ఎస్‌ఎల్‌బీసీ ఆగదు..అన్ని లిఫ్ట్‌లు పూర్తి చేస్తాం
ఐటీడీఏ, చెంచు ప్రాంతాల్లో అదనంగా 25 వేల ఇండ్ల నిర్మాణం
ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లు
రైజింగ్ సమ్మిట్‌తో ప్రపంచానికి చాటిచెబుతాం
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వట్లేదు?
దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
”మీకు మంచి రోజులు కాదు కేసీఆర్.. కొడుకు, అల్లుడు ముంచే రోజులు వస్తాయి.. బీఆర్‌ఎస్‌కు అసలు గుదిబండ కేటీఆరే.. మీ పార్టీని బొంద పెట్టడానికి.. మీ కొడుకు చాలు..” అని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో అభివృద్ధి లేక గోస పడ్డాం.. కనీసం రేషన్ కార్డులో పేరు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థా పనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ‘ప్రజాపాలన ప్రజావిజయోత్సవ’ సభలో ప్రసంగిం చారు. ఒకప్పుడు మంత్రులకు కూడా అపార్ట్‌మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇటీవల తన ఫామ్‌హౌస్‌లో ఇద్దరు సర్పంచులు, నలుగురు వార్డు మెంబర్లతో సమావేశం కావడాన్ని చూస్తే బాధ వేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేండ్లు అభివృద్ధి లేక గోస పడ్డామని, కనీసం రేషన్ కార్డులో పేరు కూడా చేర్చలేదని చెప్పారు. కానీ, తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లలాంటివని అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేదలకు సన్న బియ్యం ఇస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని సవాల్ విసిరారు.
పేదలకు ఇండ్లు ఇవ్వని కేసీఆర్ రూ.2వేల కోట్లతో 150 గదులతో గడీ మాత్రం కట్టుకున్నారని విమర్శించారు. వారి హయాంలో డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చిన చోట కేసీఆర్ ఓట్లు అడగాలి.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన దగ్గర తాము ఓట్లు అడుగుతాం.. అప్పుడు ప్రజలే తీర్పు చెబుతారన్నారు. ఆ పదేండ్లలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే 22 లక్షల ఇండ్లు ఇచ్చేవాళ్లమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని ప్రచారం చేశారని, అసలు ఉచిత కరెంటు పథకాన్ని తెచ్చింది తమ పార్టీ మాజీ సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలోనేనని గుర్తు చేశారు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదు.. ఫీజు, స్టార్టర్ కట్ చేసి ప్రజలు అధికారం లాగేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉపయోగపడుతోందన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ ఆగేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో నల్లగొండ జిల్లాపై కక్ష సాధింపు చర్యలతో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 10 కిలోమీటర్లు తవ్వలేని అసమర్థ పాలన బీఆర్‌ఎస్‌ది అని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో బండగట్టుకుని ఆత్మహత్య చేసుకున్నా ఎస్‌ఎల్‌బీసీ ఆగేది లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రతి నియోజకవర్గానికీ 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రాష్ట్రవ్యాప్తంగా 22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామని వివరించారు. ఐటీడీఏ, చెంచులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనంగా 25 వేల ఇండ్లు ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చామన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2004- 2014 వరకు లంబాడీ తండాలు, ఆదివాసీ గూడాల్లో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు చెప్పారు. దేవరకొండ నియోజకవర్గానికి నర్సింగ్ కళాశాల ఇస్తామని, ఇందుకుగాను వెంటనే అంచనాలు రూపొందించి పంపించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బాలునాయక్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, రానున్న పదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవిధంగా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని మహిళలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 8, 9వ తేదీలలో మహేశ్వరంలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాలను ప్రపంచానికి కండ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గిరిజనులు అత్యధికంగా ఉండే దేవరకొండ, అచ్చంపేట ప్రాంతాల్లో మద్దిమడుగును పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్దిమడుగులో ఏర్పాటు చేసుకుందామని అన్నారు. పెండ్లిపాకలతోపాటు, అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, ఎస్‌ఎల్‌బీసీ, డిండిని పూర్తి చేస్తామని చెప్పారు. ఈ సభలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి, డాక్టర్ వంశీకృష, మధుసూదన్‌రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు పాల్గొన్నారు.
ముందస్తులు అరెస్టులు
సీఎం పర్యటన నేపథ్యంలో చిట్యాలలో సీపీఐ(ఎం) నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో జిట్ట నగేశ్, అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, మేడి సుగణమ్మ ఉన్నారు. చింతపల్లి మండలంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఉడుగుంట్ల రాములు, బీఆర్‌ఎస్ నాయకులు ప్రసాద్, సి.కృష్ణను అరెస్టు చేశారు. నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి, మాజీ కౌన్సిలర్ హీరేకార్ రమేష్‌జీ, సభావత్ చంద్రమౌళినాయక్, గుజ్జుల కొండలు, చల్లా బ్రహ్మం, బీజేపీ నాయకులు కొమ్ము రాందాస్, గణేష్ తంగరాజును అరెస్టు చేశారు.



