– 40వ వర్ధంతి సందర్భంగా నిర్వహణ
– ”భగత్‌సింగ్ ప్రాసంగికత-నేటి రాజకీయాలు” అనే అంశంపై ప్రొఫెసర్ చమన్‌లాల్ ప్రసంగం : వివరాలు వెల్లడించిన ఎస్వీకే కార్యదర్శి వినయకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట ముఖ్య నాయకుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య. 40వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ”భగత్‌సింగ్ ప్రాసంగికత- నేటి రాజకీయాలు” అనే అంశంపై సోమవారం స్మాకోపన్యాసాన్ని నిర్వహిస్తున్నట్టు ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినయకుమార్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎస్వీకేలో ఆయన విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుందరయ్య పోరాటస్ఫూర్తితో విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్మించారనీ, ఆ ఉద్యమాల వల్ల పేదలు, రైతులకు ప్రయోజనం కలిగిందని చెప్పారు. ఆయన మరణించిన రెండేండ్లకే హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అనంతరం గచ్చిబౌలిలోని విశాల ప్రాంగణంలో ఆయన పేర మరో విజ్ఞాన కేంద్రం ప్రారంభమైందన్నారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో దాదాపు నాలుగు లక్షల పుస్తకాలు, మాగజైన్లు అరుదైన రాతపత్రులు గచ్చిబౌలి గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఉచిత వైద్యశిబిరాల వంటి సేవా కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. మరోవైపు బాగ్‌లింగంపల్లిలోని ఎస్వీకే నిరంతరం వివిధ రాజకీయ, సామాజిక, సభలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా మారిందని గుర్తుచేశారు. సివిల్స్, వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ యువకుల కోసం ఉచిత స్టడీ హాల్‌ను కేటాయించినట్టు చెప్పారు. భవన ప్రాంగణంలో కంప్యూటర్ కోర్సులు నేర్పించే నియోకర్సర్ సెంటర్ నడుస్తోందన్నారు. మహిళలకు కుట్టుశిక్షణా, జూట్ శిక్షణా కేంద్రం, బ్యూటీషన్ శిక్షణ, కూచిపూడి నృత్యం, శాస్త్రీయ సంగీతం (వోకల్)లో శిక్షణలు ఇస్తున్నట్టు తెలిపారు. ఎస్వీకే ప్రాంగణంలోనే క్లినిక్ నడుస్తోందనీ, పిల్లల స్పెషలిస్టు, ప్యామిలి ఫిజిషియన్, డయాబెటా లజిస్టు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. అక్యుపంచర్ క్లినిక్, ఫిజియో థెరపితో పాటు తక్కువ రేట్లకు రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహించే లాబోరేటరీ ఉందన్నారు. తరచూ వివిధ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ సుందరయ్య ఆచరించిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించడానికి జనరిక్ మందులను అందుబాటులోకి తెచ్చామనీ, అక్కడితో ఆగకుండా రాష్ట్రంలో పది జనరిక్ షాపులను ఏర్పాటు చేశామన్నారు. వాటికి ఉత్తమ లఘుచిత్రాలను ప్రోత్సహించే లక్ష్యంతో దాశరధి ఫిల్ము సొసైటీని ఏర్పాటు చేసి, నెలలో రెండు సార్లు లఘుచిత్రాలను ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఒక ప్రముఖుడి చేత ముఖ్యమైన అంశంపై స్మారకోపన్యాసాన్ని ఇప్పిస్తున్నామని వినయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఐదున్నరకు ”నేటి రాజకీయాలు భగత్‌సింగ్ ప్రాసంగికత” అనే అంశంపై ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ చమన్‌లాల్‌తో స్మారకోపన్యాసాన్ని ఇప్పిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సభకు ఎస్వీకె ట్రస్టు అధ్యక్షుడు బి.వి. రాఘవులు అధ్యక్షత వహిస్తారనీ, కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడతారని తెలిపారు. విలేకర్ల సమావేశంలో భూపతి వెంకటేశ్వర్లు, రమణారావు పాల్గొన్నారు.
నేడు పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES