Saturday, December 27, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిసహస్రాబ్ది: తొలి పాతికేళ్లు.. సమాంతర సంకేతాలు

సహస్రాబ్ది: తొలి పాతికేళ్లు.. సమాంతర సంకేతాలు

- Advertisement -

నూతన సహస్రాబ్దిలో తొలి ఘట్టంగా-ఇరవై ఒకటో శతాబ్ది తొలి పాతికేళ్లు (2000-2025) మరికొద్ది రోజుల్లో ముగిసిపోతాయి. ప్రపంచానికీ ఈ దేశానికీ, తెలుగు రాష్ట్రాలకూ కూడా చాలా సంచల నాత్మకం, సంఘటనాభరితం ఈ కాలం. కేంద్రంలో వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బీజేపీ, ప్రాంతీయ పార్టీలూ, వామపక్షాల ఆధ్వర్యంలోని ప్రభుత్వాల పాలనలు, రాజకీయాలు, ఉద్యమాలు, పోరాటాలు, ప్రతిఘటనలూ, వ్యూహ ప్రతివ్యూహాలు చూసింది. శాస్త్ర, సాంకేతిక, కళా సాహిత్య సినీ మీడియా రంగాలలోనూ శరవేగంగా (ఇప్పుడు చెప్పాలంటే ఎ.ఐ వేగంగా) మార్పులు జరిగాయి. ఈ మార్పులూ మలుపులూ కుదుపులూ పూర్తిగా ఊహించనవీ కాదు, ఎవరూ అచ్చంగా అనుకున్నవీ కాదు. అవేవో ఒకవైపునే వున్నట్టు చిత్రించే ప్రయత్నాలు మాత్రం భారీగా జరిగిపోతున్నాయి. 2001 నుంచి పదమూడేండ్లు మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్నారు. తదుపరి పదకొండేళ్ల నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు.

ఆయన అప్రతిహత రాజకీయ శక్తినీ ఘటనా ఘటన సమర్థతనూ కీర్తించే శక్తులకూ వ్యక్తులకూ ఆయనను ఆశ్రయించుకుని మనుగడ సాగిద్దామనుకునే కుయుక్తులకూ లోటులేదు. ఆయన మహాశక్తిని గుర్తించడం వాస్తవికత అని భ్రమపెట్టేవారూ పుట్టుకొచ్చారు. పైగా ఇలాంటివారే మరోవైపున గతంలో వలె ప్రతిఘటించేవారు లేకుండా పోయారని, అందరినీ మోడీ చిత్తు చేశారని కథనాలు, వినిపిస్తూ వుంటారు. సహజంగానే ఈ క్రమంలో వారిని నిరతం నిశితంగా ప్రతిఘటించే సీపీఐ(ఎం)తో సహా కమ్యూనిస్టులపై, ప్రజా ఉద్యమాలపై లౌకిక ప్రజా స్వామిక వాదులపై ఎక్కువ కేంద్రీకరణతోనూ, అవకాశవాదులపై ప్రలోభాలతోనూ ఈ దాడి కొనసాగుతుంటుంది. సోషల్‌ మీడియా వ్యాప్తి పుణ్యాన ప్రతి క్షణం ప్రగతిశీల భావజాలాన్ని ఉద్యమాల కదలికనూ అపహాస్యం చేసే, కొట్టిపారేసే ధోరణులు ఇందులో భాగమవుతాయి.

మోడియాగా పేరు తెచ్చుకున్న బడా మీడియా ఇందుకు వినయ పూర్వకమైన వేదికగా మారిపో యిందని క్షణమైనా మర్చిపోకూడదు. ఒకవైపున రాజ్య వ్యవస్థలూ మరోవైపున దాన్ని ఆశ్రయించుకుని ఆకాశానికి ఎగబాకుతున్న అపార వ్యాపార సామ్రాజ్యాలు తమ స్వార్థ ప్రయోజనాలు సాగించు కోవడం, సమాంతర శక్తులను దెబ్బ తీసేందుకు దాడులు చేయడం ఏకకాలంలో జరిగిపోతున్నాయి. వీటన్నిటి మధ్య అంతస్సంబంధాన్ని బుద్ధిజీవులు ఉద్యమకారులు గ్రహించగలరు గనక నిరుత్సాహ పడవలసిన అవసరమే వుండదు. ఈ స్థాయిలో పోరాట శక్తులపై దాడిచేస్తే తప్ప వారి ఆధిపత్యరాజ్యం సాగే పరిస్థితి లేదన్న అంగీకారం కూడా అందులో లేదా? అదానీ వంటి వారు అంతర్జాతీయ బోనులోనే దొరికిపోలేదా? సామాజిక, రాజకీయ, రాజ్యాంగ కోణా లలో ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా విమర్శలకు గురికావలసినంత తీవ్రత గతంలో వుందా?

అన్ని రంగాలలో నిరసన
గొప్ప చరిత్రకారిణి రొమిలా థాపర్‌ 1978లో జనతా ప్రభుత్వంలో భాగంగా అప్పటి జనసంఘం విద్యాశాఖ తీసుకున్నప్పుడే దాడికి గురైన చరిత్ర పాఠాల రచయిత్రి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిఖిల్‌ చక్రవర్తి స్మారకోపన్యాసం చేస్తూ రొమిలా థాపర్‌ మితవాద, మతవాద పాలనలో రాబోయే పరిణామ క్రమం ఎలా వుండబోయేది సోదాహరణగా చెప్పారు. మళ్లీ 2025 సెప్టెంబరులోనూ ఒక సదస్సులో ఆమెకు ఘనమైన స్వాగతం పలికి సందేశం విన్నారు. మరో గొప్పచరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ కూడా చాలా విరామం తర్వాత ఈ మధ్యనే చారిత్రిక సందేశం వినిపించారు. కనుక పోరాడే శక్తులూ ప్రశ్నించే గొంతులూ ఏదో ఆగిపోయినట్టు చిత్రించడం కుటిలత్వం మాత్రమే.

తిరోగామి ధోరణులపై పోరాటానికి మరిన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆవరణలోనే మాజీ సిజెఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవారుపై చెప్పు విసిరిన ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఆ స్థానంలో వచ్చిన సిజెఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల రోహింగ్యాలను ఉద్దేశించి చేసిన అమానవీయ వ్యాఖ్యలు సరికాదని మాజీ సీనియర్‌ న్యాయమూర్తులు లేఖ రాయడం ఈ రోజు చూస్తున్నాం. ‘సర్‌’ తతంగంపై మాజీ సిఇసి ఎస్‌.వై ఖురేషి వంటి వారు బాహాటంగా అభ్యంతరాలు చెప్పడం వింటున్నాం. అంతెందుకు? 1972లో పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం)ను గెలవకుండా చేయడం కోసం మొదటిసారి ఎన్నికల ప్రక్రియపై నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సైన్యాన్ని ప్రయోగించి రిగ్గింగ్‌కు పాల్పడింది. అప్పుడు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ మాత్రమే గొంతు కలిపారు. తర్వాత చాలా పరిణామాలు పోరాటాలు జరిగాయి.

ఈ రోజున సర్‌ ప్రక్రియ పైన, ఇవిఎంల పైన పాలక పార్టీలే విమర్శలు గుప్పించడం లేదా? 2009లో ఇవిఎంలపై బీజేపీ మాజీ ఎంపీ జి.వి.ఎల్‌.నరసింహారావు పుస్తకం రాస్తే ప్రస్తుత ఏపీి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుమాట రాశారు! 2019లో 151 స్థానాలతో జగన్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీడీపీ సుప్రీంకోర్టులో కేసే వేసింది. నితీష్‌ కుమార్‌, చంద్రబాబు, కెేసీఆర్‌ వంటి వారు రాజకీయావసరాల కోసం యూటర్న్‌లు తీసుకోవచ్చున ేమోగాని ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి లక్ష్యాలకు నికరంగా కట్టుబడిన నిజమైన కమ్యూనిస్టులకు, అసలైన లౌకికవాదులకు పిల్లిమొగ్గలు వుండవు. చేగువేరా చిత్రంతో ఊగిపోయిన పవన్‌ కల్యాణ్‌ వంటి వారు హిందూత్వ సావర్కర్‌ చిత్రంతో ప్రత్యక్షం కావడం అధికార రాజకీయాల్లో జరుగుతుందిగానీ ఆశయబద్దమైన చోట జరగదు. పాతికేళ్ల కిందట ప్రపంచాన్నే ఆకర్షించిన విద్యుత్‌ ఉద్యమం తెలుగునాట జరిగిందే. ప్రభుత్వాలు మారితే పాలక పార్టీలూ అటూ ఇటూ వాదించవచ్చు గానీ విద్యుత్‌ ఉద్యమకారులు మాత్రం ఆ మార్గం విడవలేదే?

మోడీ భజన-సడలని సంఘర్షణ
బెర్జిస్‌ దేశారు అనే ప్రముఖ రచయిత ‘మోడీ మిషన్‌’ అంటూ రాసిన పుస్తకాన్ని రూపా సంస్థ ప్రచురించింది. ఇప్పటికీ భారతీయ మేధావులు మోడీ రహస్యం పట్టుకోలేకపోతున్నారని (డీ కోడ్‌), ఆయన ఎదుగుతూనే పోతున్నారని ఆ రచయిత చేసిన వ్యాఖ్య ప్రముఖంగా ప్రచారం పొందుతోంది (రాంగోపాల్‌వర్మ రాజకీయ చిత్రాలు తీసినట్టు గుర్రప్పందేలపైన, నేర పరిశోధనలపైన రాసే రచయిత ఈ బెర్జిస్‌). వామపక్ష భావాలు గలవారు గనకనే మోడీ అంటే ఈ మేధావులకు ఎలర్జీ అని ఆయన భక్తులు మొదట్లో ఆక్షేపించేవారు. మరోవైపున వారు నెహ్రూ, ఇందిరల ప్రాపకం వల్లనే చలామణి కాగలిగారని తిట్టిపోస్తూ వచ్చారు. ఇప్పటికీ బడా మీడియా నుంచి లోకల్‌ ఆర్ణబ్‌ గోస్వాముల వరకూ ఇవే శాపనార్థాలు గుప్పిస్తూనే వున్నారు. నిజంగా చరిత్రలో ఐన్‌స్టీన్‌, రవీంద్రనాధ్‌ టాగూర్‌, పికాసో, చార్లీ చాప్లిన్‌ నుంచి శ్రీశ్రీ వరకూ నాడూ నేడూ వామపక్ష భావుకులు శాంతి కాముకులు కావడం గర్వకారణమే.

అయితే రాజ్యాంగం కల్పించిన ఇలాంటి భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తూ విమర్శకులను నానా నిర్బంధాలకు గురిచేస్తుంటే చాలామంది ప్రముఖులు సుప్రీంకోర్టులో పోరాడుతున్నారేగానీ చేతులెత్తి సాగిలబడిన ఉదాహరణే లేదు. మరీ వికృత దాడులకు, వేధింపులకు గురవుతున్న మహిళలు కూడా చాలామంది వున్నారు. పోలీసుల, ప్రభుత్వాల ఆటంకాల వల్ల కొందరు అనుకున్న మేరకు చేయలేకపోవచ్చుగాని దారి మార్చలేదు. మతాన్ని రాజకీయాలతో మిళితం చేసి హిందూ వ్యతిరేకులుగా ముద్రలు వేసే ఈ దాడుల ఫలితంగా కొందరు తటస్తులమని ప్రకటించుకోవలసిన పరిస్థితీ రావచ్చు. రాజ్‌దీప్‌ సర్దేశారు వంటి వారి తంటాలు చూస్తున్నదే. అయినా ప్రజాస్వామ్య స్ఫూర్తి వున్నవారెప్పుడూ వివక్షనూ విద్వేషాన్ని సమర్థించబోరని ఈ కాలంలో రుజువైంది.

మారిన మాయోపాయాలు
గతానికి ఇప్పటికీ కీలకమైన తేడా సామాజికావరణం లోనూ ప్రజావరణంలోనూ వచ్చింది. ప్రజావరణం (పబ్లిక్‌ స్పేస్‌) కుదించి వేయబడింది. రచనలు, సెమినార్లు, చర్చలతో అవగాహనా బలంబట్టి గాక లైకులు, షేర్లు, వ్యూలు, రెవెన్యూలనే అమితంగా ప్రచారంలో పెట్టే ఈ వ్యవస్థ ఫలితంగా కొత్త రకం ఇన్‌ఫ్లుయన్సర్లు, మాస్‌ ఎంటర్‌టైనర్లు పుట్టుకొచ్చారు. వీరు విధానపరమైన అంశాల జోలికి పోకుండా పైపై మసాలాలతో మాయ చేస్తుంటారు. దీనివల్ల ప్రజా ప్రచార కథనాలు (పబ్లిక్‌ నేరేటివ్స్‌) హైజాక్‌ చేయబడుతున్నాయి. బడా మీడియా సంస్థల హస్తగతంతో పాటు సోషల్‌ మీడియాలోనూ గొలుసుకట్టు వ్యవస్థలూ, స్వంత సైన్యాలు ఏర్పాటు చేసుకున్న పాలక వర్గాలు చైతన్యవంతమైన గొంతులనూ ఐచ్ఛిక స్వరాలనూ కత్తిరించడానికి వెనకాడవు. గతంలో అంగీకార సృష్టి అన్న నామ్‌చామ్‌స్కీ సిద్ధాంతం పనిచేస్తే ఇప్పుడు వివిధ మీడియా ప్లాట్‌ఫాంలలో కూడా ఆల్గోరిథమ్స్‌ అనే వీక్షకుల లెక్కలు, ఆకర్షణలూ ఆ పనిచేస్తాయి.

తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పర్యటననే తీసుకుంటే ఆయన రాకకు ముందే మూడు పశ్చిమ దేశాల రాయబారులు కూడబలుక్కుని రాసిన ఒకే వ్యాసాన్ని పెద్ద పత్రికలు ప్రచురించాయి. దీనిపై ప్రభుత్వమే అసంతృప్తి వ్యక్తం చేయాల్సి వచ్చింది. కానీ కేంద్రం కూడా ప్రతిపక్ష నాయకులను కలుసుకోనివ్వకుండా అడ్డుపడింది. ఆయనతో అధికారిక విందుకు ప్రతిపక్ష నేతలనుగాక తమకు ఇష్టుడైన శశిథరూర్‌ను ఆహ్వానించింది. తమను తెలివిగా, పరోక్షంగా మోసేవాళ్లను ఇలా అన్నిచోట్లా పెంచుతున్నారు. ఇటీవల ఇదే పేజీలో చెప్పుకున్నట్టు సంఫ్‌ు పరివార్‌ వివిధ రకాల సంస్థల ద్వారా అనేక ప్రలోభాలతో సర్కారీ స్వరాలను పెంచుతూ స్వతంత్ర విమర్శకులను నిర్బంధానికి గురి చేస్తున్నది. అయినా సరే అటు ఉద్యమకారులు ఇటు బుద్ధిజీవులు గట్టిగా పోరాడుతూనే వున్నారు.

ఇటీవలనే ఖమ్మం జిల్లాలో రైతు నాయకుడు సామినేని రామారావు హత్య, నెల్లూరులో యువజన నాయకుడు పెంచలయ్య హత్య చూశాక ఎవరు దుష్టశక్తులను ఎదిరిస్తున్నదీ స్పష్టమైంది. దేశంలో మళ్లీ రైతాంగ ఉద్యమాలు, లేబర్‌ కోడ్‌లపై పోరాటం చూస్తూనే వున్నాం. పిపిపిపిల తతంగంపై పోరాటంగానీ, డేటా సంటర్‌లతో సహా కార్పొరేట్‌ భూ పందేరాలుగానీ తీవ్ర నిరసననే ఎదుర్కొనక తప్పడం లేదు. ఇండిగో విమానాలు ఒక్కసారిగా నిలిచిపోతే నిజాలు చాలా తెలిశాయి. ట్రంప్‌ గెలిచిన చోటనే మర్దానీ కూడా విజయం సాధించడం చూశాం. ఇవన్నీ యాదృచ్ఛికమైనవీ కాదు. పరస్పరం సంబంధం లేనివీ కాదు. చరిత్రలో విప్లవం పునరుద్ధరణ, పున:ఘర్షణలు నిరంతరం కొనసాగుతూనే వుంటాయి. ఈ పాతికేళ్ల పరిణామాలు చెబుతున్నదీ అదే.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -