం ఆయన నాటకాల కంపెనీలో కథానాయికగా ఉండేది. నెలకు రెండు సార్లు, నాలుగు సార్లు ఇరవై ఇరవై రూపాయలు తీసుకుని ఆమె, ఆమె తల్లీ ఎలా కాలం గడపడం? ఆమె నగల దుకాణం యజమాని ఇంట్లో వంటమనిషిగా చేరింది. కుదురైన, గౌరవప్రదమైన వత్తి ఆమెను లావుగా మార్చేసింది. షణ్ముఖ సుందరాన్ని చూడగానే సంతోషం పొంగి రాగా, ” రండి రండి” అంటూ పలకరించింది.
షణ్ముఖ సుందరం ఎలా విషయం చెప్పడం అని ఆలోచించారు. ”భాగ్యం! ఈ రోజు నువ్వు నాటకంలో నటిస్తున్నావు” అన్నారు.
భాగ్యం చిన్నగా నవ్వింది. ”ఈ ఆకారంతోనా? కామెడీకి అయితే సరే.”
”కథానాయిక నువ్వే.”
”హీరోయినిగానా?”
”అవును”. ఆయనకి జీవితంలో నచ్చని పదం ఒకటే, ఇలా హీరోయిని అని అనడం. కానీ నాటక రంగంలో ఉన్నవాళ్ళు చాలామంది అలాగే అంటూ ఉంటారు.
”మీరు చెప్పొచ్చు. కానీ చూసేవాళ్ళు ఒప్పుకోవాలి కదా?”
”భాగ్యం! మొదట ఒక్క నిమిషం మాత్రం ఆకతిని చూస్తారు. దాని తరువాత నటన మాత్రమే మనసులో నిలబడి పోతుంది.”
”దేనికైనా కూడా వయసు అంటూ ఒకటి ఉంది కదా?”
”నాకు యాబై ఏళ్ళు. నేనే కథానాయకుడిని.”
”మగాళ్ళకి సరే. ఆడవాళ్ళను ఒప్పుకోరు.”
షణ్ముఖ సుందరం ధడాల్మని ఆమె కాళ్ళ మీద పడ్డారు. ”నా పరువును కాపాడు భాగ్యం.”
”అయ్యో! ఇదేమిటి! ఏం పాపం చేశాను నేను? ఊరికే నోటి మాటగా చెబితే చాలదా?”
షణ్ముఖ సుందరం నోట మాట రానట్లు అలాగే నిలబడి పోయారు.
”అది సరే. నేను వస్తాను. మీ నాటకాన్ని నేను చూసింది కూడా లేదు.”
”నన్ను క్షమించు భాగ్యం. ఎవడెవడి కాళ్ళ మీదో పడి నాటకానికి రమ్మని పిలిచాను. నిన్ను పిలువలేదు.”
”ఇలా పెద్ద మాటలన్నీ చెప్పకండీ. సరే, స్క్రిప్ట్ ఎక్కడీ”
‘షణ్ముఖ సుందరం నాలుకను కరుచుకున్నారు. వాకిట్లోకి తొంగి చూసి, ”వేలూ!” అని పిలిచారు.
”ఏంటయ్యా?”
”ఇంతకు ముందు మనం వెళ్ళాము చూడూ. ఆ ఇంటికి వెళ్లి స్క్రిప్ట్ తీసుకుని రా.”
”ఏంటయ్యా అది?”
”పేపరు మీద వ్రాసి ఉంటుంది. జాగ్రత్తగా తీసుకుని రా.”
ఐదు నిమిషాలకి ఆ యింట్లో మౌనం రాజ్యం చేసింది. భాగ్యం తల్లి లోపలి నుంచి దగ్గుతోంది. ఇంకా ఎక్కువ రోజులు బ్రతకబోదు అని షణ్ముఖ సుందరం అనుకున్నారు.
వేలు నలిగి పోయిన కాగితపు కట్టను తీసుకు వచ్చాడు. షణ్ముఖ సుందరం కాగితాలను సరి చూసి బొత్తిలాగా పెట్టి భాగ్యం చేతికి అందజేశారు.
”ఈ నాటకం ఎలా ఉంటుందని కూడా నాకు తెలియదు” అని అంది భాగ్యం.
”నువ్వు సరిగ్గానే చేస్తావు భాగ్యం. నీ డైలాగులను అందించడానికి ఇటు వైపు అటు వైపు ఇద్దరు మనుషులను తయారుగా ఉంచుతాను. నీకు ఏ రోజూ కూడా ఎవరూ ప్రాంప్ట్ చేయాల్సిన అవసరం ఉండింది లేదు.”
”అదంతా పది సంవత్సరాలకు ముందు. హాల్ పేరు ఏంటి? నాలుగు గంటలకు వస్తే సరిగ్గా ఉంటుందా?”
”రామరాయల్ హాల్. నాలుగున్నరకి వచ్చినా కూడా చాలు. నీకు తగిన డ్రస్సులు తీసి ఉంచమని చెబుతాను.”
”మీరు బయలు దేరండి. ఎన్నో పనులు ఉంటాయి. నేను అరగంటలో ఆ ఇంట్లో వంటపని ముగించుకుని స్క్రిప్ట్ చదువుకుంటాను.”
ఇంటి దగ్గర రిక్షా దిగుతూ షణ్ముఖ సుందరం ”మూడు గంటలకు ఆ అమ్మగారి ఇంటికి వెళ్లి పిలుచుకుని వచ్చెయ్యి” అని వేలుతో చెప్పారు. గోడ మీద ఉన్న సుబ్రమణ్యస్వామి ఆయన్ని చూసి కనుబొమలను ఎత్తి చూసినట్లు అనిపించింది.
తమిళం : అశోకమిత్రన్
అనువాదం : గౌరీ కపానందన్
రంగస్థలం
- Advertisement -
- Advertisement -



