నిజమైన ప్రజా సేవకులను ఎన్నుకోవాలి
వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల అభ్యర్థులను గెలిపించాలి
విలేకరుల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి పని చేసే నాయకులకు ఓటు వేయాలని, నిజమైన ప్రజా సేవకులను ఎన్నుకోవాలని, వామపక్ష ప్రజాతంత్ర లోక శక్తుల అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రజాప్రతితులపై ఒత్తిడీ తీసుకొస్తూ గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే నాయకులను ఎన్నుకోవాలన్నారు.
నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే ఆలోచన కేవలం వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తుల అభ్యర్థులకు మాత్రమే ఉంటుందని అలాంటి వారిని ప్రజాపతినిధులుగా ఎన్నుకుంటే సమస్యలు పరిష్కారం కావడంతో పాటు గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సమస్యలు నిర్వీర్యం కాకుండా గ్రామాల అభివృద్ధికి అవసరమైన సంక్షేమం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామాల ప్రతిష్ట పెంచే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కువ చోట్ల ఒంటరిగానే పోటీ చేస్తున్నామని కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రచారం సాగుతుందని ప్రజల నుండి సానుకూల వాతావరణం ఉందని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పాదూరి శశిధర్ రెడ్డి, వినోద్ నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు గోవింద్ రెడ్డి, దయానంద్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.



