నవతెలంగాణ – సదాశివపేట
గొల్లగూడెం గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తూ మరోసారి ప్రజాశీర్వాదం ఇవ్వాలని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మునిగే సుజాత నవీన్ కుమార్ గ్రామస్తులను అభ్యర్థించారు. మంగళవారం గొల్లగూడెం గ్రామంలోని వివిధ వార్డుల్లో పోటీ చేస్తున్న వార్డు సభ్య అభ్యర్థులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు సహకరించాలని ఆమె కోరారు. 2019 గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తన భర్తకు ఇచ్చిన ఆశీర్వాదంతో గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా గణనీయమైన పనులు చేశామని సుజాత నవీన్ అన్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, వీధి దీపాల ఏర్పాటు, స్మశానవాటిక అభివృద్ధి, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, కొత్త పంచాయతీ కార్యాలయ నిర్మాణం వంటి పనులు పూర్తి చేశామని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక దళిత బంధు పథకంలో, నియోజకవర్గంలోనే గొల్లగూడెం గ్రామానికి అత్యధికంగా 48 కుటుంబాలకు ఒక్కొక్కటీ రూ. 10 లక్షల చొప్పున రూ. 4.80 కోట్లు మంజూరు కావడం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్, పెన్షన్లు వంటి పథకాల ప్రయోజనాలు గ్రామ ప్రజలకు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకున్నామని చెప్పారు.గ్రామస్తుల కోరిక మేరకు మల్లన్న గుడి వద్ద కళ్యాణ మండపం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పహరాగా ఉండి, వారి కష్టసుఖాల్లో భాగస్వాములమై పనిచేస్తున్నామని, మరోసారి సర్పంచ్‌గా గెలిపిస్తే విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గొల్లగూడెం అభ్యున్నతికి తన సేవలను కొనసాగించే అవకాశాన్ని ఇవ్వాలని ఆమె గ్రామ ప్రజలను అభ్యర్థించారు.



