జవహర్‌నగర్‌లో నడిరోడ్డుపై రియల్టర్ దారుణ హత్య
పాత కక్షలే కారణమని భావిస్తున్న పోలీసులు
నవతెలంగాణ- జవహర్ నగర్
నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు వేట కత్తులతో అతి కిరాతకంగా పొడిచి, తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంట వెంకటరత్నం(54) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కాప్రా సాకేత్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన కుమార్తెను కాలనీలోని పూస్టర్ బిల్లా బాంగ్ స్కూల్‌లో వదిలాడు. తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని వెంబడించి వేట కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చారు. అనంతరం బండరాయితో మోదారు. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేట కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా.. : మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్
ఘటనా స్థలాన్ని జవహర్‌నగర్ సీఐ సైదయ్యతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హత్య జరిగిన సమాచారం రాగానే పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీంలతో కలిసి విచారణ చేస్తున్నామన్నారు. మృతుడి తలలో బుల్లెట్ ఉన్నదని, కత్తులతో తల, మెడ, కడుపు, వీపుపై నరికి, బండరాయితో మోది చంపారని తెలిపారు. ఆటోలో నలుగురు, యాక్టివాపై ఇద్దరు దుండగులు వచ్చి దాడి చేసి చంపారన్నారు. మృతుడిపై ధూల్‌పేట్‌లో మర్డర్ కేసు, రౌడీషీట్ ఉన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయని, అతనిపై జవహర్‌నగర్ పీఎస్ పరిధిలో అయితే ఎలాంటి కేసులూ లేవని అన్నారు. ధూల్‌పేటలో కేసులు ఉన్నాయా లేదా? పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
వేట కత్తులతో పొడిచి.. తుపాకీతో కాల్చి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



