– ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతుల ప్రచారం
– సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘బీజేపీని.. ఓడించాలి. కార్పొరేట్లను వ్యతిరేకించాలి. దేశాన్ని రక్షించాలి’ అనే నినాదంతో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. శుక్రవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ కె ఎం నేతలు హన్నన్ మొల్లా, బల్దేవ్‌సింగ్ నిహాల్కర్, రాజారామ్ సింగ్, పి. కృష్ణప్రసాద్, ప్రేమ్‌సింగ్, సత్యవాన్ మాట్లాడారు. ”బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు లాభాలు తెచ్చే విధంగా విధానాలు రూపొందిస్తూ దేశంలోని రైతులను మోసం చేస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకు న్నప్పటికీ, చారిత్రాత్మక పోరాటంలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. పోరాటంలో రైతులపై బనాయించిన అక్రమ కేసులు ఉపసంహరించుకోలేదు. లఖింపూర్ ఖేరీ హత్యాకాండ కుట్రలో ప్రమేయం ఉన్న కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా మంత్రిగానే కొనసాగుతున్నారు. రైతుల పోరాటనికి మద్దతు తెలిపిన న్యూస్‌క్లిక్ వెబ్ పోర్టల్‌పై తప్పుడు కేసు పెట్టారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లోకి రైతుల పోరాటాన్ని కూడా లాగారు. దేశభక్తి ఉన్న రైతులను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తు న్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1 నుంచి 5 వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తాం. సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్ కాపీని తగులబెడతాం. 26 నుంచి 28 వరకు 72 గంటల పాటు రాత్రి పగలు రాష్ట్ర రాజధానుల్లోని రాజ్‌భవన్‌ల ఎదుట మహాధర్నా నిర్వహిస్తాం.ఈమేరకు ఉమ్మడి కిసాన్ మోర్చా సమావేశంలో నిర్ణయించాం” అని తెలిపారు. రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం ఆపాలని హితవు పలికారు. రైతులు పండించిన పంటల ప్రభుత్వ సేకరణ, కనీస మద్దతు ధర చట్టాన్ని నిషేధించేం దుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నంచేస్తుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచారని, బ్లాక్ మార్కెటీర్లకు స్వేచ్ఛను ఇస్తున్నారని విమర్శించారు.