– సంఘ్ పరివార్ రాజకీయాలతో బిజీ
– ఎస్‌సీఓ సమావేశ బహిష్కరణతో ఇది నిరూపితం
– ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘంతీరుపై పలు ట్రేడ్ యూనియన్లు
– ఇటీవలే బీజింగ్‌లో షాంఘై కోఆపరేషన్ మొదటి సమావేశం
న్యూఢిల్లీ : హిందూత్వ సంస్థ ఆరెస్సెస్ అనుబంధ కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తీరుపై భారత్‌లోని పలు కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. షాంఘై కోఆపరేషన్ (ఎస్‌సీఓ) సభ్య దేశాల ట్రేడ్ యూనియన్ నాయకుల మొదటి సమావేశాన్ని బీఎంఎస్ బహిష్కరించటాన్ని విమర్శించాయి. పహల్గాందాడి, తదనంతర పరిస్థితులను కారణాలుగా చూపెడుతూ బీజింగ్‌లో ఈనెల 15, 16 తేదీలలో జరిగిన ఈ సమావేశానికి బీఎంఎస్ హాజరుకాలేదు. అయితే, పహల్గాందాడి, భారత్-పాక్-చైనా అంటూ బీఎంఎస్.. సంఫ్‌ు పరివార్ రాజకీయాలు చేస్తున్నదని ఈ సమావేశానికి హాజరైన సీఐటీయూ, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) వంటి కీలక కార్మిక సంఘాలు ఆరోపించాయి. కార్మికలు సంక్షేమం బీఎంఎస్‌కు పట్టదని విమర్శించాయి.
బీఎంఎస్ నిర్ణయంపై ఏఐటీయూసీ స్పందించింది. ”నేను నా ప్రసంగంలో ఉగ్రవాద అంశాన్ని లేవనెత్తాను. నా వైఖరిని ఇతర కార్మిక సంఘాలు కూడా స్వాగతించాయి. ఈ సమావేశం ఆమోదించిన ప్రకటన.. ఉగ్రవాదాన్ని ఖండించింది. ఎస్‌సీఓ ప్రపంచ జనాభాలో 45 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న వేదిక. ట్రేడ్ యూనియన్ ప్రతినిధులుగా.. మా ఆందోళన కార్మిక సంఘాల కార్యకలాపాల పైనే ఉంటుంది. కార్మికుల హక్కులు, వారిపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం, గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సమస్యలు వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కానీ, అలాంటి కార్యక్రమాన్ని బీఎంఎస్ బహిష్కరించింది. ఈ చర్యతో బీఎంఎస్ కార్మికుల సమస్యల విషయంలో మద్దతు ఇవ్వటం లేదని స్పష్టమైంది. ఇది సంఫ్‌ు పరివార్ రాజకీయాలను చేస్తున్నదని నిరూపితమైంది” అని ఏఐటీయూసీ నాయకుడు విద్యా సాగర్ గిరి ఆరోపించారు.
ఇటు బీఎంఎస్ తీరును సీఐటీయూ తప్పుబట్టింది. ఎస్‌సీఓ సమావేశమనేది భారత్, పాక్ గురించి కాదనీ, కార్మికుల గురించని సీఐటీయూ నాయకుడు ఆర్. కరుమలయన్ అన్నారు. శ్రామికవర్గ అంతర్జాతీయవాదంపై తాము సమావేశానికి హాజరయ్యామనీ, మా ప్రతినిధి స్వదేశ్ దేబ్రాయ్ సమావేశంలో కార్మికుల సమస్య లను లేవనెత్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తొలుత బీఎంఎస్ నిర్ణయించుకున్నది. ఇందుకోసం, తమ ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని సైతం పంపేందుకు సిద్ధమైంది. అయితే, పహల్గాం దాడుల నేపథ్యంలో ఎస్‌సీఓ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయానికి రావటం గమనార్హం. ఎస్‌సీఓ సమావేశాన్ని ఆల్ చైనా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారత్‌లోని పలు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో సీఐటీయూ, ఏఐటీయూసీ వంటి ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు. చైనా చొరవతో ఈ సమావేశం మొదటిసారి జరిగిందని ఎస్‌సీఓ సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించింది. కార్మికులకు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరిగాయని పేర్కొన్నది.
కార్మికుల సమస్యలు పట్టని బీఎంఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES